స్వతంత్ర అభ్యర్థిగానైనా సై…
దిశ దశ, జగిత్యాల:
తెలంగాణలో ప్రముఖ విద్యా సంస్థల్లో ఒకటైన ఆల్ఫోర్స్ ఛైర్మన్ వి నరేందర్ రెడ్డి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ప్రత్యక్ష్య రాజకీయాల్లోకి వస్తున్నారని గత ఎన్నికల్లో ఆయన పేరు వెలుగులోకి వచ్చినా చివరి క్షణంలో అభ్యర్థులు మారిపోయారు. కానీ ఈ సారి మాత్రం పట్టు వీడకుండా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి తీరుతానని నరేందర్ రెడ్డి స్పష్టం చేశారు. ఏ పార్టీ మద్దతు ఇచ్చినా ఇవ్వకున్నా తాను మాత్రం స్వతంత్ర అభ్యర్థిగా అయినా పోటీ చేయడం ఖాయమని తేల్చి చెప్పారు అల్ఫోర్స్ నరేందర్ రెడ్డి.
జీవన్ రెడ్డితో చర్చలు…
సిట్టింగ్ ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డితో ఇప్పటికే చర్చించానని అయితే తాను పోటీలో ఉండే ఆలోచనలో లేనని చెప్పారని వారి సలహాలు సూచనలు తీసుకున్న తరువాత తాను పోటీలో నిలబడాలని నిర్ణయించుకున్నానని నరేందర్ రెడ్డి వెల్లడించారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనే తాను కాంగ్రెస్ పార్టీలో చేరిన తరువాత కరీంనగర్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయాల్సి ఉన్నప్పటికి కొన్ని పరిస్థితుల వల్ల బరిలో నిలవలేకపోయానని నరేందర్ రెడ్డి వెల్లడించారు. ప్రైవేటు, ప్రభుత్వ విద్యా రంగంపై సంపూర్ణ అవగాహన ఉన్న తనకు అవకాశం ఇస్తే మండలిలో విద్యా సంస్కరణల గొంతుకగా మారుతానన్నారు. ఆల్ఫోర్స్ విద్యా సంస్థల ద్వారా తాను మూడు తరాలతో అనుబంధం ఉండడం తనకు లాభిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేసిన ఆయన దేశంలోనే తెలంగాణ విద్యా రంగాన్ని ఉన్నత ప్రమాణాలతో కూడిన వ్యవస్థగా తీర్చిదిద్దడంలో తన వంతు భాగస్వామ్యం అందించాలని నిర్ణయించానని ప్రకటించారు. 34 ఏళ్లుగా విద్యా సంస్థలను ఏర్పాటు చేశానని కేజీ నుండి పీజీ వరకు ఎడ్యూకేషన్ ఇన్సిట్యూషన్స్ ఏర్పాటు చేశామన్నారు. తన విద్యా సంస్థల్లో ప్రమాణాలు తగ్గకుండా సమన్వయం చేసుకుంటూ పోతున్న తాను ఒక రోల్ మోడల్ గా ఉన్నానన్నారు నరేందర్ రెడ్డి.
పుట్టిన గడ్డ నుండి…
జగిత్యాల జిల్లా కొడిమ్యాలకు చెందిన తాను సొంత జిల్లా కేంద్రం నుండి బరిలో నిలుస్తున్న విషయాన్ని వెల్లడిస్తున్నానని వి నరేందర్ రెడ్డి ప్రకటించారు. కొడిమ్యాల ప్రభుత్వ పాఠశాలలో చదువకున్న తాను ఇంటర్ కరీంనగర్ సైన్స్ వింగ్ కాలేజీలో, డిగ్రీ ఎస్సారార్ కాలేజీలో, పీజీ ఉస్మానియాలో పూర్తి చేశానని, మొదట తాను సైకిల్ పై ఇంటింటికి తిరుగుతూ ట్యూషన్లు చెప్తూ విద్యా సంస్థలు ఏర్పాటు చేసుకుంటూ ముందుకు సాగానన్నారు. తెలంగాణాలోని పలు జిల్లాలో 60 వరకు విద్యా సంస్థలు నిర్వహిస్తున్న తాను పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మండలిలోకి అడుగు పెట్టిన తరువాత విద్యారంగంలో సంస్కరణలు తీసుకరావడమే లక్ష్యంగా పనిచేస్తానని ప్రకటించారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు తీసుకొచ్చేందుకు ప్రత్యేకంగా చొరవ తీసుకుంటానని ప్రకటించారు. ఇప్పటికే ఎమ్మెల్సీ ఓటర్ల నమోదు ప్రక్రియతో పాటు ఇతారత్ర పనుల్లో నిమగ్నం అయ్యామని కూడా ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి వెల్లడించారు.