బీజేపీ వ్యూహం ఫలించేనా…?
దిశ దశ, కరీంనగర్:
ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ వ్యూహం ఫలిస్తుందా..? అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యహరించినప్పటికీ అంచనాలకు తగ్గట్టుగా ఫలితాలు రాబట్టుకుంటుందా..? పట్టభద్రుల, టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థులు సమన్వయంతో ముందుకు సాగే అవకాశాలు ఉంటాయా..? ఇప్పుడిదే చర్చ అటు బీజేపీ శ్రేణుల్లో ఇటు ఓటర్లలో సాగుతోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోని ఓటర్లు ఎమ్మెల్సీలను ఎన్నుకోవల్సి ఉంది. ఉపాధ్యాయ నియోజకవర్గానికి పెద్దపల్లికి చెందిన మల్క కొమురయ్యకు, పట్టభద్రుల నియోజకవర్గం నుండి సంగారెడ్డికి చెందిన అంజిరెడ్డికి బీజేపీ అధిష్టానం అవకాశం ఇచ్చింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన మల్క కొమురయ్య విద్యా సంస్థలతో పాటు పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. స్థానికత అంశంతో పాటు బీసీ కార్డు ప్రభావంతో కొమురయ్యను ఆదరించే అవకాశాలు ఉన్నాయని బీజేపీ నాయకత్వం అంచనా వేస్తున్నట్టుగా ఉంది. ఉమ్మడి మెదక్ జిల్లా సంగారెడ్డికి చెందిన అంజిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో స్థిరపడ్డారని తెలుస్తోంది. కరీంనగర్ ప్రాంతానికి చెందిన కొమురయ్య ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్నప్పటికీ ఆయన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి గెలుపు కోసం కూడా ప్రయత్నించాల్సి ఉంటుందని అధిష్టానం సూచించినట్టుగా తెలుస్తోంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లోని టీచర్ల ఓట్లను అభ్యర్థించడంతో పాటు పట్టభద్రులను కూడా ఆకట్టుకునేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిచుకోవల్సిన ఆవశ్యకత ఆయనపై ఉంది. అలాగే పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కూడా ఉమ్మడి మెదక్ తో పాటు నిజామాబాద్ ప్రాంతంలో పట్టభద్రుల ఓటర్లను ఆకట్టుకోవడంతో పాటు టీచర్ ఓటర్లు కొమురయ్యకు అనుకూలంగా ఓట్లు వేసేందుకు బాధ్యతలు తీసుకోవల్సిన అవసరం ఉన్నట్టుగా తెలుస్తోంది. మరోవైపున తమ తమ ప్రాంతానికి బీజేపీ ప్రాధాన్యత ఇచ్చిందని భావించి కూడా ఓట్లు పడే అవకాశాలు ఉంటాయని కూడా అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తోంది.
సాధ్యమేనా..?
నాలుగు ఉమ్మడి జిల్లాలను కలియ తిరుగుతూ ఓటర్లను ఆకట్టుకుని పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవడంలో బీజేపీ అభ్యర్థులు ఎంతమేర సఫలం అవుతారన్నదే చర్చనీయాంశంగా మారింది. అంజిరెడ్డి గ్రాడ్యూయేట్లను ఆకట్టుకునే విధంగా ప్రసంగాలు కొనసాగించే అవకాశాలు అయితే కనిపించడం లేదు. ఆయన ఉపన్యాసాల తీరు గమనిస్తే మాత్రం పట్టభద్రులు పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలు మాత్రం అంతగా లేవనే అనిపిస్తోంది. మరోవైపున మల్క కొమురయ్య పెద్దపల్లికి చెందిన వారే అయినప్పటికీ చాలా కాలంగా మాత్రం హైదరాబాద్ ప్రాంతంతోనే అనుబంధం పెట్టుకున్నారు. పెద్దపల్లి వాసే అయినప్పటికీ చాలామందికి ఆయనతో సంబంధాలు కూడా లేవని, దీంతో ఆయన ఈ ప్రాంతంలో ఎలా ప్రభావితం చేస్తారన్నదే అంతుచిక్కడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే పార్టీ శ్రేణుల ప్రచారం, బీజేపీ ముఖ్య నాయకుల ప్రభావం, సర్వే ఏజెన్సీలు ఇచ్చే వ్యూహ ప్రతి వ్యూహాలపై మాత్రమే ఆధారపడడం తప్ప క్యాండెట్ల సొంత ఇమేజ్ మాత్రం అనుకున్నంత మేర అయితే లేదన్న వాదనలే వినిపిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ రెండు ఎమ్మెల్సీ స్థానాలను ఎలా కైవసం చేసుకుంటుందోనన్నదే ఆసక్తికరంగా మారింది. కేంద్ర హోం మంత్రి బండి సంజయ్ ఎమ్మెల్సీ అభ్యర్థుల కోసం కరీంనగర్ లో భారీ ర్యాలీ, సమావేశం ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల పార్టీ వర్గాల్లో ఊపు తీసుకొచ్చే అవకాశం ఉన్నప్పటికీ అన్ని వర్గాల ఓటర్లను పార్టీ వైపు మరల్చుకోవడం సవాలుగానే అనిపిస్తోంది.