పోలీసుల బదిలీలు తప్పవా..? కొత్త సీపీ రాకతో సరికొత్త చర్చ

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పోలీసు అధికారుల బదిలీలపై చర్చ మొదలైంది. సీపీ అభిషేక్ మోహంతి స్థానంలో గౌస్ ఆలం బాధ్యతలు తీసుకోవడంతో బదిలీలు పక్కా జరుగుతాయన్న విషయంపై పోలీసు వర్గాల్లో తర్జనభర్జనలు సాగుతున్నాయి. పొలిటికల్ పోస్టింగుల విషయంలో ఇప్పటి వరకు పని చేసిన సీపీ అభిషేక్ మోహంతి కొంత వ్యతిరేకతను ప్రదర్శించారు. రాజకీయ నాయకులు తమకు అనుకూలమైన అధికారుల పోస్టింగ్ ఇవ్వాలన్న ప్రతిపాదన తీసుకొస్తే…  ఒకే అధికారి పేరు కాకుండా నలుగురు ఐదుగురి పేర్లను తనకు పంపించాలని వారిలో పోలీసు విభాగానికి అవసరమైన వారికి పోస్టింగ్ ఇస్తామని అభిషేక్ మోహంతి నేతల ముందుకు ప్రతిపాదన ఉంచేవారని పోలీసు వర్గాల్లో చర్చ సాగుతోంది. దీంతో కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో పోస్టింగ్ పొందాలన్న అధికారుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో పోస్టింగ్ కోసం పోలీసు అధికారులు ప్రయత్నాలు చేశారు కానీ కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో మాత్రం ఆఫీసర్ ఇంట్రస్ట్ పోస్టింగ్ విధానం కారణంగా చాలా మంది ఇటువైపు కన్నెత్తి చూడలేదు. భూ కబ్జాదారుల విషయంలో కఠినంగా వ్యవహరించిన సీపీ బదిలీ కావడంతో ఇక తమ మార్గం సుగమం అయిందన్న సంతోషం వ్యక్తం అవుతోంది కొంతమంది పోలీసు అధికారుల్లో. కొత్తగా బాధ్యతలు చేపట్టిన పోలీస్ కమిషనర్ గౌస్ ఆలంకు చెప్పించుకుని తమకు అనుకూలమైన చోట పోస్టింగ్ ఆర్డర్లు తెప్పించుకునే పనిలో కొంతమంది పోలీసు అధికారులు నిమగ్నం అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలోనే అభిషేక్ మోహంతిని ఏపీకి అలాట్ చేయగా, ఎన్నికల కోడ్ ముగిసిన తరువాత బదిలీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగిసిన తరువాత రాష్ట్రంలో బారీగా ఐపీఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం కరీంనగర్ సీపీగా గౌస్ ఆలంను నియమించింది. అయితే ఏపీ క్యాడర్ అయిన అభిషేక్ మోహంతి సొంత రాష్ట్రానికి వెళ్లాలన్న ఉత్తర్వులు వెలువడినప్పటి నుండే కమిషనరేట్ లో తమ బెర్తులు ఖరారు చేసుకునే ప్రక్రియకు శ్రీకారం చుట్టారన్న ప్రచారం ఊపందుకుంది. ఉమ్మడి జిల్లాకు చెందిన ముఖ్య నాయకుల వద్దకు చేరుకున్న కొంతమంది పోలీసు అధికారులు పోస్టింగ్ కోసం రికమండేషన్ చేయించుకునే పనిలో నిమగ్నం అయ్యారని తెలుస్తోంది. తాజాగా బాధ్యతలు తీసుకున్న సీపీ గౌస్ ఆలం సంక్షేమం విషయంలో సానుకూలంగా ఉంటారని ఇది తమకు ఎంతో కలిసి వచ్చే విషయమన్న ఆలోచనలో పోలీసు అధికారులు తమ ప్రయత్నాలను మరింత వేగవంతం చేశారు. త్వరలోనే క్షేత్ర స్థాయి అధికారుల బదిలీలు తప్పవన్న ప్రచారం తీవ్రం కావడంతో ఎవరికి వారు పోస్టింగుల కోసం ముమ్మర ప్రయత్నాల్లో మునిగిపోయినట్టుగా పోలీసు వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే పొలిటికల్ పోస్టింగుల విషయంలో కొత్త సీపీ ఎలాంటి నిర్ణయంతో ముందుకు సాగుతారోనన్నది ముందు ముందు తేలనుంది.

You cannot copy content of this page