ఆ లారీలు అక్కడే ఎందుకు ఆగాయి..?

మంథని మిల్లులో ధాన్యం లారీల తీరు…

దిశ దశ, పెద్దపల్లి:

మంథని రైస్ మిల్లులో ఆగిన ధాన్యం లారీల వ్యవహారంలో మరో కొత్త కోణం చోటు చేసుకుంది. ఆ లారీలు అక్కడ ఆపడానికి కారణం వేరే ఉందని, ధాన్యాన్ని అక్కడ దింపేందుకు మాత్రం కాదని లారీ డ్రైవర్లు చెప్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయంపై శనివారం పెద్దపల్లి జిల్లా అధికారులు చేపట్టిన విచారణలో డ్రైవర్లు ఇచ్చిన వాంగ్మూలంతో అంతా సద్దుమణిగినట్టే కనిపిస్తోంది.

అక్కడే ఎందుకు ఆగాయి..?

అయితే శనివారం ఉదయం మంథని శివారల్లలోని కూచిరాజ్ పల్లి మిల్లు ఆవరణలో రెండు లారీలు ఆగి ఉన్నాయన్న ఆరోపణల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా సివిల్ సప్లై అధికారులు విచారణ జరిపినట్టు సమాచారం. వీరు సుల్తనాబాద్ సమీపంలోని పూసాల రైమిల్లుల్లో విచారణ చేపట్టి డ్రైవర్ల వాంగ్మూలం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. డ్రైవర్లు ఇచ్చిన స్టేట్ మెంట్ ప్రకారం వారు భోజనం కోసం మంథని శివార్లలో ఆగినట్టు చెప్పారని, అయితే ఓనర్ ను కూడా అక్కడకు రావాలని అధికారులు కోరినప్పటికీ లారీల యజమాని మాత్రం అధికారుల ముందు హాజరు కానట్టు సమాచారం. అయితే డ్రైవర్లు ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి వారు భోజనం చేసేందుకు మంథని దగ్గరి కూచిరాజ్ పల్లి వద్ద లారీలను ఆపేశామని చెప్పినట్టు తెలుస్తోంది. మరో లారీ కోసం అక్కడ ఎదురు చూశామే తప్ప తాము అన్ లోడింగ్ కు మాత్రం కాదని డ్రైవర్లు తేల్చి చెప్పినట్టు సమాచారం. సంబంధిత అధికారులు కూడా ఇదే అంశాన్ని వివరిస్తూ డ్రైవర్లు వ్యక్తిగత అవసరాల కోసం రోడ్డు పక్కన లారీలు నిలిపివేశారు తప్ప మరో కారణమేది లేదని చెప్తున్నారు. ఈ వ్యవహారంలో ఫిర్యాదు చేసిన వారికి మిల్లర్ కు మధ్య లావాదేవీలకు సంబంధించిన గొడవుల కూడా ఉన్నందున ఇష్యూ అయిందని కూడా ప్రచారం జరుగుతోంది.

అదేలా సాధ్యం…?

శనివారం ఉదయం 9 గంటల ప్రాంతంలో కొనుగోలు కేంద్రంలో లోడ్ చేసుకుని 5 నుండి 7 కిలోమీటర్ల దూరం వచ్చిన లారీలు కూచిరాజ్ పల్లి సమీపంలోని మిల్లు ఆవరణలో ఆగిపోయిన వీడియోలు ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే 10 గంటల నుండి 11 గంటల ప్రాంతంలో ఈ లారీలు అక్కడ ఆగినట్టుగా ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో డ్రైవర్లు చెప్తున్న విషయాలకు పొంతన లేకుండాపోతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉదయం 10 గంటల ప్రాంతంలో భోజనం చేసే ఆనవాయితీ ఉంటుందా..? డ్రైవర్లు ఆ సమయంలో భోజనం చేస్తారా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అయితే ఆ లారీలు అక్కడే ఆపడం వెనక ఆంతర్యం ఏంటన్నది మాత్రం మిస్టరీగా మారిపోయింది. భోజన హోటళ్లు అంతగా లేని కూచిరాజ్ పల్లిలో లారీలు నిలపడం ఎందుకోనన్నది అంతుచిక్కకుండా పోతోంది. వేరే అవసరాల కోసం లారీ డ్రైవర్లు రోడ్డు పక్కన ఆపారని సివిల్ సప్లై అధికారులు చెప్తున్న విషయాన్ని పరిగణనలోకి తీసుకున్నట్టయితే సదరు లారీలో మిల్లు ఆవరణలో ఎందుకు పార్క్ చేసి ఉన్నాయి..? ఒక వేళ ఖాలీ స్థలం కోసం పార్క్ చేసినట్టయితే గోదాముల సమీపంలో ఎందుకు నిలుపుతారన్నది తేలాల్సి ఉంది. శనివారం మద్యాహ్నం సుల్తనాబాద్ సమీపంలోని పూసాల మిల్లులో విచారణ చేపట్టిన అధికారులు ఈ కథ ముగిసిపోయిందన్న రీతిలో మీడియాకు వివరించిన తీరు కూడా విస్మయానికి గురి చేస్తోంది. మరో వైపున పూసాలలోని సదరు మిల్లులో 150 లారీల బియ్యం ఇప్పటికే రవాణా చేసి ఉన్నందున ఇక్కడ లెక్కలు తేల్చడం అంత సులువు కాదని కూడా సంబంధిత శాఖ అధికారులు ఓ నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. ఈ కారణంగానే ఈ వ్యవహారాంలో విచారణకు ఇంతటితో బ్రేకులు పడినట్టేనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

ఆ మిల్లులోనే…

శనివారం లారీలు ఆ మిల్లు ఆవరణలోనే పార్క్ చేయాల్సిన ఆవశ్యకత ఏంటన్నది తేల్చాల్సిన అవసరం ఉంది. ఈ మిల్లుకు గతంలో కెటాయించిన ధాన్యం తాలుకు బియ్యం సీఎంఆర్ ద్వారా సివిల్ సప్లై విభాగానికి అప్పగించకపోవడంతో సంబంధిత శాఖ అధికారులు బ్లాక్ లిస్టులో ఉంచారు. ఇప్పటికే డ్యూ ఉన్న సీఎంఆర్ తాలుకూ బియ్యాన్ని సేకరించి సివిల్ సప్లై విభాగానికి అందించే పనిలో మిల్లు యాజమాన్యం నిమగ్నమైనట్టు సమాచారం. ఈ క్రమంలో సుల్తానబాద్ కు చేరాల్సిన బియ్యం లారీలు అదే మిల్లుకు ఎందుకు వెళ్లాయన్నదే స్థానికుల ప్రశ్న. కానీ ఇవేమి పట్టించుకోకుండా మిల్లు ఆవరణలోకి ధాన్యం లారీలు వెల్లలేదని రోడ్డు పక్కన పార్క్ చేసుకున్నారని ఒక వాదన, డ్రైవర్లు భోజనం కోసం ఆగారని మరో వాదన తెరపైకి రావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

You cannot copy content of this page