వన్యప్రాణులు రావడం వెనక…
దిశ దశ, కరీంనగర్:
అడవుల జిల్లా కరీంనగర్ లో విస్తరించిన వనాలే కాదు వన్య ప్రాణులు కూడా స్వేచ్ఛగా తిరుగాడే పరిస్థితి ఉండేది. అటవీ ప్రాంతంలో పాటు సమృద్దిగా ఏర్పడిన గుట్టలు కూడా కరీంనగర్ జిల్లాకే తలమానికంగా ఉండేవి. అయితే ఇప్పుడా పరిస్థితికి పూర్తి భిన్నంగా ఉందని చెప్పక తప్పదు. అంతర్థానం అయిన అడవులు… గుట్టలు నాటి సహజ సౌందర్యానికి సవాల్ విసురుతున్నాయనే చెప్పాలి. మైదానాలుగా మారిపోయిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిస్థితుల వల్ల పచ్చదనపు జాడలు… వన్య ప్రాణుల ఆనవాళ్లు కనుమరుగైపోతున్నాయి.
నాడు ఇలా…
పచ్చదనం ఫరడవిల్లుతూ… ఆకాశాన్ని తాకేంత ఎత్తుకు ఎదిగిన గుట్టలు సహజత్వాన్ని ఉట్టిపడేలా దర్శనమిచ్చేవి. ప్రకృతి సొగసు చూడతరమా అంటూ జిల్లాకు వచ్చిన వారు అబ్బురపడిపోయే వారు. అలాంటి పరిస్థితులకు భిన్నంగా నెలకొనడంతో నేడు ఉమ్మడి జిల్లాలో అడవులు గణనీయంగా తగ్గిపోయాయి. వైశాల్యంలో 33 శాతం అడవులు విస్తరించి ఉంటేనే మానవాళి మనుగడ సాధ్యమని పరిశీలకు తేల్చి చెప్పారు. అయినప్పటికీ అడవులను నాశనం చేయడంలో మాత్రం ఎవరూ వెనక్కి తగ్గలేదు. కృతిమ పద్దతుల ద్వారా చల్లదనాన్ని అస్వాదించేందుకు మనుషులు ప్రయత్నిస్తున్నప్పటికీ సహజత్వంతోనే మమేకమైన ప్రకృతి వికృతంగా మారడంతో వన్య ప్రాణులు విలవిలలాడిపోతున్నాయి. సమృద్దిగా ఆహారం దొరకక, అవాసం ఏర్పర్చుకునేందుకు అవసరమైన వనాలు, పొదలు, గుట్టలు లేకపోవడంతో అడవులు వదిలి జనారణ్యంలోకి వస్తున్నాయి.
చిరుతలకు కేరాఫ్…
ఒకప్పుడు గంగాధర ప్రాంతంలోని గుట్టల్లో చిరుత పులులు అవాసం ఉండేవి. కానీ కాలక్రమేణ వాటి ఉనికే లేకుండా పోయిందంటే ఇక్కడి గుట్లలు ఏ స్థాయిలో అంతరించిపోయాయో అర్థం చేసుకోవచ్చు. రెండు దశాబ్దాల క్రితం ఈ ప్రాంతంలో తిరిగే చిరుత పులులు విషాహారం తిని చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. వన్యప్రాణి విభాగం అధికారులు వాటికి పోస్టు మార్టం నిర్వహించే తంతుతోనే సరిపెట్టాల్సి వచ్చింది తప్ప మరో గత్యంతరం లేకుండా పోయింది. క్రమక్రమంగా చిరుతలు అంతరించిపోవడంతో ఎలుగు బంట్ల ఉనికి కూడా నామ మాత్రంగానే మిగిలింది. గుట్టల్లో తిరుగుతూ వాటిపై ఉండే పొదల్లో అవాసం ఏర్పాటు చేసుకునే ఎలుగు బంట్లు కూడా జానారణ్యంలోకి రావడం కామన్ గా మారిపోయింది. గుట్టల్లో లభ్యమయ్యే చీమలు, పండ్లు, తేనే ఆహారంగా తీసుకుంటూ జీవించే ఎలుగుబంట్లు జనాల్లోకి వచ్చేందుకే సాహసించేవి కావు గతంలో. కానీ కరీంనగర్ పరిసర ప్రాంతాల్లోని గుట్టలు ఎదో ఒక రూపంలో అంతర్థానం అవుతుండడంతో ఎలుగు బంట్లు కూడా ఆహారాం కోసం బయటకు వస్తున్నాయి. దీంతో పాటు జింకలు, దుప్పులు, నెమళ్లు, కుందేళ్లు తదితర వన్య ప్రాణులన్ని కూడా పూర్తి స్థాయిలో అంతరించిపోయే పరిస్థితికి చేరుకుంది. 2008 ప్రాంతంలో మానకొండూరు మండలంలోని ఓ గ్రామంలోకి ఎలుగుబంటి చొరబడి గ్రామస్థులను భయ భ్రాంతులకు గురి చేయడంతో పోలీసులు కాల్పుల జరపడంతో చనిపోయింది.కరీంనగర్ సిటీలోకి కూడా పలుమార్లు ఎలుగుబంట్లు చొరబడి ప్రజలను భయభ్రాంతులకు గురి చేసిన సంగతి తెలిసిందే. శాతవాహన యూనివర్సిటీలో స్టూడెంట్స్ వన్యప్రాణుల నడుమ జీవనం సాగిస్తున్నారు. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లోని మండలాల్లోకి ఎలుగు బంట్లు చొరబడి హల్ చల్ చేసిన సంఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. ఆహారం కోసం రాత్రి వేళల్లో తచ్చాడుతూ వ్యవసాయ బావుల్లో పడ్డ సంఘటనలూ లేకపోలేదు. చీకటి పడితే చాలు ఎప్పుడు ఏ వన్య ప్రాణి బయటకు వస్తుందో భయపడుతూ కాలం వెల్లదీస్తున్నారు. ఇలా తరుచూ వన్యప్రాణులు బాహ్య ప్రపంచంలోకి రావడానికి కారణం అడవులు, గుట్టలు అంతరించిపోవడమే.