సింగరేణిలో ఎన్నికల సైరన్ మోగేనా..?

ఈ నెల 11న మరోదఫా సమావేశం

దిశ దశ, రామగుండం:

నల్ల బంగారు గనుల్లో చెమట చుక్కలు చిందించే కార్మికుల సంక్షేమం కోసం పాటు పడేందుకు జరగాల్సిన గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ వాయిదాలతోనే ముందుకు సాగుతోంది. కార్మిక శాఖ నిబంధనల ప్రకారం నిర్వహించాల్సిన ఎన్నికలు నేటికీ వాయిదా పడుతూనే ఉన్నాయి. తాజాగా మరోసారి ఈ నెల 11న కార్మిక సంఘాలతో యాజమాన్యం సమావేశం కానున్న నేపథ్యంలో మరోసారి గుర్తింపు సంఘం ఎన్నికల అంశం చర్చకు దారి తీసింది.

ఆరేళ్లు కావస్తున్నా…

కార్మిక శాఖ నిబంధనల ప్రకారం సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు జరగాల్సి ఉంది. గత 2017 అక్టోబర్ 5న సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు ఆరో దఫా జరగగా వరసగా రెండోసారి టీబీజీకెఎస్ గెలిచింది. 2017లో జరిగిన ఎన్నికలప్పుడు గుర్తింపు సంఘం కాలపరిమితి నాలుగేళ్లుగా అనుకున్నప్పటికీ అనూహ్యంగా 2018లో కేంద్ర కార్మిక శాఖ ఇచ్చిన అధికారిక లేఖలో రెండేళ్ల పాటేనని తేల్చి చెప్పింది. దీంతో అప్పుడు కేంద్ర కార్మిక శాఖ నిర్ణయం చర్చనీయాంశంగా మారింది. కానీ 2022లోనే నాలుగేళ్ల కాల పరిమితి కూడా ముగిసినప్పటికీ గుర్తింపు సంఘం ఎన్నికలు మాత్రం జరగడం లేదు. 2017 ఎన్నికల తరువాత ఇచ్చిన లేఖలో రెండేళ్లు మాత్రమే కాల పరిమితి అని చెప్పినప్పటికీ ఎన్నికలు జరిపేందుకు మాత్రం కార్మిక శాఖ చొరవ చూపలేదు. అంతకుముందు ఉన్న నాలుగేళ్ల కాల పరిమితి కూడా ముగిసినప్పటికీ గుర్తింపు సంఘం ఎన్నికలు జరిపేందుకు చొరవ చూపిన దాఖలాలు కనిపించలేదు. దీంతో ఏఐటీయూసీ హైకోర్టును ఆశ్రయించి సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహించేందుకు ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించింది. ఈ మేరకు హై కోర్టు కూడా గత డిసెంబర్ లో ఎన్నికలను నిర్వహించాలని సింగరేని యాజమాన్యాన్ని ఆదేశించగా… అయితే మార్చి నెలతో ఆర్థిక సంవత్సరం ముగుస్తున్నందున బొగ్గు ఉత్పత్తి లక్ష్యానికి గండి పడుతుందని సింగరేణి హైకోర్టుకు విన్నవించింది. మార్చిలోగా ఎన్నికలు జరిపే పరిస్థితి లేదని మొదట కోర్టును ఆశ్రయించి అనుమతి పొందిన సింగరేణి సంస్థ ఏప్రిల్ నెలలో బొగ్గు సరఫరా చేయడంలో అంతరాయం ఏర్పడుతుందని ఎన్నికల నిర్వహణ వల్ల ఇబ్బందులు ఎదురవుతాయంటూ మరోసారి హైకోర్టుకు విన్నవించింది. దీంతో గత డిసెంబర్ నుండి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఈ నెల 11 గుర్తింపు సంఘం ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన చర్చలు జరిపేందుకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తున్నట్టు సింగరేణి యాజమాన్యం కార్మిక సంఘాలకు సమాచారం ఇచ్చింది. ఈ నెల 11న జరిగే సమావేశానికి ఐదు జాతీయ సంఘాలతో పాటు 14 కార్మిక సంఘాల ప్రతినిధులు సమావేశానికి హాజరు కావాలని యాజమాన్యం కోరింది. దీంతో మరోసారి సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల చర్చ తెరపైకి వచ్చినట్టయింది.

జనరల్ ఎన్నికల వేళ…

అయితే ఓ వైపున రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతుండడంతో పాటు నేడో రేపో ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం ఊపందుకున్న క్రమంలో సింగరేణి ఎన్నికల కసరత్తులపై యాజమాన్యం దృష్టి సారించడం చర్చనీయాంశంగా మారింది. అటు అసెంబ్లీ ఎన్నికలు ఇటు గుర్తింపు ఎన్నికలు ఏకకాలంలో జరిపే అవకాశం ఉంటుందా అన్నదే కీలకంగా మారింది. మరోవైపున ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణి ఎన్నికల ప్రభావం అసెంబ్లీ ఎన్నికలపై పడే అవకాశం లేకపోలేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు సింగరేణి ఎన్నికలు జరిగినట్టయితే ఆయా ప్రాంతాల్లోని కార్మికుల మద్దతు ఎటో తేలిపోనుంది. దీంతో దీని ప్రభావం అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలిచే అభ్యర్థుల తల రాతలు కూడా మారనున్నాయి. దీంతో సింగరేణి ఎన్నికలు అసెంబ్లీ ఎన్నిలకు ముందు నిర్వహించేందుకు సమ్మతించేందుకు ముందుకు వస్తారా లేదా అన్నదే వేచి చూడాలి.

You cannot copy content of this page