దిశ దశ, కరీంనగర్:
సెంటిమెంట్ గా కలిసొచ్చే చోటకు వచ్చి పార్టీకి పునరుజ్జీవం పోసే ప్రయత్నంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత ఉన్నారా..? లోకసభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలే లక్ష్యంగా పావులు కదిపే పనిలో పార్టీ ముఖ్య నాయకత్వం నిమగ్నం అయిందా..? గులాభి పార్టీలో అసలేం జరుగుతోంది…
కరీంనగర్ లోనే మకాం…
ఉత్తర తెలంగాణలోని కరీంనగర్ అంటే కేసీఆర్ కు కలిసొచ్చే జిల్లా అన్న నానుడు మొదటి నుండి ఉంది. పుట్టి పెరిగి, రాజకీయ జన్మనిచ్చిన సిద్దిపేట కంటే కరీంనగర్ అంటేనే ఎక్కువ మక్కువ చూపిస్తాంటారు ఉద్యమ నేత. అయితే త్వరలో జరనున్న లోకసభ ఎన్నికల్లోనూ అదే సెంటిమెంట్ ను వర్కౌట్ చేసుకుని ముందుకు సాగాలని యోచిస్తున్నట్టుగా స్పష్టం అవుతోంది. తుంటి మార్పిడి శస్త్ర చికిత్స చేసుకున్న ఆయన ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. అయితే కేసీఆర్ లోకసభ ఎన్నికల్లో అచ్చొచ్చే కరీంనగర్ లోనే మకాం వేస్తారని, తీగలగుట్టపల్లిలోని కేసీఆర్ భవన్ లో ఉంటూ సమీకరణాలు నెరుపుతారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఇటీవల ప్రకటించారు. అంతేకకుండా ఈ భవన్ లో లిఫ్ట్ ఏర్పాటు చేయడంతో పాటు ఇతర ఏర్పాట్లు కూడా చేయనున్నట్టు కూడా ప్రకటించారు. అయితే వినోద్ కుమార్ ప్రకటించి దాదాపు నెల రోజులు కావస్తున్నా కరీంనగర్ కు కేసీఆర్ ఎప్పుడు వస్తారన్న విషయంపై క్లారిటీ ఇవ్వడం లేదు బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం.
ఎంపీ ఎన్నికలు సమీపిస్తున్నా…
ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల చేసేందుకు ఎన్నికల కమిషన్ సమాయత్తం అవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ సమీకరణాలు నెరిపేందుకు సెంటిమెంట్ గా కలిసొచ్చే కరీంనగర్ కు అధినేత కేసీఆర్ ఎప్పుడు వస్తారన్న చర్చ అటు పార్టీ వర్గాల్లో ఇటు సాధారణ జనంలో మొదలైంది. మాజీ ఎంపీ వినోద్ కుమార్ ప్రకటన తరువాత ఉద్యమానికి ఊపిరిపోసిన జిల్లాకు ఉద్యమ నేత వస్తారని అందరూ ఆశించారు. కానీ ఆయన టూర్ షెడ్యూల్ మాత్రం ఇంకా ఫిక్స్ కాలేదు. అంతేకాకుండా కేసీఆర్ భవన్ లో లిఫ్ట్ ఏర్పాటు వంటి ఏర్పాట్లు కూడా పూర్తి చేయనున్నామని ప్రకటించినప్పటికీ అలాంటి పనులేవి ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తోంది. దీంతో అధినేత కరీంనగర్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అన్న చర్చ సాగుతోంది. లోకసభ ఎన్నికల్లో ఆయన కరీంనగర్ నుండే మంత్రాంగం చేసినట్టయితే సానుకూల ఫలితాలు వస్తాయని పార్టీ నాయకత్వం బావిస్తున్నట్టుగా స్పష్టం అవుతున్నప్పటికీ అధినేత మాత్రం ఇంకా సానుకూలత వ్యక్తం చేయనట్టుగా తెలుస్తోంది.