ఎస్ఐబీలో ఆరోజేం జరిగింది..?

డీఎస్పీ ప్రణీత్ రావు సస్పెన్షన్ వెనక…

దిశ దశ, హైదరాబాద్:

స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ (ఎస్ఐబి) ఇప్పుడు పోలీసు వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. నక్సల్స్ ఏరివేత కోసం ఏర్పాటు చేసిన ఈ సంస్థ లక్ష్యం దారి మల్లించుకుని ముందుకు సాగిందన్న ప్రచారం ఊపందుకుంది. పొలిటికల్ పార్టీల నాయకుల ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం కోసమే ఎస్ఐబీ పనిచేసిందన్న ఆరోపణలకు బలం చేకూరుస్తున్నాయి డీఎస్పీ ప్రణిత్ కుమార్ అలియాస్ ప్రణీత్ రావు సస్పెన్షన్ వ్యవహరం.

ఆ రోజేనా..?

పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చిన విషయాలను పరిగణనలోకి తీసుకుని డీఎస్పీ ప్రణిత్ రావును సస్పెండ్ చేశారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన రోజునే ప్రణిత్ రావు ఎస్ఐబి ఆఫీసులోని లాగర్ రూమ్ లోకి వెల్లి విధ్వంసం సృష్టించారని ప్రాథమికంగా నిర్దారించినట్టుగా తెలుస్తోంది. ఫలితాలో వచ్చిన రోజు రాత్రి 9 గంటల సమయంలో ఎస్ఐబిలోని లాగర్ రూమ్ లోకి వెల్లిన ఆయన పలు రికార్డులను నాశనం చేశారని గుర్తించారు. స్పెషల్ ఆపరేషన్ టీమ్ (ఎస్ఓటి) ఇంఛార్జిగా కూడా వ్యవహరించిన ఆయన 45 హార్డ్ డిస్కులు, వందలాది డాక్యూమెంట్లను ధ్వంసం చేసినట్టుగా పోలీసు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. లాగర్ రూమ్ లో పవర్ తీసేసి, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి కాల్ డాడా రికార్డ్స్ (సీడీఆర్), ఐఎంఈఐ నెంబర్ల వివరాలను కూడా ధ్వంసం చేశారని విచారణలో తేల్చారు. వీటన్నింటిని కూడా ఎస్ఐబి ప్రాంగణంలోనే వాటన్నింటిని కాల్చివేసిన ప్రణీత్ రావు కొత్తగా కొలువుదీరనున్న సర్కారు పెద్దలకు ఎలాంటి రికార్డులు లభ్యం కాకూడదని జాగ్రత్త పడినట్టుగా కూడా పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

స్పెషల్ వింగ్ లో స్పెషల్ …?

నక్సల్స్ ఏరివేత కోసం ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ లో మరో స్పెషల్ ఆపరేషన్ టీమ్ ఏర్పాటుకు ఆంతర్యం ఏంటీ అన్నదే పజిల్ గా మారింది. ఈ విబాగంలో పనిచేసే వారంతా కూడా నక్సల్స్ కార్యకలాపాలపైనే దృష్టి సారించాల్సి ఉంటుంది. అనుమానిత నెంబర్లను ట్రేస్ చేసి నక్సల్స్ ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణాలోకి వచ్చే క్రమంలో బలగాలను అప్రమత్తం చేయడం, రాష్ట్రంలో చాపకింద నీరులా వ్యవహరిస్తున్న నక్సల్స్ కార్యకలాపాలను గుర్తించడం వంటి కార్యకలపాల కోసమే ఏర్పాటు చేసిన ఈ వింగ్ లో ఎస్ఓటీ ఏర్పాటు చేయడానికి కారణమేంటన్నదే పజిల్ గా మారింది. శాంతి భద్రతల విభాగాల పోలీసు యంత్రాంగం వివిధ రకాల విధుల్లో తలమునకలు కావడం, అసాంఘీక శక్తులు వారిని గుర్తు పట్టి అక్రమ వ్యవహారాలను వారికంట పడకుండా ఉండేవిధంగా జాగ్రత్తలు తీసుకుంటారని ఎస్ఓటీలను ఏర్పాటు చేస్తారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో వీటి ఉనికి పెద్ద ఎత్తున ఉంటుంది. గంజాయితో పాటు వివిధ రకాల స్మగ్లింగ్ కార్యకలాపాలను కట్టడి చేయడంలో ఎస్ఓటీలు కీలకంగా పనిచేస్తాయి. అయితే కేవలం నక్సల్స్ కార్యకలాపాలను గుర్తించేందుకు ఏర్పాటు చేసిన ఎస్ఐబిలో ప్రత్యేకంగా ఎస్ఓటీ ఎందుకు ఏర్పాటు చేశారన్నదే మిస్టరీగా మారింది. నక్సల్స్ కార్యకలాపాలకు కాకుండా అదనపు వ్యవహారాలపై నిఘా వేసేందుకు ఈ టీమ్ ను ఏర్పాటు చేశారా లేక మరేదైనా కారణం ఉందా అన్నది తేలితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

అనుమతులు ఉన్నాయా..?

నిభందనల ప్రకారం వ్యక్తి ప్రాథమిక స్వేచ్ఛను హరించే విధంగా పోన్ ట్యాపింగులకు పాల్పడరాదు. దేశ భద్రత, అంతరంగిక రక్షణ వ్యవహారాలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశాలు ఉంటే తప్ప ఫోన్ ట్యాపింగ్ చేయకూడదు. అయితే అలాంటి పరిస్థితులు ఎదురైతే ఇందుకు సంబంధించిన అనుమతులు టెలికాం రెగ్యూలెటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) నుండి ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవల్సి ఉంటుంది. అంతేకాకుండా కేంద్ర హోం శాఖ కనుసన్నల్లోనే ఈ వ్యవహారాలను చక్కబెట్టాల్సి ఉంటుంది. కానీ తెలంగాణ ఎస్ఐబీ ఎస్ఓటీ ఇలాంటి అనుమతులు తీసుకోకుండానే ట్యాపింగ్ లకు పాల్పడి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ కారణంగానే కొత్త ప్రభుత్వం బాధ్యతలు తీసుకోకముందే అన్నింటిని ధ్వంసం చేసినట్టుగా అనుమానిస్తున్నారు. ఎన్నికలకు ముందే రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లు ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని పలు మార్లు ఆరోపణలు కూడా చేశారు. కాంగ్రెస్ పార్టీ పూర్తి మెజార్టీ సాధించడంతో అప్పటి గుట్టు అంతా రట్టవుతుందని భావించి డీఎస్పీ ప్రణీత్ రావు ఈ సాహసం చేసి ఉంటాడని భావిస్తున్నారు.

వెనుకున్నదెవరూ..?

అయితే ఎన్నికల ఫలితాలు మద్యాహ్నం వరకే స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో డీఎస్పీ ప్రణీత్ రావు ఆరోజు రాత్రి 9 గంటలకు ఎస్ఐబి కార్యాలయానికి వెళ్లడానికి కారణం ఏంటీ..? హుటాహుటిన వెల్లి రికార్డులను నాశనం చేయడం వెనక అసలేం జరిగింది అన్న వివరాలను కూడా సేకరించాల్సిన అవసరం ఉంది. ఎస్ఐబీ వద్ద ఉన్న ఆధునిక సాంకేతికత ద్వారా కేవలం కాల్ డాటా రికార్డులు, ఫోన్లలో జరిగిన మాటలే కాకుండా వివిద యాప్స్ ద్వారా చేసిన ఛాటింగ్ కూడా సేకరించారని కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజున ప్రణీత్ రావుతో పాటు ఎస్ఐబిలో పనిచేస్తున్న ఈ వింగ్ ఆఫీసర్లు, ఇతర సిబ్బంది, ఎవరెవరితో మాట్లాడారు..? ఛాటింగ్ ఎవరెవరితో చేశారన్న వివరాలను కూడా సేకరిస్తే పూర్తి వివరాలు బయటకు వచ్చే అవకాశాలు లేకపోలేదు. మరో వైపున ఎస్ఐబి లాగర్ రూమ్ వరకు వెల్లి రికార్డులను ధ్వంసం చేస్తున్న క్రమంలోనే ప్రణిత్ రావు చర్యలను కట్టడి చేసేందుకు ఆ విభాగంలోని ఇతర యంత్రాంగం ఎందుకు ప్రయత్నించలేదు..? ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారు.? అందులో ఆయన చర్యలకు అనుకూలంగా వ్యవహరించింది ఎవరు..? అన్న కోణంలో కూడా పోలీసు ఉన్నతాధికారులు విచారించే అవకాశం ఉంది.

You cannot copy content of this page