బోర్లగూడెం కేంద్రంగా కొత్త మండలం డిమాండ్
దిశ దశ, మహాముత్తారం:
1987లో రాష్ట్రంలో పరిపాలన రూపు రేఖలు మారిపోయాయి. తాలుకా వ్యవస్థ నుండి మండల వ్యవస్థగా రూపాంతరం చెందింది. స్థానిక సంస్థల వికేంద్రీకరణలో మండల వ్యవస్థ ఆవిర్భావం అనేది సరికొత్త అధ్యాయన్నే రచించింది. అయితే అప్పుడు మండల కేంద్రాలను ఏర్పాటు చేసే విషయంలో తెరపైకి వచ్చిన ప్రతిపాదనలు చివరి క్షణంలో తారు మారయ్యాయి. దీంతో మండల కేంద్రాలుగా వెలుగొందాల్సిన గ్రామాలు గ్రామ పంచాయితీలుగానే మిగిలిపోయాయి. స్వరాష్ట్ర కల సాకారం అయిన తరువాత నూతన జిల్లాల ఆవిర్బావ సమయంలో అయినా ఆ గ్రామాలు మండలాలుగా అప్ గ్రేడ్ అవుతాయని భావించినప్పటికీ చాలా గ్రామాలకు మాత్రం అవకాశం దక్కలేదు. ఇలాంటి జాబితాలో ఉన్న గ్రామమే జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాముత్తారం మండలంలోని బోర్లగూడెం. అటవీ ప్రాంతంలోని అన్ని గ్రామాలకు నడిబొడ్డున ఉండే బోర్లగూడెం మండలం అయితే బావుంటుందన్న ప్రతిపాదన 1987లోనే వచ్చినప్పటికీ చివరి క్షణంలో మహాముత్తారం కేంద్రంగా మండలం ప్రకటించారు అప్పటి అధికారులు. మండలంలో ఇప్పటికీ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉండే బోర్లగూడెం మండలంగా అప్ గ్రేడ్ అవుతుందని ఆశించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కొత్త మండలాల ఏర్పాటుకు శ్రీకారం చుడుతుండడంతో బోర్లగూడెం వాసుల ఆశలు మళ్లీ చిగురిస్తున్నాయి. తమ గ్రామం కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేయాలని, మారుమూల గ్రామాలకు ప్రభుత్వ యంత్రాంగం సేవలు అందుబాటులోకి తీసుకరావాలన్న డిమాండ్ వినిపిస్తున్నారు.
12 పంచాయితీలు…
బోర్లగూడెం మండలంగా ఆవిర్భావం చేసినట్టయితే 12 పంచాయితీలు, 15 శివారు గ్రామాలు, నాలుగు ఎంపీటీసీ స్థానాలు దీని పరిధిలోకి వస్తాయి. 15 వేల మంది ఓటర్లు, 8 నుండి 10 వేల కుటుంబాలు, 30 వేల వరకూ జనాభా ఉన్న బోర్లగూడెం ప్రాంత అభ్యున్నతి కోసం అధికారులు నూతన మండలంగా ప్రకటించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. అంతేకాకుండా కిష్టాపూర్, గాజరాంపల్లి, పోచంపల్లి తండాలను పంచాయితీలుగా గుర్తించాల్సిన అవసరం ఉందని కూడా బోర్లగూడెం మండల సాధన సమితి వాదిస్తోంది. జిల్లా కేంద్రం కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న బోర్లగూడెం పరిసర గ్రామాల వాసులు మండల కేంద్రానికి వెళ్లాలంటే మాత్రం 30 కిలో మీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భౌగోళిక పరిస్థితులు, పరిపాలన సౌలభ్యం, ప్రజా అవసరాలను గుర్తించి బోర్లగూడెం కేంద్రంగా మండలం ఏర్పాటు చేయాలని మండల సాధన సమితీ బాధ్యులు మాలోత్ నవ రాంనాయక్, అందె భాస్కర చారీలు డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఆయా పార్టీల అభ్యర్థులు కూడా బోర్లగూడెం మండలం ఏర్పాటు చేస్తామని ప్రకటించారని ఇచ్చిన హామీని నెరవేర్చాల్సిన అవసరం ఉందని అంటున్నారు. కేవలం రెండు ఎంపీటీసీ స్థానాలు, అతి తక్కువ గ్రామ పంచాయితీలు ఉన్న పలిమెల మారుమూల ప్రాంతం అని, మండల కేంద్రానికి దూరంగా అటవీ ప్రాంతంలో ఉంటుందని గమనించిన అధికారులు స్థానికుల అభ్యర్థన మేరకు అక్కడ మండల కేంద్రం ఏర్పాటు చేశారని అన్నారు. ఇదే పద్దతిని అవలంభించి బోర్లగూడెం మండలాన్ని ప్రకటిచినట్టయితే అంతకు రెట్టింపు గ్రామాలకు సేవలు దగ్గర అవుతాయన్న విషయాన్ని అధికారులు గుర్తించాలని మండల సాధన సమితి ప్రతినిధులు నవ రాంనాయక్, అందె భాస్కర చారీలు కోరుతున్నారు.
మేడారం రహదారిలో…
చత్తీస్ గడ్, మహారాష్ట్రతో పాటు తెలంగాణాలోని పలు ప్రాంతాల నుండి గిరిజన ఆరాధ్య దైవమైన సమ్మక్క సారాలక్క ఆలయానికి వెల్లే రహదారి కూడా ఇదే కావడం గమనార్హం. కాటారం, బోర్లగూడెం మీదుగానే మేడారం వచ్చిపోయే వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. జంక్షన్ గా మారిన బోర్లగూడెం గ్రామాన్ని మండల కేంద్రంగా అభివృద్ది చేసినట్టయితే అన్ని రకాల సౌకర్యాలు మెరుగు పడతాయి. తాలుకా వ్యవస్థ ఉన్నప్పుడు కూడా బోర్లగూడెం కేంద్రీకృతంగానే ప్రభుత్వ అధికార యంత్రాంగం సేవలందించిన చరిత్ర ఉందని. అనధికారికంగానే అయినప్పటికీ చుట్టు పక్కల గ్రామాలకు బోర్లగూడెం మధ్యన ఉంటుందన్న ఆలోచనతో అప్పటి అదికారులు ఇక్కడకు చేరుకుని సమీప గ్రామాల వాసులకు అవసరమైన సేవలు అందించే వారని స్థానికులు చెప్తున్నారు. అంతేకాకుండా బోర్లగూడెంలో పోలీస్ ఔట్ పోస్టు, సీఆర్పీఎఫ్ క్యాంపులను ఏర్పాటు చేసిన అప్పటి పోలీసు అధికారులు సమీపంలో ఉన్న సింగారం, నిమ్మగూడెం గ్రామాల్లో ఏర్పాటు చేసిన క్యాంపులతో అనుసంధానం చేశారన్నారు. గతంలోనే బొర్లగూడెం గ్రామాన్ని కేంద్ర బిందువుగా గుర్తించారన్న విషయాన్ని గమనించి అధికారుల నూతన మండలాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు స్ధానికులు. ప్రధానంగా మండల కేంద్రానికి వెళ్లాలంటే 30 కిలో మీటర్ల దూరం వెళ్లాల్సి వస్తుండగా, జిల్లా కేంద్రానికి మాత్రం 25 కిలో మీటర్ల దూరం మాత్రమేనని దీంతో మండల కార్యాలయంలో పనులు ఉన్నప్పుడు అవస్థలు తప్పడం లేదన్నారు. బోర్లగూడెం మండల కేంద్రం చేయడం వల్ల సమీపంలోని గ్రామాల్లో కూడా రహదారి వ్యవస్థతో పాటు ప్రభుత్వ శాఖల సేవలు కూడా అందే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న మండలాల జాబితాలో బోర్లగూడెం గ్రామాన్ని చేర్చాల్సిందేనని మండల సాధన సమితి బాధ్యులు నవ రాంనాయక్, అందె భాస్కర చారీలు కోరుతున్నారు.