దిశ దశ, కరీంనగర్:
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను సాధించుకున్న ఆ నేత తనయుడు ఎదురీదుతున్న తీరే ఆశ్యర్యకరంగా మారింది. బలమైన నేతగా పేరు గాంచిన ఆయన తన మార్కు పాలిటిక్స్ కు బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు. కానీ ఆయన తనయుడు మాత్రం ప్రజల మనసులు గెలుచుకోలేకపోతున్నారు. కరీంనగర్ లోకసభ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ ప్రస్థానంపై ఓ లుక్కేద్దాం.
జగపతి రావు…
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నేతల్లో వెలిచాల జగపతి రావు ఒకరు. 1972లోనే జగిత్యాల నుండి ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన 1989 ఎన్నికల్లో కరీంనగర్ నుండి ఇండిపెండెంట్ అభ్యర్థిగా గెలిచారు. మార్క్ ఫెడ్ ఛైర్మన్, కెడిసీసీ బ్యాంకు ఛైర్మన్ తో పాటు ఇండిపెండెంట్ ఎమ్మెల్యేల ఫోరం కన్వీనర్ గా, తెలంగాణ ఎమ్మెల్యేల నేతగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. తెలంగాణ వెనుకబాటుతనంపై రచనలు చేసిన చరిత్ర కూడా జగపతి రావు సొంతం. కరీంనగర్ పాలిటిక్స్ లో ఓ ప్రత్యేకమైన పేరు అందుకున్న ఆయన గురించి అప్పటి తరానికి చెందిన వారు ఇప్పటికీ చర్చించుకుంటారు.
రాజేందర్ రావు…
అయితే తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని ప్రత్యక్ష్య రాజకీయాల్లో సత్తా చాటుకోవాలని ప్రయత్నిస్తున్న జగపతి రావు తనయుడు రాజేందర్ రావు మాత్రం ప్రత్యక్ష్య రాజకీయాల్లో సక్సెస్ కాలేకపోతున్నారు. చొప్పదండి నుండి ఓ సారి ఇండిపెండెంట్ ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన 2009లో ప్రజారాజ్యం పార్టీ తరుపున కరీంనగర్ ఎంపీగా బరిలో నిలిచారు. తాజాగా కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన రాజేందర్ రావు రెండో స్థానంతో సరిపెట్టుకోవల్సి వచ్చింది. తండ్రి జగపతి రావులా రాజేందర్ రావు చట్టసభకు ఎన్నిక కాలేకపోతుండడం విచిత్రంగా మారింది. కరీంనగర్ జిల్లా ప్రజలతో కూడా అనుభంద ఉన్నప్పటికీ ఆయనను ఆదరించేందుకు ఇక్కడి ప్రజలు ఎందుకు ముందుకు రావడం లేదన్నదే పజిల్ గా మారింది.
ముందుగానే…
అయితే కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అభ్యర్థిగా రాజేందర్ రావు పేరును ముందుగానే ప్రకటించినట్టయితే గెలిచే వారన్న వాదనలు కూడా వినిపిస్తున్నారు. చివరి నిమిషం వరకు ఉత్కంఠతను రేకె్త్తించి అభ్యర్థిగా ప్రకటించడం వల్ల సమీకరణాలు చేసుకోలేకపోయారన్న అభిప్రాయలు వ్యక్తం చేస్తున్నారు ఆయన సన్నిహితులు. అయితే రాజేందర్ రావు కూడా స్థానికంగా ఉండరన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగింది. ఎన్నికల్లో ఓడిపోయిన తరువాత స్థానికంగా ఉండకపోవడం, ప్రజలకు కనిపించకపోవడం కూడా మైనస్ అయిందని అంటున్న వారూ లేకపోలేదు.