ఏటీఎఫ్ కన్వీనర్ శశిధర్ ఫైర్…
దిశ దశ, హైదరాబాద్:
ప్రజా యుద్ద నౌక గద్దర్ అంత్యక్రియలు అధికారికంగా చేపట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వ్యతిరేకత మొదలైంది. యాంటీ టెర్రరిజం ఫోరం కన్వీనర్ రావినూతల శశిధర్ ఈ మేరకు విడుదల చేసిన ప్రకటన నెట్టింట వైరల్ అవుతోంది. మావోయిజం భావజాలానికి పోలీసు బలగాలతో అధికారికంగా సెల్యూట్ చేయించడమే తప్ప మరోటి కాదని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని వెంటనే ఉప సంహరించుకోవాలని డిమాండ్ చేశారు శశిధర్. ఆయన అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో నిర్వహించడం అంటే పోలీసు అమర వీరులను అగౌరవపర్చినట్టే అవుతుందన్నారు. ఈ చర్య మావోయిస్టు వ్యతిరేక పోరాటంలో ఎ:తో మంది పోలీసులు అమరులయ్యారని వారి త్యాగాలను అవమానించినట్టే అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తన పాటలతో వేలాది మంది యువకులను నక్సల్స్ ఉద్యమం వైపు మళ్లించిన గద్దర్ ప్రజా స్వామ్యానికి వ్యతిరేకంగా వ్యవహరించారన్నారు. నక్సల్స్ ఉద్యమంలో వేలాదిమంది పోలీసులు బలయ్యారని, సాధారణ పౌరులపై, జాతీయ వాదులపై కూడా దాడులు జరిపి అనేక మందిని బలి తీసకున్నారని, ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాలు చేయడానికి తన సాహిత్యం ద్వారా యువతను దేశ ద్రోహులుగా గద్దర్ తీర్చిదిద్దారని శశిధర్ ఆరోపించారు. అలాంటి వ్యక్తికి తెలంగాణ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు చేపట్టాలని నిర్ణయించడాన్ని ఖండిస్తున్నామని, ప్రభుత్వ నిర్ణయం ప్రజాస్వామ్య పరిరక్షణలో, శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలను అర్పించిన పోలీసు అమర వీరుల త్యాగాలను, ప్రజల త్యాగాలను అగౌరవపర్చడమేనని శశిదర్ అన్నారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పోలీసు బలగాల ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీస్తుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రజాస్వామ్య వాదులాంతా ఖండించాలని, పోలీసు అమరవీరుల కుటుంబాలు కలత చెందుతున్నాయన్నారు. పోలీసు అధికారుల సంఘం కూడా ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాన్ని వ్యతిరేకించి ప్రభుత్వం ఉప సంహరించుకునేలా చూడాలని ఏటీఎఫ్ కన్వీనర్ శశిధర్ కోరారు.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post