Mlc Elections: ఎమ్మెల్సీ ఎన్నికలపై శివరాత్రి ఎఫెక్ట్… 26న శివరాత్రి… 27న పోలింగ్…

దిశ దశ, కరీంనగర్:

శివుడి ఆజ్ఞ లేనిదే చీమ అయినా కుట్టదంటారు… ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ డేట్ కూడా శివయ్య ఆజ్ఞతోనే ఫిక్స్ అయినట్టుగా ఉంది. పోటీలో ఉన్న అభ్యర్థులు అటు ఓటరును ప్రాపకం చేసుకోవడంతో పాటు ఇటు శివయ్య అనుగ్రహం కోసం ప్రయత్నించక తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది. ఈ నెల 26న శివరాత్రి పర్వదినం పురస్కరించుకుని పెద్ద సంఖ్యలో భక్తులు శివాలయాలను సందర్శించుకునే అవకాశం ఉంటుంది. నది తీరాల్లో అయితే పుణ్య స్నానాలు చేసి ఆలయాల్లో శివనామ స్మరణ చేస్తుంటారు. అంతేకాకుండా అదే రోజు రాత్రి జాగాహరణ చేస్తుంటారు. చాలా మంది కూడా పుణ్య క్షేత్రాలకు వెళ్లి శివయ్య సన్నిధిలోనే నిద్రాహారాల జోలికి వెళ్లకుండా రోజంతా గడుపుతారు. మరునాడే 27న ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఉండడంతో శివరాత్రి రోజున ఉపవాసం, జాగాహరణ చేసిన వారు పోలింగ్ కేంద్రాల వరకు వచ్చి ఓట్లేసే అవకాశం ఉంటుందా లేదా అన్న భయం అభ్యర్థులకు పట్టుకుంది. శివరాత్రి రోజున నిలాహారం, జాగాహారం చేసినందున మరునాడు రెస్ట్ తీసుకునేందుకే చాలా మంది మొగ్గు చూపుతుంటారు. వీరిలో తమ ఓటర్లు కూడా ఉండే అవకాశం ఉంటుందన్న ఆందోళన అభ్యర్థులను వెంటాడుతున్నట్టుగా ఉంది. అయితే శివరాత్రి ఎఫెక్ట్ పోలింగ్ శాతంపై పడకుండా ఉండేందుకు ఇప్పటి నుండే అభ్యర్థులు జాగ్రత్తలు తీసుకునే పనిలో నిమగ్నం అయ్యారు. హుస్నాబాద్ పట్టణంలో జరిగిన సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్టాడుతూ శివరాత్రి తెల్లవారే పోలింగ్ జరుగుతున్నందున ఓటర్లు ఖచ్చితంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని ఓటు వేయాలని మద్యాహ్నం 3 గంటల వరకే పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. శివరాత్రి రోజున జాగాహరణ చేసిన వారంతా మరునాడు రెస్ట్ తీసుకుని సాయంత్రం కల్లా ఓటు వేయవచ్చన్న ధీమాతో ఉన్నట్టయితే సమయం ముగిసిపోతుందన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని మంత్రి సూచించారు. అభ్యర్థులను తమకు మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని అభ్యర్థించడమే కాకుండా పోలింగ్ కేంద్రాలకు ఖచ్చితంగా చేరుకునే విధంగా ఓటర్లను కోరాల్సిన పరిస్థితి ఎదురయింది. శివరాత్రి ఎఫెక్ట్ కారణంగా ఓటర్లు పోలింగ్ లో పాల్గొనేందుకు ఆసక్తి చూపనట్టయితే తమ తలరాతలు మారే ప్రమాదం ఉంటుందని అభ్యర్థులు ముందుగానే వారిని అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి కూడా తయారైంది. ఏది ఏమైనా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థుల్లో గెలుపోటములు ఎలా ఉంటాయోనన్న ఆలోచనతో పాటు పోలింగ్ ఎంత మేర అవుతుందోనన్న ఆందోళన కూడా మొదలైనట్టుగా ఉంది.

You cannot copy content of this page