బలోపేతం సాధ్యమేనా..?
దిశ దశ, హైదరాబాద్:
ఓ వైపున కాంగ్రెస్ పార్టీ బలహీనంగా కొట్టుమిట్టాడుతున్న సమయది… అధికార పార్టీపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందప్పుడే… ఇదే సమయంలో దూకుడుగా వ్యవహరించే నాయకునికి పగ్గాలు అధిష్టానం అప్పగించడంతో రాష్ట్రంలో కాషాయ జెండా రెపరెపలు మొదలయ్యాయి. కానీ అనూహ్యంగా ఆ పార్టీలో నెలకొన్న పరిణామాలు ఎటు వైపు తీసుకెళ్తాయోనన్నదే మిస్టరీగా మారింది.
కాషాయం అంటేనే…
కాషాయం పార్టీ తెలంగాణాలో పట్టు సాధించడమన్నది అసాధ్యమని భావించిన పరిస్థితుల్లో ఒక్క సారిగా మార్పు వచ్చింది. పట్టణాలకే పరిమితమైన కమలం గుర్తు పల్లె పల్లెకు పాకింది. అప్పటి వరకు యువత, విద్యావంతులకే పరిమితమైన బీజేపీ పండు ముదుసలి వరకూ చేరుకుంది. ఎర్ర జెండాలు రెపరెపలాడిన పల్లెల్లో కూడా కాషాయం జెండాలు పరుచుకపోయాయి. దీంతో బీజేపీ సక్సెస్ ఖాయం అనుకున్నారంతా… కానీ అనూహ్యంగా ఒక్కసారిగా ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్న బీజేపీ అధినాయకత్వం ఒక రకంగా సెల్ఫ్ గోల్ చేసుకుంది. దీంతో మళ్లీ పార్టీ గత వైభవాన్ని సంతరించుకుంటుందా..? జాతీయ స్థాయిలో జరిగిన సమీకరణాల గుట్టు గ్రామ స్థాయికి చేరుకున్న తరువాత తెలంగాణ ప్రజలు ఆ పార్టీని విశ్వసిస్తారా అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది.
కవిత అరెస్ట్ అంశం…
కొంత కాలంగా రాష్ట్రం కల్వకుంట్ల ఫ్యామిలీ అవినీతికి కేరాఫ్ గా మారిపోయింది ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా అరెస్ట్ అవుతారంటూ సంచలన ఆరోపణలు చేసిన రాష్ట్ర బీజేపీ నాయకత్వం ప్రజల్లోకి చొచ్చుకపోయిందనే చెప్పాలి. ఈ క్రమంలో ఇతర పార్టీల నాయకులు, ఉద్యమకారులు చేరి తమ లక్ష్యాన్ని నేరవేర్చేది బీజేపీయేనని నమ్మి కమలం కండువా కప్పుకున్నారు. లెఫ్ట్ భావజాలం ఉన్న వారు సైతం రెటిస్టులుగా మారిపోయి కమలనాథుల పంచన చేరారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీఎం కేసీఆర్ తనయ కల్వకుంట్ల కవిత ఉందని ఢిల్లీ నుండే బీజేపీ నాయకులు బాహాటంగా ప్రకటించారు. దీంతో పాటు జాతీయ దర్యాప్తు సంస్థలు వేసిన ఛార్జిషీట్లలో కవిత పేరు ఉండడం ఆమెను విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం రాష్ట్ర నాయకత్వం పదే పదే అరెస్ట్ చేస్తామంటూ చెప్పడంతో అంతా నిజమని నమ్మారు. కానీ అనూహ్యంగా కవిత అరెస్ట్ విషయం హోల్డ్ లో పడడంతో రాష్ట్ర బీజేపీ నాయకత్వం డిఫెన్స్ లో పడిపోయింది. అయితే కొండా విశ్వశ్వర్ రెడ్డి మాత్రం కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయకపోవడం బీజేపీ ఫెయిల్యూరేనని వ్యాఖ్యానించారు. దీంతో జాతీయ స్థాయి నాయకులు రాష్ట్రంలోని బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నేతలతో మిలాఖత్ అయ్యారన్న ప్రచారం కూడా మొదలైంది. కవిత అరెస్ట్ విషయంలో బీజేపీ వేసిన ఎత్తుగడలపై తర్జనభర్జనలు సాగాయి. చివరకు బీజేపీ మాత్రం కవిత అరెస్ట్ విషయంలో కావాలనే వెనక్కి తగ్గిందన్న అభిప్రాయం తెలంగాణ ప్రజల్లో బలంగా నాటుకపోయింది. ఇందుకు కారణం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మొదట ఇచ్చిన లీకులకు చివరకు చేపట్టిన చర్యలకు పొంతనలేకపోవడమేనన్నది బహిరంగ రహస్యం. మరోవైపున ఎంపీ ఎన్నికల నాటికి బీజేపీకి సానుకూలత ఏర్పడే వాతావరణం ఉండడంతో పాటు రానున్న కాలంలో ఎన్డీఏతో బీఆర్ఎస్ పార్టీ జట్టు కడుతుందన్న ఒప్పందం కూడా జరిగిందన్న వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దీంతో బీజేపీ లక్ష్యం ఎంపీ స్థానాలే కానీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం కాదన్న విషయం తేటతెల్లమైపోయిందని బీజేపీ వర్గాలు కూడా చర్చించుకుంటున్నాయి.
బండి ఉద్వాసన ఎఫెక్ట్…
పైకి మాత్రం బండి సంజయ్ పదవి కాలం పూర్తి కావడంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా స్టేట్ చీఫ్ లను మార్చామని బీజేపీ జాతీయ నాయకత్వం చెప్తున్న లోలోపల సంజయ్ లక్ష్యంగా పావులు కదిలాయన్న ప్రచారం మాత్రం విస్తృతంగా సాగింది. తెలంగాణ మీడియా కూడా సంజయ్ ను తీసేస్తున్నారంటూ చేసిన ప్రచారంతో పాటు స్థానికంగా ఆయన వ్యతిరేకంగా జట్టు కట్టిన వారు హల్చల్ చేస్తుండడంతో సంజయ్ ని కావాలనే పదవి నుండి తప్పించారన్న అభిప్రాయం బలంగా నాటుకపోయింది. పాదయాత్రలతో పాటు బహిరంగ సభలు నిర్వహించి సరికొత్త రికార్డు సృష్టించిన బండికి కావాలనే బ్రేకులు వేశారని, అధిష్టానం ఆయను అణిచివేసేందుకు కుట్ర పన్నిందన్న వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి. ప్రసంగాల్లో దూకుడుగా వ్యవహరించిన బండి సంజయ్ ముఖ్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబాన్ని ఏకీ పారేయడంలో ఏ మాత్రం వెనకడుగు వేయలేదు. లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ కాకుండా నిలువరించిన బీజేపీ అధిష్టానం సంజయ్ ని నాయకత్వం నుండి కావాలనే తప్పించిందన్న ప్రచారం పెద్ద ఎత్తున సాగింది. యూత్ లో ఎక్కువగా క్రేజీ ఉన్న సంజయ్ విషయంలో అధిష్టానం తప్పటడుగులు వేసిందని, నిన్న మొన్నటి వరకు ఎన్నికల వరకూ ఆయన రాష్ట్ర అధ్యక్షుడిగా వ్యవహిరిస్తారని ప్రకటించిన బీజేపీ నాయకత్వం ఉన్నట్టుండి ఆయన్ని తప్పించడంతో తెలంగాణ ప్రజల్లో వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో కమల వికాసం కావడం కష్టమేనని కమల విలాపం మాత్రమే ఎదరవుతుందని అంటున్న వారూ లేకపోలేదు. ఇలాంటి పరిస్థితిలో ఒక్క సారిగా పతనం అంచుకు చేరిపోయిన బీజేపీని త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నాటికి బలోపేతం చేసే పరిస్థితి ఉంటుందా అన్నది అంతు చిక్కకుండా పోయింది.