ఆపలేక భర్త నరకయాతన
ఎన్నో ఆశలతో విమానమెక్కిన ఆమె అనూహ్య పరిణామాల్లో చిక్కుకుంది. నమ్మిన వాడు నట్టేట ముంచడంతో తనను ఆదరించే వారు కానరాక, ఎలా ముందుకు సాగాలో అర్థం కాక అయోమయానికి గురైంది. కల్లోలంగా మారిపోయిన ఆమె తానిక తనవారిని చేరుకోలేనని భావించి భర్తకు వీడియో కాల్ చేసి తనువు చాలించింది. బతుకుదెరువు కోసం విదేశాలకు వెళ్లిన ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనం సృష్టించింది. వివరాల్లోకి వెళ్లితే.. ఉపాధి కోసం చాలా మంది ఇతర దేశాలకు వెళ్తుంటారు. ఉన్న ఊరిలో అవసరమైనంత డబ్బు సంపాదించుకోలేనని భావించిన అందరిలాగే ఓ మహిళ తన పుట్టిన ఊరు వదిలి గల్ఫ్ దేశాలకు వెళ్లింది. అక్కడ కొన్ని రోజుల పాటు పని చేస్తూ జీవనం సాగించిన ఆమెకు ఊహించని ఎదురు దెబ్బ తగిలింది. ఎంతో నమ్మకంగా ఉండే ఏజెంట్ మోసం చేయడంతో వీసా కోసం పెట్టిన డబ్బులు వృధా అయ్యాయయని, తిరిగి ఇంటికి వెల్లిన చేసిన అప్పులు తీరే పరిస్థితి లేదన్న మనోవేదనతో రోజులు గడుపుతోంది. మంచి పని చూపిస్తాడకున్న ఏజెంట్ వెట్టి చాకిరీ చేసే సంస్థలో తక్కువ జీతానికి పనికి పురమాయించడంతో ఆ మహిళ పడ్డ కష్టాలు అన్నీ ఇన్నీ కావనే చెప్పాలి. పని భారం ఎక్కువై, ఇచ్చే వేతనం తక్కువ అయిపోవడంతో మానసికంగా కుంగిపోయిన ఆమె అనారోగ్యానికి గురైంది. తన గురించి పట్టించుకునే వారు కూడా లేకపోవడం… ఆరోగ్యం ఎలా ఉన్నా పనికి వెళ్లాల్సిన పరిస్థితే నెలకొనడంతో తనకు తానే కుమిలి పోయేది. చివరకు స్వస్థలానికి రావడానికి కూడా డబ్బులు లేక నరకయాతన అనుభవించింది. చివరకు భర్తకు కడసారిగా వీడియో కాల్ చేసి ఆత్మహత్యకు పాల్పడింది. వీడియో కాల్ లో భార్య పరిస్థితి చూసి ఆమెను ఓదార్చే అవకాశం లేక, ఆమెను ఇండియాకు తీసుకురాలేక కన్నీటి పర్యంతం అయ్యాడు. చివరకు తన భార్య బలవణ్మరనానికి పాల్పడుతున్నా నిలువరించలేని దుస్థితిలో కొట్టుమిట్టాడుతూ నరకయాతన అనుభవించాడు. ఏపీలోని కోనసీమకు చెందిన ఆ మహిళ మృత్యువు ఒడిలో చేరిపోయిన విషయం తెలిసి స్థానికులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.