దిశ దశ, హైదరాబాద్:
మిని భారత్ అని పిలుచుకునే నియోజకవర్గం అది… దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు ఆ లోకసభ పరిధిలో సెటిల్ అయ్యారు. ఉపాధి కోసమో… ఉద్యోగం కోసమో కానీ దేశం నలుమూలల నుండి కూడా ఇక్కడకు వచ్చి స్థిరపడ్డవారు లక్షల్లోనే ఉంటారు. ఇక్కడి నుండి గెలిచిన ఎంపీలు కూడా తాము దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నామని గర్వంగా చెప్పుకుంటారు. తమను కేవలం స్థానికులే కాదు వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఓటర్లు ఎన్నుకున్నారన్న క్రెడిట్ కూడా కొట్టేస్తుంటారు. అంతటి ప్రాధాన్యత ఉన్న ఈ నియోజకవర్గంలో ఇఫ్పుడు సరికొత్త నినాదం వినిపిస్తోంది.
స్పెషాలిటీ ఇది…
హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలను కలుపుకుంటూ ఏర్పాటయిన అతిపెద్ద లోకసభ నియోజకవర్గమే మల్కాజిగిరి. 32 లక్షలకు పైగా ఓటర్లు ఉన్న ఈ నియోజకవర్గంలో కేవలం తెలంగాణ బిడ్డలే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన వారు నివసిస్తున్నారు. ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్న పారిశ్రామిక రంగంలో పనిచేసే వారే కాకుండా వ్యాపార, వాణిజ్య రంగాలను కూడా ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు దేశంలోని ఇతర ప్రాంతాల ప్రజలు. 62 శాతానికి పైగా అక్షరాస్యులు కూడా ఉన్న ఈ నియోజకవర్గం నుండి ఎంపీగా గెలిచిన వారు లోకసభలో ప్రత్యేకతను సంతరించుకుంటారు. అతి ఎక్కువ ఓటర్లు కూడా ఉన్న ఈ నియోజకవర్గం నుండి ప్రాతినిథ్యం వహించిన వారు ఇక్కడి ఓటర్ల మనసులు గెలుచుకోవడం అంటే అషామాషీ కాదు. దేశ రాజకీయాలు కూడా ఈ నియోజకవర్గ ఓటర్లపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ఓటర్ల మనోగతం ఏంటీ..? ఇతర ప్రాంతాల్లోని వారు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారు..? ఆయా రాష్ట్రాల్లో నెలకొన్న పరిస్థితులపై సంపూర్ణమైన అవగాహన ఇక్కడి ఓటర్లకు ఉంటుంది. ఆయా ప్రాంతాల పరిస్థితులను తెలుసుకున్న తరువాతే ఇక్కడి ఓటర్లు తమ మనోగతాన్ని ఓటు రూపంలో చూపిస్తారన్న ప్రచారం కూడా ఉంది. ఇక్కడి నుండి పోటీ చేసే అభ్యర్థుల చరిష్మాతో పాటు పార్టీ యొక్క బలబలాలను కూడా అంచనా వేసే సత్తా మల్కాజిగిరి ఓటర్లకు ఉంటుంది. అంతటి స్పెషాలిటీ ఉన్న ఈ నియోజకవర్గంలో ఓటర్లను ఆకట్టుకునేందుకు వెలుగులోకి వచ్చిన అతి ముఖ్యమైన ప్రచారస్త్రామే ఆశ్యర్యానికి గురి చేస్తోంది.
లోకల్… నాన్ లోకల్…
ఇక్కడి నుండి పోటీ చేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు లోకల్ నాన్ లోకల్ అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చారు. ఆయా పార్టీలు కూడాఇదే అంశం చుట్టూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తున్నాయి. ఫలనా అభ్యర్థి నాన్ లోకల్ అని ఓ పార్టీ వారు… తాము లోకల్ కాకున్నా ప్రజాసేవలో ముందుంటామని చెప్పుకునే ప్రయత్నంలో మరో పార్టీ వారు చెప్పుకుంటూ ఇక్కడి ఓటర్లను తమకు అనుకూలంగా మల్చుకునే పనిలో నిమగ్నం అయ్యారు. అయితే మల్కాజిగిరిలో స్థిరపడిన ఓటర్లంతా కూడా ఇతర ప్రాంతాల నుండి వచ్చి నివాసం ఉంటున్న వారేనన్న విషయాన్ని మర్చి మరీ స్థానికత నినాదాన్ని ఎత్తుకో్వడం విచిత్రంగా మారింది. స్థానికులు, స్థానికేతరులు అన్న నినాదం ఇక్కడ పనిచేస్తుందా..? ఎంత వరకు ప్రభావం చూపుతుంది అన్న విషయాలను పక్కనపెట్టి ఏకంగా ఆ అభ్యర్థి నివాసం ఇన్ని కిలోమీటర్ల దూరంలో ఉంటుంది..? ఈ అభ్యర్థి నివాసం అంత దూరంలో ఉంటుంది అంటూ వివిధ రకాలుగా ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడి నుండి పోటీ చేసే అభ్యర్థులను గెలిపించే ఓటర్లు కూడా వేలాది కిలోమీటర్ల దూరం నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారన్న అంశాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా రాజకీయ తమ పంథాలో ప్రచారం చేసుకుంటూ ముందుకు సాగుతున్నాయి. ప్రత్యర్థులను దెబ్బ కొట్టేందుకు తెరపైకి తీసుకొచ్చిన ఈ నినాదం నాన్ లోకల్ ఓటర్లకు నచ్చకపోతే ప్రతికూల ఫలితాన్ని చవి చూడాల్సి వస్తుందని గమనించకపోవడం విడ్డూరం. ఓ ట్రెండ్ సెట్ చేస్తున్నామని అనుకుంటున్న లీడర్ల తీరుపై ఇక్కడి ఓటర్లు కినుక వహిస్తే మాత్రం ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో ఆలోచించుకో్వల్సిన అవసరమైతే ఉంది.