కేంద్ర బిందువు కానున్న ఎమ్మెల్సీ…
జగిత్యాల రాజకీయ ముఖ చిత్రం
దిశ దశ, జగిత్యాల:
ఉత్తర తెలంగాణాలో ప్రత్యేకతను సంతరించుకున్న వాటిల్లో ఆ నియోజకవర్గం మొదటి వరసలో నిలుస్తుంది. చైతన్య వంతమైన ప్రజానికం అందించే స్పూర్తి కూడా ఆదర్శవంతంగా ఉంటుంది. విప్లవాల పురిటిగడ్డగా వాసికెక్కిన ఆ ప్రాంతం హిందుత్వ భావజాలపు పోరాట యోధులు ప్రాణాలొడ్డిన చరిత కూడా తనలో దాచుకుంది. వైవిద్యమైన రాజకీయాలు కూడా అక్కడే కొనసాగుతుండడం ఆ సెగ్మెంట్ స్పెషాలిటీ…
జగిత్యాల ఖిల్లా…
రాజకీయ చైతన్యానికి మారుపేరుగా నిలిచే జగిత్యాలలో రానున్న అసెంబ్లీ ఎన్నికలు కాస్త డిఫరెంట్ గా సాగే అవకాశాలే కనిపిస్తున్నాయి. ఇక్కడి నుండి చట్ట సభకు పోటీ చేయాలని ప్రయత్నిస్తున్న వారి నేపథ్యం గమనిస్తే వారి మధ్య నెలకొన్న బంధాలు, అనుబంధాలు సాక్షత్కరిస్తాయి. నాలుగు దశాబ్దాలుగా జగిత్యాల అంటే జీవన్ రెడ్డి… జీవన్ రెడ్డి అంటే జగిత్యాల అన్న బ్రాండ్ ఇమేజ్ తెచ్చుకున్నారు. ఐ స్పెషలిస్ట్ గా ప్రసిద్ది గాంచిన సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ లకు ఆయా పార్టీల నుండి టికెట్లు దాదాపు ఖాయం కాగా బీజేపీ నుండి ప్రత్యర్థుల చేతిలో మరణించిన ఏబీవీపీ జిత్తన్న సోదరుడు ముదుగంటి రవిందర్ రెడ్డి, తాజా మాజీ మునిసిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణిల మధ్య పోటీ ఏర్పడింది.
సన్నిహుతుల మధ్యే…
రెండున్నర, మూడు దశాబ్దాల రాజకీయ పరిణామాలను గమనించినట్టయితే ఇక్కడ హితులు, సన్నిహితుల మధ్యే ఎక్కువ సార్లు పోటీ జరిగిందని చెప్పొచ్చు. ఒకప్పుడు జీవన్ రెడ్డికి అనుచరునిగా ఉన్న ఎల్ రమణ టీడీపీ నుండి బరిలో నిలిచి తాటిపర్తిని ఓడించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఆ తరువాత జరిగిన ఎన్నికల్లో జగిత్యాలలో వీరిద్దరూ ప్రత్యామ్నాయ ఎమ్మెల్యేలుగా ముద్రపడిపోయారు. అయితే స్వరాష్ట్రం సిద్దించిన తరువాత జరిగిన సమీకరణాల్లో తెరపైకి కొత్త అభ్యర్థులు ఎంట్రీ ఇచ్చి ప్రజా క్షేత్రంలో తమ బలమెంతో పరీక్షించుకుంటూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇక్కడి నుండి బరిలో నిలిచే అవకాశాలు ఉన్న తాటిపర్తి జీవన్ రెడ్డికి గతంలో అనుచరుడిగా ఉన్న ఎల్ రమణ అండదండలతో పాలిటిక్స్ లో ఉన్న డాక్టర్ సంజయ్, బోగ వెంకటేశ్వర్లు కుటుంబాల మధ్య వచ్చే ఎన్నికల్లో పోటీ అనివార్యంగా కనిపిస్తోంది. రమణకు అనుచరులుగా ఉన్న డాక్టర్ సంజయ్, బోగ వెంకటేశ్వర్లు ఇద్దరు కూడా కొంతకాలం క్రితం వరకూ అత్యంత ఆప్తులుగా మెదిలిన వారే. కానీ కొద్ది రోజులుగా వీరి మధ్య రాజకీయ వైరుధ్యం నెలకొనడంతో వెంకటేశ్వర్లు కోడలు బోగ శ్రావణి ఆయన్ని విబేధించి మునిసిపల్ ఛైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఒక వేళ బీజేపీ టికెట్ శ్రావణికి ఇస్తే తన మామ వెంకటేశ్వర్లుకు ఒకప్పటి ఆప్తమిత్రుడు, నిన్న మొన్నటి వరకు అనుచరురాలిగా ఉన్న డాక్టర్ సంజయ్ తో తలపడాల్సి ఉంటుంది. మరో వైపున ఇక్కడి నుండి బీజేపీ టికెట్ ఆశిస్తున్న ముదుగంటి రవిందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు కావడం విశేషం. ఏబీవీపీ జితేందర్ రెడ్డి సోదరుడయిన రవిందర్ రెడ్డి 2019లో ఓ సారి ఇక్కడి నుండి పోటీ చేసిన ఆయన ఈ సారి కూడా ఇక్కడి నుండి టికెట్ ఆశిస్తున్నారు. చాలా కాలంగా మాత్రం తాటిపర్తి జీవన్ రెడ్డి, ముదుగంటి జనార్దన్ రెడ్డి కుటుంబాలకు మధ్య రాజకీయంగా విబేధాలు ఉండేవి. జితేందర్ రెడ్డిని హతం చేసిన తరువాత ఆయన కుటుంబాన్ని సేఫ్టీ జోన్ కు వెళ్లాలని పోలీసులు సూచించడంతో రవిందర్ రెడ్డి హైదరాబాద్ షిప్ట్ అయ్యారు. 2019 నుండి జగిత్యాలతో టచ్ లో ఉంటున్న రవిందర్ రెడ్డి ఈ సారి టికెట్ తనకే వస్తుందని ఆశిస్తున్నారు. ఆయనకే టికెట్ ఇచ్చినట్టయితే మూడు ప్రధాన పార్టీల అభ్యర్థులు కూడా అగ్రవర్ణాలకు చెందిన వారే అవుతారు. శ్రావణికి ఇచ్చినట్టయితే బీసీ వర్సెస్ ఫార్వర్డ్ కమ్యూనిటీ మధ్య పోటీ జరగనుంది.
సెంటరాఫ్ అట్రాక్షన్ ఆయనే…
అయితే వచ్చే ఎన్నికల్లో జగిత్యాల బరిలో నిలిచే అభ్యర్థుల విషయంలో మాత్రం ఎమ్మెల్సీ ఎల్ రమణ సెంటారాఫ్ అట్రాక్షన్ కానున్నారన్నది వాస్తవం. తన సీనియర్ అయిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుండి, తాను ప్రాతినిథ్యం వహిస్తున్న బీఆర్ఎస్ పార్టీ నుండి డాక్టర్ సంజయ్, తన సమీప బంధువు, తన ఫాలోవర్ వెంకటేశ్వర్లు కోడలు అయిన డాక్టర్ బోగ శ్రావణి బీజేపీ నుండి పోటీ చేస్తే మాత్రం ఆయన మద్దతు కీలకంగా మారే అవకాశాలు ఉన్నాయి. సొంత పార్టీ నుండి బరిలో నిలుస్తున్న డాక్టర్ సంజయ్ తన అనుచరుడిగా ఉండడంతో పాటు ఒకే పార్టీలో ఉండడం, తన సామాజిక వర్గానికి చెందిన, తన ఫాలోవర్ వెంకటేశ్వర్లు కోడలు అయిన బోగ శ్రావణి కావడం వల్ల ఆయన్ని ఇరుకున పెట్టే అవకాశాలు ఉన్నాయి. మరో వైపున తన సీనియర్ అయిన జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో నిలుస్తుండడంతో ఆయనకు మద్దతు ఇవ్వాలన్న ఒత్తిళ్లు కూడా వచ్చే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఎల్ రమణ కేంద్రీకృతంగానే వచ్చే ఎన్నికల్లో పాలి‘ట్రిక్స్’ నెరపాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పవచ్చు. ఆయన అండదండలు పార్టీ ఆదేశాల మేరకే ఉంటాయన్నది నిజమే అయినప్పటికీ మద్దతివ్వాలన్న ఒత్తిళ్లు మాత్రం రమణపై ఆయా పార్టీల అభ్యర్థుల నుండి తీవ్రంగా ఉండే అవకాశాలయితే లేకపోలేదు. దీంతో తన రాజకీయ చతురతతో ఈ సమస్యను ఎల్ రమణ ఎలా అధిగమిస్తారో వేచి చూడాలి మరి.