దిశ దశ, హైదరాబాద్:
స్త్రీలను గౌరవించడం మన సాంప్రదాయం… వారికి కెటాయించిన సీట్లలో వారినే కూర్చోనిద్దాం అన్న నినాదాలకు ఇక బ్రేకు పడనుందా..? ఈ సీట్లు మహిళలకు కెటాయించబడినవి అని రాసిన సీట్లు ఇక కనిపించకపోయే అవకాశం ఉందా..? అంటే అవుననే అనిపిస్తున్నాయి మారిన పరిణామాలను గమనిస్తే. ఆర్టీసీ అధికారులు ఆలోచనలు ఆచరణలో పెడితే మాత్రం ఇక నుండి ఇప్పటి వరకు కనిపించిన నినాదాలు రూపాంతరం చెందనున్నాయి. ఇక నుండి మహిళల స్థానాన్ని పురుషులు ఆక్రమించకునే పరిస్థితి రానున్నట్టుగా అనిపిస్తోంది.
ఫ్రీ బస్ సర్వీస్ ఎఫెక్ట్…
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినట్టయితే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణాన్ని మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకుంటున్నారు. ఒక దశలో ఉచిత బస్సు సేవలు అందుకుంటున్న మహిళల కారణంగా టికెట్ తీసుకుని ట్రావెల్ చేస్తున్న పురుషులు నిలబడి ప్రయాణం చేయాల్సి వస్తోంది. ఇప్పటికే టికెట్లు తీసుకుని ప్రయాణిస్తున్న పురుషుల పరిస్థితి ఇలా తయారైందంటూ వీడియోలు కూడా వైరల్ చేస్తున్నారు. దీంతో ఆర్టీసీకి డబ్బు చెల్లించే వారికి సరైన గౌరవం దక్కడం లేదన్న వాదనలు కూడా తెరపైకి వచ్చాయి. మహిళల ఫ్రీ బస్సు సర్వీసు ఫెసిలిటీ వల్ల ప్రాక్టికల్ గా ఎదురవుతున్న సమస్యలను ఎప్పటికప్పుడు అధిగమించేందుకు యాజమాన్యం రివ్యూ చేస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ బస్సుల్లో పురుషులకు సీట్లను కెటాయిస్తే ఎలా ఉంటుంది అన్న విషయంపై యాజమాన్యంతో పాటు ప్రభుత్వం కూడా సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. 55 సీట్లున్న బస్సులో 20 సీట్లు పురుషులకు కెటాయించాలా లేక ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలా అనే విషయంపై చర్చలు సాగుతున్నాయి. రాష్ట్రంలోని ఆర్టీసీ డిపోల నుండి పూర్తి వివరాలు సేకరిస్తున్న ఆర్టీసీ అధికారులు కొన్ని ప్రతిపాదనలను ప్రభుత్వం ముందు ఉంచనున్నట్టు సమాచారం. దీనివల్ల క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించే అవకాశం ఉంటుందా ఉంటే ప్రజల నుండి ఎలాంటి స్పందన వస్తుంది అన్న విషయాలపై కూడా చర్చలు జరుగుతున్నాయి.