దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ రికార్డు బ్రేక్ చేసిన గంగుల కమలాకర్ తో పాటు కలిసి నడిచే విషయంలో ద్వితీయ శ్రేణి నాయకత్వం దూరంగా ఉంటున్నారా..? ఆయనతో విబేధించి దూరం అవుతున్నారెందుకు..? టీడీపీ నుండి బీఆర్ఎస్ వరకు ఆయన ప్రస్థానాన్ని గమనిస్తే మాత్రం వైవిద్యంగానే అనిపిస్తోంది. ఈ విధానమే ఆయనకు ప్లస్ అవుతోందన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కొంతమంది.
టీడీపీ నుండి…
టీడీపీ అభ్యర్థిగా స్థానిక ఎన్నికల్లో పోటీ చేసిన గంగుల కమలాకర్ ఎమ్మెల్యేగా ఎదిగారు. అనూహ్య పరిణామాల నేపథ్యంలో గంగుల కరీంనగర్ ఎమ్మెల్యేగా బరిలో నిలిచారు. అయితే ఉద్యమ ప్రస్థానంలో ఆయన ఉద్యమ పార్టీ వైపు అడుగులు వేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ఆయనకు వెన్నుదన్నుగా నిలిచిన వారు మాత్రం ఆయనతో పాటు పార్టీ మారేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. ఆ తరువాత కొంతకాలానికి వారు కూడా గులాభి జెండా కప్పుకుని రాజకీయాలు నెరిపగా కొంతమంది పార్టీలు కూడా ఫిరాయించారు. కొంతమంది కార్పోరేటర్లు గంగులను వ్యతిరేకిస్తూ రాజీనామా చేసిన సందర్బాలు కూడా ఉన్నాయి. మరో వైపును ఇద్దరు మేయర్లతో ఆయనకు కమ్యూనికేషన్ గ్యాప్ ఉందన్న విషయాన్ని సునీల్ రావు కూడా ప్రకటించడం గమనార్హం. అలాగే డిప్యూటీ మేయర్ గా ఎదిగిన గుగ్గిళ్ల రమేష్ కూడా విబేధించి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. పదవి కాలం పూర్తవుతున్న వేళ సునీల్ రావు పార్టీ మారడంతో ఆయన వెంట భారీగా కార్పోరేటర్లు బయటకు వెళ్లకపోవడం గంగుల కమలాకర్ కు కొంత సానుకూలతగా మారినప్పటికీ భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు జరుగుతాయో వేచి చూడాలి.
వెంట ఉన్న వారూ…
అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కారణంగానో ఉద్యమ పార్టీని వీడడం మనసొప్పకనో, అనుకూలమైన పరిస్థితుల కోసం ఎదురు చూస్తున్నారో తెలియదు కాని చాలా మంది కార్పోరేటర్లు కూడా మనో వేధనకు గురువుతున్నారన్నది వాస్తవం. తమకు తగిన ప్రాధాన్యత లభించలేదని, ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తినా పట్టించుకోలేదని, రాజకీయంగా ఎదిగాల్సిన విషయంలో కూడా తమకు అన్యాయం చేశారని ఇలా పలు కారణలతో గంగుల కమలాకర్ తీరును తప్పుపడుతున్న వారు చాలా మందే ఉన్నారు. ఆయనతో నేరుగా అనలేక సన్నిహితులతో చెప్పుకుంటూ మల్లగుల్లాలు పడుతున్న వారూ ఉన్నారు. కీలకమైన బాధ్యతల్లో ఉన్న వారి నుండి గ్రామ స్థాయి నాయకుని వరకు కూడా గంగుల తీరుపై ఇబ్బంది పడతున్న వారు ఉండడం చర్చనీయాంశం. సంబంధం లేని వారిని ఎంకరేజ్ చేస్తూ తమను చాలా సందర్బాల్లో పట్టించుకోలేదని ఓ ప్రజా ప్రతినిధి వాపోయారు. కమలాకరే తనకు సర్వస్వంగా విశ్వసించి ముందుకు సాగితే క్రమక్రమంగా దూరం పెట్టిన తీరు ఇప్పటికీ వెంటాడుతోందన్నారు. చుట్టూ ఏర్పాటయిన కోటరీ కారణంగా ప్రజల్లో పట్టున్న వారిని పక్కన పెట్టిన తీరు సరికాదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రజా క్షేత్రంలో ఉంటూ వారితో మమేకమైన వారిని విస్తరిలా విసిరేసి బలం లేని వారిని బలమైన వ్యక్తులుగా తీర్చిదిద్దేందకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన సందర్బాలు చాలా ఉన్నాయని పార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.