దిశ దశ: భూపాలపల్లి:
రాష్ట్ర ప్రభుత్వం ఇసుక అక్రమ రవాణాపై కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. గతంలో కంటే తక్కువ ఆదాయం వస్తున్న నేపథ్యంలో ప్రక్షాళన చేయాలని భావిస్తోంది. మైనింగ్ విభాగం ఉన్నతాధికారులు ఇందుకు సంబంధించిన కసరత్తులు చేస్తున్నారు. ఇందులో భాగంగా రీచుల వద్ద సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించిన ఉన్నతాధికారులు వివిధ శాఖల సమన్వయంతో రీచుల వద్ద పర్యవేక్షణ చేపట్టాలని నిర్ణయించారు. నదుల నుండి ఇసుక సేకరించి స్టాకు యార్డుల వరకు నిర్వాహకుల బాధ్యతను పరిమితం చేసి మిగతా వ్యవహారాలన్ని అధికార యంత్రాంగమే చక్కబెట్టే విధంగా ప్లాన్ చేస్తున్నారు. క్షేత్ర స్థాయిలో ఆయా శాఖల అధికారులు పర్యటిస్తూ స్టాకు యార్డుల నుండి ప్రధాన రహదారికి అనుసంధానం చేసే రహదారులు, స్టాకు యార్డుల వద్ద జరుగుతున్న లోడింగ్ విధానం, ఓవర్ లోడ్ వ్యవహారలను కట్టడి చేయడం వంటి చర్యలపై దృష్టి సారించారు. 2019లో రూ. 900 కోట్ల ఆదాయం గడించిన ప్రభుత్వం ఇప్పుడు ఆదాయం తగ్గిన విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. దీంతో ఆదాయం పెంచేందుకు కఠిన నిర్ణయాలు అమలు చేయాలని భావిస్తోంది. రూ. 831.94 కోట్ల మేర ఆదాయం గడించాలన్న లక్ష్యంతో యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేసినట్టుగా తెలుస్తోంది. రీచుల వద్ద షిప్టుల వారిగా పర్యవేక్షణ ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని, ఉదయం 6 గంటల నుండి మద్యాహ్నం 2 గంటల వరకు, మద్యాహ్నం 2 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మూడు షిప్టులు వేసి రీచుల నుండి ఇసుక అక్రమంగా తరలి వెళ్లకుండా చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇందులో రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కఠినంగా మానిటరింగ్ చేయాల్సిన అవసరం ఉందని కూడా అధికారులు గుర్తించినట్టుగా తెలుస్తోంది. రెవెన్యూ, పోలీస్, మైన్స్ అండ్ జియోలాజీ, రవాణా శాఖ అధికారుల సమన్వయంతో కూడిన బృందాలను కూడా సిద్దం చేసినట్టుగా తెలుస్తోంది. పెద్దపల్లి జిల్లా మంథని పరిసర ప్రాంతాల్లో ఇసుక రీచులకు సంబంధించిన పర్యవేక్షణ బాధ్యతలు కూడా ఆయా విభాగాలకు చెందిన యంత్రాంగానికి బాధ్యతలు కూడా అప్పగించినట్టు సమాచారం. ఇవే కాకుండా జిల్లాల వారిగా మొబైల్ టీమ్స్ ఏర్పాటు చేసి ఇసుక లారీలను తనిఖీ చేసి అనుమతికి మించి ఇసుక తరలిస్తున్నట్టయితే వాటికి జరిమానా విధించే విధంగా చర్యలు చేపట్టారు. ఒకవేల మొబైల్ ఆఫీసర్స్ బృందాలు వే బిల్లు లేకుండా, ఓవర్ లోడ్ తో వెల్తున్న ఇసుక లారీని పట్టుకున్నట్టయితే స్టాకు యార్డుల్లో విధులు నిర్వర్తించే TGMDC యంత్రాంగాన్ని బాధ్యుల్ని చేసి వారిపై చర్యలు తీసుకోవాలని కూడా నిర్ణయించారు.
ప్రక్షాళన చేయాల్సిందెక్కడా..?
TGMDC ఆధ్వర్యంలో రాష్ట్రంలోని వివిధ నదుల్లో ఇసుక రవాణా చేస్తున్న ప్రభుత్వం అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు తీసుకుంటున్న చర్యలు ఎంతమేర లాభిస్తాయోనన్న విషయం పక్కన పెడితే కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోనట్టుగా అయితే అర్థం అవుతోంది. ప్రధానంగా రీచుల వద్ద వే బ్రిడ్జిలను ఏర్పాటు చేసి తూకం వేయించిన తరువాతే స్టాకు యార్డుల నుండి లారీలు బయటకు వెళ్లాల్సి ఉంటుంది. కానీ వే బ్రిడ్జిల ఏర్పాటు ఎక్కడైనా జరిగిందా..? ఏర్పాటు చేసిన వే బ్రిడ్జిలు నిబంధనల మేరకు నడుస్తున్నాయా అన్న విషయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. తూనికలు కొలతల శాఖ విభాగం అనుమతులు తీసుకుని ఏర్పాటు చేసిన వే బ్రిడ్జిలు సామర్థ్యానికి మించి ఇసుక తరలిపోతున్నా నిబంధనల మేరకే స్టాక్ వెల్తున్నట్టుగా రిసిప్ట్ ఎలా ఇచ్చారు..? ఇలాంటి వాటిపై తూనికలు కొలతల శాఖ దాడులు చేసిన సందర్బాలు ఉన్నాయా అన్న విషయాన్ని విస్మరిస్తున్నట్టుగా కనిపిస్తోంది. మొక్కుబడిగా ధర్మ కాంటాలను ఏర్పాటు చేసి అధర్మంగా వ్యవహరిస్తున్నా పట్టించుకోకపోవడం విస్మయం కల్గిస్తోంది. పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల్లో అధికారులు, పోలీసులు జరిపిన దాడుల్లో లారీల నంబర్లు మార్చిన ఘటనలు, ఓవర్ లోడ్ తో తరలివెల్తున్న ఘటనలు కూడా వెలుగు చూశాయి. ఇందుకు తూనికలు కొలతల శాఖ అధికారులను, రవాణా శాఖ అధికారులను బాధ్యులను చేయాల్సిన అవసరం ఉంటుందన్నది వాస్తవం.
తనిఖీల తీరు సరే…
ఇకపోతే జిల్లాల్లో మొబైల్ అధికారుల బృందాలు, హైదరాబాద్ నగరంలో హైడ్రా టీమ్స్ ఓవర్ లోడ్ విధానాన్ని కట్టడి చేసే బాధ్యతలు అప్పగిచినట్టుగా తెలుస్తోంది. లారీల్లో సామర్థ్యానికి మించి ఏ మాత్రం ఎక్కువ తూకం వచ్చినా సీజ్ చేసి కోర్టు ద్వారా రిలీజ్ ఆర్డర్ తెప్పించుకోవాలని స్పష్టం చేస్తున్నారు అధికారులు. ఇంతవరకు బాగానే ఉన్న లారీల బాడీల రీ డిజైనింగ్ వ్యవహారంపై దృష్టి సారించకపోవడం వల్ల వినియోగదారులు నష్టపోయే ప్రమాదం ఉంది. ఇంతకాలం ఓవర్ లోడింగ్ విధానాన్ని అనధికారికంగా అయినా అధికారికంగా అనుమతులు ఇచ్చినట్టుగా వ్యవహరించిన తీరుతో లారీల రూపు రేఖలే మారిపోయాయి. 14 టైర్లు, 16 టైర్ల లారీలు వాస్తవంగా ఎంత బరువు ఉండాలి, ఇప్పుడు ఎంత బరువుకు చేరాయి..? వాటి సైజు ఎంత ఉండాలి, ఎంత మేర విస్తరించాయి అన్న విషయాలపై అధికారులు దృష్టి సారించడం లేదు. 16 టైర్ల లారీలో 35 టన్నుల వరకు రవాణా చేసుకునేందుకు నిబంధనలు అనుకూలిస్తున్నాయి. అయితే లారీలను రీ డిజైన్ చేసుకోవడంతో అదనపు తూకానికి లారీల యజమానులు బాధ్యత వహించాల్సి ఉంటుంది కానీ వినియోగదారుడు మాత్రం కాదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంది. రవాణా శాఖ నిబంధనలకు విరుద్దంగా లారీల బాడీల ఎత్తును, వెనక భాగాన్ని విస్తరింప జేసుకున్నారన్నది బహిరంగ రహస్యం. దీంతో లారీ బరువు ఉండాల్సిన దానికంటే ఎక్కువ బరువు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఈ విషయంపై అధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఆ సంగతేంది..?
TGMDC కేవలం వే బిల్లుల ద్వారా మాత్రమే ఇసుక రవాణాకు అనుమతులు ఇవ్వడం లేదన్న విషయాన్ని కూడా గమనించాల్సిన అవసరం ఉంది. ఇందులో ప్రైవేటు వ్యాపారుల చేతుల్లోకి చేరుతున్న మార్గాలు ఎన్నో ఉన్నాయి. ఇందులో ఒకటి ‘‘బల్క్’’ అనుమతులు. భవన నిర్మాణాల కోసం అనుమతులు తీసుకుని TGMDC ద్వారా అనుమతులు పొందిన వారికి బల్క్ విధానం ద్వారా అనుమతులు ఇస్తున్నారు. ఇదంతా కూడా ఆన్ లైన్ ద్వారానే సాగుతున్నప్పటికీ టెక్నికల్ విషయాలను విస్మరిస్తున్నారన్నది వాస్తవం. భవన నిర్మాణానికి ఎంత మేర ఇసుక అవసరం ఉంటుంది..? స్క్వైర్ ఫీటుకు ఎంత ఎంత ఇసుక అవసరం పడుతుంది..? అన్న విషయాలను నిర్దారించేందుకు ఇంజనీరింగ్ అధికారుల అప్రూవల్ చేస్తున్నారా..? TGMDCలో ఇందుకు సంబంధించిన సాంకేతిక నిపుణులు ఉన్నారా అన్న విషయం కూడా ఎంతో ముఖ్యం. బల్క్ పేరిట అవసరానికి మించి ఇసుక తరలిపోతున్న విషయంపై కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం కూడా ఉంది. అలాగే ప్రభుత్వ నిర్మాణాల కోసం కూడా కొన్ని రీచులకు అనుమతులు ఇచ్చిన అధికారులు ఈ విషయంలో కూడా కఠినంగా వ్యవహరించక పోవడం వెనక ఉన్న ఆంతర్యం ఏంటీ..? అసలు ప్రభుత్వం నిర్మాణం చేస్తున్నదేంటి..? ఇందుకు ఎంత ఇసుక అవసరం..? అనుమతి ఇచ్చిన రీచు నుండి ఇసుక ఎంత మేర తరలి వెలుతుందన్న విషయాలపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. జీపీఎస్ విధానం అమలు చేస్తే లారీలతో పాటు మరో వాహనం ఫాలో అయి ప్రభుత్వం ఇసుక తరలిస్తున్న లారీలకు సంబంధించిన జీపీఎస్ లు సైట్ వద్దకు చేరుకుంటే లారీలేమో హైదరాబాద్ నగరానికి వెల్లిన సందర్బాలు కూడా ఉన్నాయి. అసలు ప్రభుత్వం చేపట్టిన కన్సట్రక్షన్ కోసం అనుమతి ఇచ్చిన విధానంలో ఉన్న లోపాలను ఎందుకు సవరించుకోలేకపోతున్నారన్నదే పజిల్ గా మారింది. ఆయా రీచుల నుండి వెల్తున్న లారీలకు ప్రభుత్వ పనులకు వెల్తున్న ఇసుక అని స్టిక్కర్ వేసుకోగానే అధికారికంగా అనుమతి ఇచ్చినట్టుగా భావిస్తున్న తీరు సరైందేనా..? ఈ రీచుల నుండి వెల్తున్న ఇసుక లారీల వివరాలు ఎవరు సేకరిస్తున్నారు..? సాంకేతిక నిపుణులు ఎంత ఇసుక అవసరమని నివేదికలు ఇచ్చారు..? రీచుల నుండి వెల్తున్న ఇసుక సైట్ వద్దకు చేరినట్టుగా అక్కడి ఇంజనీర్లు సర్టిఫై ఎలా చేస్తున్నారు..? అన్న విషయాలపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నామ మాత్రపు ఫీజుతో ఇసుక రీచు నిర్వాహకులు ప్రభుత్వ అవసరాల పేరిట కోట్లాది రూపాయల ఇసుకను హైదరాబాద్ కు తరలిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వాటిల్లడం లేదా..? ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించిన రీచుల మీదుగా మాత్రమే ఇసుక అక్రమంగా తరలిపోతోందన్న భావనతో సరిపెట్టుకోవడం సరికాదేమోనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణం పేరిట తెలంగాణలో ప్రభుత్వం మారిన తరువాత కూడా ఇసుక హైదరాబాద్ కు తరలిపోయింది వాస్తవం కాదా అన్న ప్రశ్న కూడా వినిపిస్తోంది. ప్రభుత్వ అవసరాల పేరిట తరలిపోతున్న ఇసుక విషయంలో కూడా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కొన్ని సందర్భాల్లో అయితే నిర్మాణాలు పూర్తయిన, అసలు జరగకున్నా కూడా గవర్నమెంట్ వర్క్స్ పేరిట ఇసుక తరలిస్తున్నారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలాంటి అంశాలన్నింటిపై కూడా అధికార యంత్రాంగం దృష్టి సారిస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉంది.