ఓ వైపున ఫిర్యాదులు… మరో వైపున విచారణలు
దిశ దశ, భూపాలపల్లి:
తెలంగాణ తొలి ప్రభుత్వం అట్టహాసంగా చెప్పుకున్న ఆ ప్రాజెక్టు ఇప్పుడు మెడకు ఉచ్చులా బిగయనుందా..? ఈ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన లోపాలు… అక్రమాలు వెలుగులోకి రానున్నాయా..? రేవంత్ రెడ్డి సర్కార్ ఈ ప్రాజెక్టు కేంద్రీకృతంగానే విచారణ చేపట్టే అవకాశాలు ఉన్నాయా..? అంటే అవుననే అనిపిస్తున్నాయి ప్రస్తుత పరిస్థితులు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్మాణమని చెప్పుకున్నప్పటికీ మూడు నాళ్ల ముచ్చటే అన్నట్టుగా తయారు అయింది. ఓ వైపున ప్రతి పక్షాలు ధ్వజమెత్తుతుంటే కౌంటర్ అటాక్ కు దిగిన బీఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలు చివరకు బ్యారేజీల నిర్మాణంలోని డొల్లతనం వెలుగులోకి రావడంతో నాలుక కరచుకున్నంత పనిచేసింది.
అటు ఫిర్యాదులు…
ఇకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో కేసీఆర్ ప్రభుత్వం చూపించిన శ్రద్ద అంతా ఇంతా కాదు. ప్రపంచ రికార్డులంటూ గంటల వ్యవధిలోనే లక్షల క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వాడామని… దేశంలోనే అతి పెద్ద మోటార్లు ఏర్పాటు చేశామని, సొరంగాలు కూడా చరిత్ర సృష్టించాయని ఢంకా బజాయించి చెప్పారు. తూర్పునకు వెళ్లాల్సిన పరవళ్లను ఎదురీదేల చేసిన ఘనకీర్తి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కిందని… అపర భగీరథుడు అంటూ కీర్తించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మించ తలపెట్టిన ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును రీ డిజైన్ చేసి అదనంగా మూడు బ్యారేజీలు మూడు పంప్ హౌజ్ ల నిర్మాణం చేపట్టారు కాళేశ్వరంలో. 2018 ఎన్నికల్లో ఈ ప్రాజెక్టును చూపించే రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లను తమ వైపు తిప్పుకోవడంలోనూ బీఆర్ఎస్ ప్రభుత్వం. అయితే అదే ప్రాజెక్టుకు ఆయువు పట్టుగా ఉన్న మేడిగడ్డ బ్యారేజ్ తాజా ఎన్నికల సమయంలో కుంగుబాటుకు గురి కావడం సంచలనంగా మారింది. ఓ పిల్లర్ కుంగి పోవడంతో ప్రాజెక్టు నిర్మాణంపై ప్రతి పక్షాలు చేస్తున్న ఆరోపణలు నిజమేనని నమ్మేలా చేసింది. ఇదే సమయంలో అన్నారం బ్యారేజ్ గేట్లకు దిగువన బుంగలు పడడంతో ప్రజల నమ్మకాన్ని నిజమని నిరూపించేలా చేసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకుంటున్నారని ఇంజనీర్లు డైరక్ట్ గా సీఎంతో మాట్లాడే చనువు ఏర్పడడంతో తెలంగాణ సమాజాన్ని చీడ పురుగుల్లా చూసిన సందర్భాలు ఎన్నెన్నో. అయితే ఇంజీనీర్లు చేసిన తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకు నర మానవుడిని కూడా అటువైపు వెల్లకుండా నిలువరించిన ఇరిగేషన్ అధికారులు మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. దీంతో పాటు అప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూ. 50 వేల కోట్ల అవినీతి జరిగిందని కరీంనగర్ కు చెందిన సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి రాష్ట్ర గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. 10 ప్యాకేజీలకు సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన ఈ ఫిర్యాదు మరుగునపడి పోగా తాజా ఎన్నికల ఫలితాలు బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దిగాల్సి రావడంతో మళ్లీ కాళేశ్వరం అంశం వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై హై కోర్టు న్యాయవాది రాపోలు భాస్కర్ అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్, ఇరిగేషన్ మంత్రి తన్నీరు హరీష్ రావు, మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత, కాంట్రాక్టర్ మెగా కృష్ణారెడ్డి, ఈఎన్సీ నల్లా వెంకటేశ్వర్లు, నీటి పారుదల శాఖకు చెందిన వారిపై ఏసీబీకి రాపోలు భాస్కర్ ఫిర్యాదు చేశారు. తాజాగా సోమవారం కరీంనగర్ కు చెందిన సింగిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా సమగ్రమైన వివరాలతో కూడిన ఫిర్యాదును అవినీతి నిరోధక శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై సమగ్ర విచారణ జరిపించక తప్పని పరిస్థితి ఏర్పడింది.
మంత్రి ఉత్తమ్ కామెంట్స్…
మరో వైపున ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా సమీక్షా జరిపించారు. కాళేశ్వరాన్ని క్షేత్ర స్థాయిలో సందర్శిస్తానని, ఈ వ్యవహారంలో సమగ్ర విచారణ చేపడ్తామని ప్రకటించారు. సోమవారం సమీక్ష జరిపిన అనంతరం ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. అంతేకాకుండా ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నిర్మాణం గురించి కూడా ఆలోచిస్తున్నామని ఆయన ప్రకటించారు. అంటే కాళేశ్వరం వల్ల అద్భుత ఫలితాలు వచ్చే అవకాశాలు లేవని రాష్ట్ర ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చినట్టుగా స్పష్టం అవుతోంది. దీంతో కాళేశ్వరంలో అవినీతి అక్రమాలు చోటు చేసుకున్నట్టయితే మాత్రం బాధ్యులు చట్టం కోరల్లో చిక్కుకపోయే అవకాశం లేకపోలేదు. అయితే ప్రాజెక్టు నిర్మాణం విషయంలో మూడు బ్యారేజీలు కూడా పనికి వచ్చే పరిస్థితి లేదన్న రీతిలోనే డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం కూడా తేల్చినట్టుగా తెలుస్తోంది. ఈ కారణంగానే మూడు బ్యారేజీల నిర్మాణంపై రివ్యూ చేయాల్సి ఉందని కూడా చెప్పింది. దీంతో కాళేశ్వరం ఎఫెక్ట్ ఎలా ఉండబోతుంది అన్నదే తెలంగాణ ప్రజల్లో ప్రధానంగా జరుగుతున్న చర్చ.