సర్కారు కార్యాలయాలే టార్గెట్: ఇరిగేషన్ డివిజన్ 5లో చొోరీ

దిశ దశ, మానకొండూరు:

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో సర్కారు కార్యాలయాలే టార్గెట్ గా దొంగతనాలు జరుగుతున్న తీరు సంచలనంగా మారింది. కేవలం ప్రభుత్వ ఆఫీసులనే లక్ష్యం చేసుకుని చోరీలకు పాల్పడుతుండడం చర్చనీయాంశంగా మారింది. మూడు నెలల్లో మూడు ప్రభుత్వ కార్యాలయాల్లో చోరీలు జరుగడం విస్మయానికి గురి చేస్తోంది. అక్టోబర్ నెల చివర్లో ఏకంగా కలెక్టర్ క్యాంప్ ఆఫీసులోకి అగంతకుడు చొరబడి ల్యాప్ ట్యాప్ ఎత్తుకెళ్లిన సంగతి తెలిసిందే. ఇటీవల కరీంనగర్ కలెక్టరేట్ కాంప్లెక్స్ లో ఉన్న రిజిస్ట్రేషన్ ఆఫీసులో చోరీ జరిగింది. తాజాగా ఆదివారం లోయర్ మానేరు డ్యాంలోని ఇరిగేషన్ డివిజన్ నెంబర్ 5 ఆఫీసులో సీపీయు, మానిటర్లు ఎత్తుకెళ్లడంతో పాటు మరో ఆఫీసులో కూడా చోరీ చేసేందుకు విఫలయత్నం చేశారు. దీంతో కరీంనగర్ లోని ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యం చేసుకుని దొంగతనాలు జరుగుతుండడం ఆందోళన కల్గిస్తోంది. సాధారణ పౌరులు నివసించే ఇండ్లలో చోరీలు జరిగడం సాధారణం వారు బంగారు ఆభరణాలు కానీ నగదు కానీ తమ తమ ఇండ్లలో దాచుకుంటారని వాటిని ఎత్తుకెళ్లేందుకు చోరీలకు పాల్పడుతుంటారు అగంతకులు. అయితే కరీంనగర్ లో మాత్రం ప్రభుత్వ కార్యాలయాలే టార్గెట్ గా చోరీ జరుగుతుండడం వెనక ఆంతర్యం ఎంటన్నదే అంతు  చిక్కకుండా పోతోంది.

రికార్డులు మాయం చేస్తున్నారా…? 

గవర్నమెంట్ ఆఫీసుల్లో మాత్రమే దొంగతనాలకు పాల్పడుతుండడం కంప్యూటర్లతో పాటు రికార్డులు ఎత్తుకెళ్తుండడాన్ని గమనిస్తుంటే కావాలనే రికార్డులు మాయం చేసేందుకు ఎవరైనా కుట్ర చేస్తున్నారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినప్పటికీ చోరీలకు పాల్పడుతున్న వారు అంత ధైర్యంగా సర్కారు కార్యాలయాల్లోకి చొరబడుతున్న తీరు విస్మయం కల్గిస్తోంది. కేవలం విలువైన వస్తువుల కోసమే అగంతకులు చోరీలకు పాల్పడుతున్నట్టయితే గవర్నమెంట్ ఆఫీసుల్లో మాత్రమే ఎందుకు దొంగతనాలు చేస్తారన్న అనుమానం కూడా వ్యక్తం అవుతోంది. అంతేకాకుండా కంప్యూటర్లు ఇతర సామాగ్రి  కో్సమే అయితే నగరంలో ఎన్నో షాపుల్లో వీటిని విక్రయిస్తున్నా విషయం విధితమే. ఆయా చోట్ల చోరీలకు పాల్పడకుండా ప్రభుత్వ కార్యాలయాలనే లక్ష్యం  చేసుకుంటున్న తీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఏ ప్రభుత్వ ఆఫీసులో అయినా రికార్డులకు సంబంధించిన ఫైళ్లు తప్ప విలువైన వస్తువులు కానీ, నగదు కానీ ఉండవనేది జగమెరిగిన సత్యం. అలాంటప్పుడు సర్కారు ఆఫీసుల్లో మాత్రమే   దొంగలు చొరబడడానికి కారణాలు ఏంటన్నది తేలాల్సి ఉంది.  గతంలో ఏనాడు లేని విధంగా ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగతనాలు జరుగుతుండడం వెనక ఆంతర్యం ఏంటన్న విషయంతో పాటు వివిధ కోణాల్లో ఈ చోరీలపై దర్యాప్తు చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

క్యాంప్ ఆఫీస్ ఎఫెక్టా..?

అక్టోబర్ చివర్లో ఏకంగా జిల్లా కలెక్టర్ క్యాంప్ ఆపీసులో చోరీ జరిగిన తరువాతే ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో దొంగతనాలు జరుగుతుండడం గమనార్హం. కలెక్టర్ క్యాంప్ ఆఫీసు చోరీ విషయాన్ని గోప్యంగా ఉంచినప్పటికీ బయటకు రావడంతో పోలీసులు దొంగను పట్టుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టాల్సి వచ్చింది. దొంగను అరెస్ట్ చేసి ల్యాప్ ట్యాప్ స్వాధీనం చేసుకున్నారు. ఆ తరువాత కరీంనగర్ రిజిస్ట్రేషన్ ఆఫీసులో జరిగిన చోరీలో ఫైళ్లు మాయం అయినట్టుగా తెలుస్తోంది. తాజాగా ఎల్ఎండీలోని డివిజన్ నంబర్ 5వ కార్యాలయంలో కూడా 4 సీపీయూలు, 4 మానిటర్లు, 2 ప్రింటర్లను ఎత్తుకెళ్లారు. గతంలో కూడా ఇక్కడి ఇరిగేషన్ ఆఫీసులో దొంగతనం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ కార్యాలయంలో  కొత్తపల్లి కెనాల్ దిగువ ప్రాంతం, లోయర్ మానేరు డ్యాం రిజర్వాయర్, ఎల్ ఎండీ క్యాంప్ ఆఫీసు, శంకరపట్నం మండలం తాడికల్ వరకు పరిధి ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రభుత్వ ఆఫీసుల్లో చోరీలకు పాల్పడడం వెనక కుట్ర కోణం ఏమైనా ఉందా అన్న విషయంపైనా ఆరా తీయాల్సిన అవసరం ఉందని అంటున్న వారూ లేకపోలేదు.

You cannot copy content of this page