సంజయ్ ని మార్చడానికి కారణమేంటో..?

దిశ దశ, హైదరాబాద్:

కొన్ని దినాలకెల్లి తెలంగాణ బీజేపీ అధ్యక్షుని మార్పుపై నిరంతరంగా వార్తల వస్తున్నాయి… కానీ బండి సంజయ్ మార్పునకు కారణం మాత్రం పత్రికలల్లో రాయడం లేదు… న్యూస్ లో చెప్పడం లేదు: విజయ శాంతి ట్విట్

2024 సార్వత్రిక ఎన్నికల తరువాత మాత్రమే పార్టీ సంస్థాగత ఎన్నికలు… అప్పటి దాక అధ్యక్షుడి మార్పు లేదని ఇంఛార్జి తరుణ్ ఛుగ్ కూడా ఈ మధ్యనే స్పష్టంగా ప్రకటించారని… ఇంతలోనే మార్పు అన్నది ఎందుకన్నది దేశం కోసం ధర్మం కోసం ప్రాణమిచ్చి పని చేసే పార్టీ కార్యకర్తలకు తెలియవలసి ఉన్నది, ఆ పత్రికలకు, న్యూస్ మీడియాకు కొంచమైనా ఉంది కదా. అంటూ బీజేపీ సీనియర్ నేత విజయ శాంతి చేసిన ట్విట్ సంచలనంగా మారింది.

స్టేట్ చీఫ్ మార్పు విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందన్న ప్రచారం గుప్పుమనడంతో రాష్ట్ర బీజేపీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని చెప్పక తప్పదు. అయోమయంలో క్యాడర్, లీడర్ కొట్టుమిట్టాడున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. జాతీయ నాయకత్వం క్లారిటీ ఇవ్వకుండా ఈ లీకులు ఎలా సాధ్యమన్న అనుమానం కొందరిని వెంటాడుతుంటే… జాతీయ పార్టీ నియమించిన రాష్ట్ర ఇంఛార్జి తరుణ్ ఛుగ్ మాత్రం అలాంటిదేమీ లేదని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్ర నాయకత్వంలో ఉన్న విబేధాలు తీవ్రం కావడం వల్లే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ లక్ష్యంగా పరోక్ష ఆరోపణల పర్వం కొనసాగుతోంది. అధిష్టానం పెద్దల దృష్టికి సంజయ్ పై ఫిర్యాదులు చేసినప్పటికీ వెనకా ముందు ఆలోచించకుండా ఆయన్ని తొలగిస్తారా అన్న అనుమానం ఓ వర్గాన్ని వెంటాడుతోంది. నిన్న మొన్నటి వరకు తెలంగాణాలో ఏదో సాదిస్తామన్న ప్రకటనలు చేసిన జాతీయ నాయకత్వం తాజాగా వ్యవహరిస్తున్న తీరు మాత్రం పార్టీని అధ:పాతాళంలోకి నెట్టేసుకున్నట్టుగానే ఉంది. దేశం అంతటా కమలం వికసించాలన్న లక్ష్యంతో సంఘ్ పరివార్ అంతా గ్రౌండ్ లెవల్ వర్క్ చేస్తూ, పార్టీ బలోపేతం కోసం లక్షలాది మంది జీవితాలను ఫణంగా పెడుతున్న విషయాన్ని విస్మరించి మరీ జాతీయ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరు కూడా రాష్ట్ర పార్టీ నాయకులను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది. విజయశాంతి లాంటి ఫైర్ బ్రాండ్ లీడర్లు తమ అభిప్రాయాలను కుండబద్దలు కొట్టినట్టుగా చెప్తున్నా సగటు కార్యకర్తల్లోనూ ఇదే వేదన వ్యక్తం అవుతోంది. కొంతమంది నాయకులు చెప్తున్న విషయాలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం వల్లే బీజేపీ గ్రాఫ్ దిగజారిపోయిందన్న అందోళన వ్యక్తమవుతోంది.

నాన్చుడు ఎందుకో..?

జాతీయ నాయకత్వం తన మనసులోని మాటను బహిరంగ పరిచినా బాగుండేదని, దీనివల్ల పార్టీతో ఉండాలో లేదోనన్న విషయంపై తాడో పేడో తేల్చుకునేందుకు క్షేత్ర స్థాయి క్యాడర్ కు అవకాశం ఉంటుందన్న అభిప్రాయలు వ్యక్తమవుతున్నాయి. సంజయ్ కారణంగానే గ్రామ గ్రామానికి బీజేపీ పాకడంతో పాటు కొత్త తరహా క్రేజీ అయితే వచ్చిందన్నది వాస్తవం. అయితే ఆయన పని తీరు బాగుందని ప్రధాని మోడీ, హోం మంత్రి అమిత్ షాలు పలుమార్లు మెచ్చుకున్నారు. కూడా అలాంటిది ఇప్పుడు సంజయ్ వ్యవహార శైలి బాగాలేదన్న లీకులు ఇస్తూ మీడియాలో నిరంతరం ప్రచారం జరుగుతుండడం వల్ల ఆయనకు ముఖ్య నాయకులు ఇస్తున్న ప్రాధాన్యత ఇదేనా అన్న ఆవేదన కూడా వ్యక్తమవుతోంది. ఇప్పటికే పార్టీ గురించి రచ్చకెక్కడం వల్ల జరిగిన నష్టం గురించి అధిష్టానం గ్రౌండ్ రిపోర్ట్ తెప్పించుకుంటే తెలుస్తుందని, అప్పుడు వాస్తవికతతో బీజేపీ నేషనల్ పార్టీ ఆలోచించే అవకాశం ఉంటుందని ఓ సీనియర్ కార్యకర్త వ్యాఖ్యానించారు.

You cannot copy content of this page