బండి సంజయ్ కీలక నిర్ణయం..?
కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిపై బిగ్ ట్విస్ట్…
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ అనాస్తకిగా ఉన్నట్టుగా తెలుస్తోంది. రెండు మూడు నెలల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉండాలన్న యోచనలో ఉన్నట్టుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. కరీంనగర్ లో నెలకొన్న పరిణామాలను అంచనా వేయడం వల్లే ఎమ్మెల్యేగా పోటీ చేయడంపై ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.
ఎందుకంటే..?
ప్రస్తుతం కరీంనగర్ లో నెలకొన్న పరిణామాలను సునిశితంగా గమనించిన బీజేపీ ముఖ్య నాయకులు చేసిన సూచన మేరకే ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు విముఖత చూపుతున్నట్టుగా తెలుస్తోంది. గతంలో జరిగిన రెండు ఎన్నికల్లో కూడా ఆయన గెలుపు అంచుల వరకూ వచ్చినప్పటికీ మైనార్టీల ఓట్లన్ని కూడా ఒకే వైపు పడడంతో గెలుపును అందుకోలేకపోయారు. 2014, 18 ఎన్నికల్లో రెండు సార్లు కూడా టఫ్ ఫైట్ చేసినప్పటికీ మైనార్టీల ఓట్లు అన్ని కూడా ప్రత్యర్థి పార్టీకి పడడం వల్ల ఓటమి చవి చూడాల్సి వచ్చిందన్నది వాస్తవం. ఈ నేపథ్యంలో తిరిగి కరీంనగర్ నుండి పోటీ చేస్తే కూడా గత అనుభవమే ఎదురయ్యే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కరీంనగర్ లో మెజార్టీగా ఉన్న ఓట్లు చీలిపోవడం… మైనార్టీల ఓట్లు మాత్రం గంప గుత్తగా ఒకే పార్టీకి పడే అవకాశాలు వచ్చే ఎన్నికల్లో కూడా లేకపోలేదు. దీంతో కరీంనగర్ లో ప్రతికూల ఫలితాలను అందుకోవడం అవసరం లేదన్న అభిప్రాయంతో కరీంనగర్ ఎమ్మెల్యేగా పోటీ చేయకపోవడమే బెటర్ అని పలువురు సూచించినట్టుగా తెలుస్తోంది. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ప్రత్యామ్నాయ అభ్యర్థిని బీజేపీ అధిష్టానం వెతకాల్సిన పరిస్థితి ఎదురు కానుందని స్ఫష్టం అవుతోంది. బలమైన వ్యక్తిని బరిలో నిలిపేందుకు బీజేపీ అధిష్టానం కసరత్తులు చేయకతప్పని పరిస్థితి ఎదురుకానుంది.
మోడీ మానియా…
ఎంపీగా బరిలో నిలిచేందుకే బండి సంజయ్ మొగ్గు చూపడం వెనక బలమైన కారణాలు లేకపోలేదు. ప్రధానమంత్రి మోడీ ప్రభావం ఎక్కువగా లోకసభ ఎన్నికల్లోనే కనిపిస్తోంది. అన్ని వర్గాల వారు కూడా లోకసభ ఎన్నికల్లో మోడీ వైపే మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల లోకసభ ఎన్నికయితే గెలుపు సులువవుతుందని బండి సంజయ్ కి సన్నిహితులు సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రధాని మోడీ ఇమేజ్ కు తోడు వ్యక్తిగతంగా ఉన్న బలం కూడా తోడైతే లోకసభలో మరోసారి అడుగుపెట్టడం సుసాధ్యమవుతుందని భావిస్తున్నందున లోకసభ ఎన్నికలపైనే దృష్టి సారించాలని బండి సంజయ్ నిర్ణయించుకున్నట్టు సమాచారం.