మధ్యప్రదేశ్ ఎన్నికల తీరుపై జాతీయ స్థాయిలో చర్చ
దిశ దశ, జాతీయం:
ఒకే కుటుంబంలో విభిన్న మనస్థత్వం కలిగిన అన్నదమ్ములు ఉండడం సహజం. వారు తమ తమ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరిస్తుండడమూ కామన్. రాజకీయాల విషయంలోనూ ఒకే ఫ్యామిలీకి చెందిన వారు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్న సంఘటనలు చూస్తుంటాం. కానీ భార్యా భర్తలు వేర్వేరు పార్టీల్లో ఉంటూ రాజకీయాలు నెరపడం అత్యంత అరుదుగా కనిపిస్తుంది. రిజర్వేషన్ విధానం అమల్లోకి వచ్చిన తరువాత సతులు ప్రజా క్షేత్రంలో గెలిచినా పతులు పెత్తనం చెలాయించిన సందర్భాలు కూడా చూసి ఉంటాం. కానీ అక్కడ మాత్రం భార్యాభర్తలిద్దరూ వేర్వేరు పార్టీల్లో కొనసాగుతుండడం విచిత్రం. అందునా భార్య సిట్టింగ్ ఎమ్మెల్యే కాగా భర్త ఎంపీ అభ్యర్థిగా బరిలోని నిలిచారు. జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారిన ఈ విచిత్రం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది.
బాలాఘాట్ నుండి…
మధ్యప్రదేశ్ లోని బాలాఘాట్ నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఈ ఘటన జాతీయ మీడియా దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక్కడి నుండి బీఎస్పీ అభ్యర్థిగా కంకర్ మంజారే పోటీ చేస్తున్నారు. ఆయన భార్య అనుభా ముంజారే కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. గత సంవత్సరం నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె ఎమ్మెల్యేగా గెలిచారు. మధ్యప్రదేశ్ శాసనసభకు అనుభా ముంజారే ప్రాతినిథ్యం వహిస్తున్న క్రమంలో గతంలోనే చట్ట సభకు ప్రాతినిథ్యం వహించిన ఆమె భర్త కంకర్ ముంజారే కూడా ఎన్నికల బరిలో నిలవాలని భావించారు. బీఎస్పీ పార్టీ ఆయనకు టికెట్ ఇవ్వడంతో ప్రస్తుతం జరుగుతున్న లోకసభ ఎన్నికల్లో ఆయన పోటీ చేస్తున్నారు.
సంచలన నిర్ణయంతో…
అయితే దంపతులు వేర్వేరు పార్టీలో కొనసాగుతుండడం అందరి దృష్టిని ఆకర్శించడం ఓ ఎత్తైతే… వారిద్దరూ ప్రత్యర్థి పార్టీల తరుపున ప్రచారంలో పాల్గొనాల్సిన పరిస్థితి ఏర్పడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే అనుభా ముంజారే తన భర్తకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం పనిచేస్తున్నారు. అయితే ఆమె భర్త కంకర్ ముంజారే బీఎస్పీ తరుపున పోటీ చేస్తుండడంతో ఈ భార్యాభర్తల పాలిటిక్స్ తీరుపై చర్చకు దారి తీసింది. దీంతో కంకర్ ముంజారే తీసుకున్న నిర్ణయం మరో సంచలనానికి దారి తీసింది. ఆయన ఇంతకాలం భార్యతో కలిసి ఉంటున్న ఇంటిని వీడి బయటకు వెళ్లిపోయారు. ఓ చోట సపరేట్ గా ఏర్పాటు చేసుకున్న వసతిలో నివాసం ఉండాలని నిర్ణయించుకున్నారు. తాము ఇప్పుడు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్నామని అందునా తన భార్య కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే కావడం… తానేమో బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేస్తుండడంతో ఇంటి నుండి బయటకు వెల్లిపోవాలని నిర్ణయించుకున్నానని ప్రకటించారు. ఎన్నికలు ముగిసే వరకూ తాను ఇంటికి వెల్లనని ఓ గుడిసెలో నివసిస్తానంటూ కంకర్ ముంజారే ప్రకటించడం గమనార్హం. అయితే ఈ ఏడబాటు ఎన్నికల వరకేనని కూడా ప్రకటించిన ఆయన ఏప్రిల్ 19న పోలింగ్ ప్రక్రియ ముగియగానే ఇంటిముఖం పడతానని కూడా ప్రకటించారు. ఎన్నికల నేపథ్యంలో వేర్వేరు పార్టీలకు ప్రాతినిథ్యం వహిస్తున్న తామిద్దరం ఒకే ఇంట్లో ఉండడం సరికాదాన్న భావనతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని కంకర్ ముంజారే అంటున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన సతీమణి అనుభా ముంజారే మాత్రం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పార్టీ అభ్యర్థి సమ్రాట్ సారస్వత్ గెలుపు కోసమే పనిచేస్తానని ప్రకటించారు. ఎన్నికల ప్రచారంలో మాత్రం తన భర్త గురించి చెడుగా మాత్రం మాట్లడనని వెల్డించారు.
గెలిస్తే ఎలా..?
బాలాఘాట్ ఎన్నికల సిత్రాల గురించి మరో చర్చ కూడా సాగుతోంది. ఒకవేళ బీఎస్పీ అభ్యర్థిగా బరిలో నిలిచిన కంకర్ ముంజారే గెలిచినట్టయితే బిగ్ ట్విస్ట్ చోటు చేసుకోనుంది. 33 ఏళ్ల క్రితం వైవాహిక బంధంతో ఒక్కటైన ఈ దంపతులు ఇద్దరు కూడా ఒకే ఇంట్లో ఉండక తప్పదు. ఎంపీ ఎన్నికల్లో ఆయన గెల్చినట్టయితే ఒకే ఇంట్లో ఉండే ఎంపీ, ఎమ్మెల్యేల సేవల కోసం ప్రజలు వెల్లక తప్పని పరిస్థితి ఉంటుంది. రెండు పార్టీల కార్యకర్తలు కూడా తమ పార్టీ కండువాలు కప్పుకుని వచ్చినట్టయితే అప్పుడు ముంజారే ఇంట కనిపించే వాతావరణమే వైవిద్యంగా ఉండనుంది. ఒక వేళ కంకర్ ముంజారే ఓడిపోతే ఆయన ఏనుగుపైనే స్వారీ చేస్తారా లేక చేయి ఎత్తి జై కొడ్తారా అనే అంశం భవిష్యత్ నిర్ణయించనుంది.