ఖమ్మం గడ్డపై బీఆర్ఎస్ ఆవిర్భావ సభకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. బీఆర్ఎస్ ఏర్పాటు తర్వాత తొలి బహిరంగ సభ ఇదే కావడంతో.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది. ఇతర రాష్ట్రాల సీఎంలు, పలువురు జాతీయ నేతలు ఈ బహిరంగ సభకు హాజరుకానుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఈ సభకు హాజరవుతున్నారు.
పలు రాష్ట్రాల సీఎంలను ఖమ్మం ఆవిర్బావ సభకు ఆహ్వానించిన సీఎం కేసీఆర్.. పొరుగు రాష్ట్రమైన ఏపీ సీఎం జగన్‌ను ఆహ్వానించకపోడం చర్చనీయాంశంగా మారింది. తెలుగు రాష్ట్రాల సీఎంలు కేసీఆర్, జగన్ మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. జగన్ సీఎం అయిన తర్వాత పలుమార్లు కేసీఆర్‌ను కూడా కలిసి ఆశీర్యాదం తీసుకున్నారు. ఇప్పటికీ జగన్, కేసీఆర్ మధ్య సంబంధాలు బాగానే ఉన్నాయి. అయినా జగన్‌ను కేసీఆర్ పిలవకపోవడం వెనుక అనేక కారణాలు వినిపిస్తోన్నాయి.
సీఎం జగన్ బీజేపీకి మద్దతుగా ఉంటున్నారు. బీజేపీకి అన్ని విషయాల్లో జగన్ మద్దతు ఇస్తున్నారు. విభజన హామీల విషయంలో కూడా బీజేపీని జగన్ గట్టిగా ప్రశ్నించడం లేదు. బీజేపీకి అనుకూలంగానే ఏపీలో జగన్ వ్యవహరిస్తున్నారు. అందుకే జగన్‌ను కేసీఆర్ పిలవలేదనే టాక్ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. తెలంగాణలో బీజేపీని కేసీఆర్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రజావ్యతిరేక నిర్ణయాలపై కేసీఆర్ గట్టిగా గళం వినిపిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఖమ్మం సభకు జగన్‌ను పిలిస్తే.. టాపిక్ డైవర్ట్ అయ్యే అవకాశముంది.
సభ హైలెట్ కాకుండా సీఎం జగన్‌ను ఆహ్వానించిన విషయం మీడియాలో హైలెట్ అయ్యే అవకాశముంది. అంతేకాకుండా ఏపీలో ఓట్లను చీల్చి జగన్‌కు అనుకూలంగా చేసేందుకు కేసీఆర్ ఏపీలో బీఆర్ఎస్ విస్తరణ చేపట్టారనే టాక్ జోరుగా వినిపిస్తోంది. జగన్‌ను ఆహ్వానిస్తే ఆ ప్రచారానికి బలం చేకూరే అవకాశముంది. అందుకే జగన్‌ను కేసీఆర్ పిలవలేదని అంటున్నారు.