దిశ దశ, హైదరాబాద్:
ఏపీ ఎన్నికల ఫలితాల ప్రభావం తెలంగాణపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు ఉన్నాయా..? అక్కడ అధికారం చేజిక్కించుకున్న నారా చంద్రబాబు నాయుడు చేస్తున్న డిమాండ్ తెలంగాణ నేతల ఆశలపై నీళ్లు చల్లనుందా..? ఇక్కడి బీజేపీ నాయకులకు అక్కడి ఫలితాలు అశనిపాతంగా మారాయా అంటే అవుననే అనిపిస్తున్నాయి ప్రస్తుతం నెలకొన్న పరిణామాలను గమనిస్తుంటే…
మెజార్టీ ఎఫెక్ట్…
అబ్ కి బార్ మోడీ సర్కార్… చార్ సౌ సీట్స్ అంటూ నినదించి ప్రజా క్షేత్రంలోకి అడుగుపెట్టిన భారతీయ జనతాపార్టీ ఊహించని ఫలితాలను అందుకుంది. ఉత్తర భారతాన అనుకున్న ఫలితాలను సాధించుకోలేకపోగా… దక్షిణాదిన మాత్రం అనూహ్య ఫలితాలను అందుకుంది. అయితే 400 సీట్లను గెల్చుకోలేకపోవడంతో పాటు మ్యాజిక్ ఫిగర్ ను కూడా అందుకోలేకపోయింది. దీంతో ఏన్డీఏ భాగస్వామ్య పక్షాల మద్దతు తప్పనిసరిగా మారింది. ఇందులో ఏపీ నుండి 16 స్థానాలను కైవసం చేసుకున్న టీడీపీది కీలక పాత్రగా మారింది. ఈ నేపథ్యంలో ఏన్డీఏ తొలి సమావేశంలో కూడా టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు ఏపీకి ఇవ్వాల్సిన ప్రాధానత్య గురించి బీజేపీ ముఖ్యనేతలతో చర్చించినట్టుగా జాతీయ మీడియా ఛానెల్లు చెప్తున్నాయి. తన పార్టీకి చెందిన ఎంపీలకు లోకసభ స్పీకర్ తో పాటు, పలు మంత్రి పదవులు ఇవ్వాలన్న డిమాండ్ ను ప్రధాని నరేంద్ర మోడీ ముందు ఉంచినట్టుగా సమాచారం. దీంతో ఏన్డీఏలో చంద్రబాబు నాయుడు మద్దతు అత్యంత కీలకమైన నేపథ్యంలో ఏపీ ఎంపీలకు బీజేపీ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వక తప్పేలా లేదు. దీంతో చంద్రాబాబు నాయుడు అడిగిన పోర్టు పోలియోలను ఎక్కువ సంఖ్యలో టీడీపీకి కట్టబెట్టినట్టయితే మాత్రం తెలంగాణ బీజేపీ ఎంపీలు అధిష్టానం ఆదేశాలకు తలొగ్గక తప్పదు.
ఆశావాహులు…
తెలంగాణ నుండి 8 స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంది. ఈ స్థానాల్లో గెలిచిన వారంతా కూడా సీనియర్ నేతలే కావడంతో అధిష్టానం ఎవరికి అవకాశం కల్పిస్తుందన్నదే పజిల్ గా మారింది. సికింద్రాబాద్ నుండి మరోసారి గెల్చిన కిషన్ రెడ్డి ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో ఉన్నారు. తాజా ఎన్నికల్లో కూడా గెలిచిన ఆయనకు అధిష్టానం ప్రయారిటీ ఇచ్చే అవకాశాలు లేకపోలేదు. కరీంనగర్ నుండి బండి సంజయ్, నిజామాబాద్ నుండి ధర్మపురి అరవింద్ లు రెండోసారి లోకసభకు ఎన్నికయ్యారు. వీరిలో బండి సంజయ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా పనిచేసి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంగ్రామ యాత్ర పేరిట పాదయాత్ర నిర్వహించారు. తెలంగాణాలో పార్టీకి సరికొత్త క్రేజీని తీసుకరావడంలో తన వంతు బాధ్యతను నెరవేర్చారు. పార్టీ అధ్యక్ష్య బాధ్యతల నుండి తప్పించిన అధిష్టానం జాతీయ ప్రధాన కార్యదర్శిగా ప్రమోషన్ ఇచ్చింది. తాజా ఎన్నికల్లో 2 లక్షలకు పైగా మెజారిటీ సాధించిన బండి సంజయ్ కి ప్రధాని మోడీతో పాటు ఆరెస్సెస్ ముఖ్యుల ఆశీస్సులు మెండుగా ఉన్నాయి. ఆయనకు మంత్రి వర్గంలో చాన్స్ ఇచ్చినట్టయితే బీసీలకు న్యాయం చేసినట్టవుంతుందని అధిష్టానం భావిస్తే సంజయ్ కి క్యాబినెట్ లో బెర్త్ ఖాయం అవుతుంది. మరో వైపున నిజామాబాద్ నుండి గెలిచిన ధర్మపురి అరవింద్ కూడా మంత్రి వర్గంలో చాన్స్ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరే ఛాన్స్ ఖచ్చితంగా ఉంది. అలాగే మహబూబ్ నగర్ నుండి గెల్చిన డికె అరుణ సీఎం సొంత నియోజకవర్గం నుండి గెలిచానని, మహిళా కోటాలో తనకే అవకాశం ఇవ్వాలని కోరనున్నారు. మల్కాజ్ గిరి నుండి గెల్చిన ఈటల రాజేందర్ కూడా కేంద్ర మంత్రిగా అవకాశం ఇవ్వాలని ఆశిస్తున్నారు. దేశంలోనే అతి పెద్ద నియోజకవర్గం అయిన మల్కాజ్ గిరి నుండి గెలవడమే ఒక రికార్డ్ అని అంటున్నారు ఆయన సన్నిహితులు. చేవేళ్ల నుండి గెల్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి కూడా జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఉన్న సంబంధాలను దృష్టిలో పెట్టుకుని మంత్రి పదవి ఆశించే అవకాశాలు లేకపోలేదు. మెదక్ నుండి గెల్చిన రఘునందన్ రావు కూడా అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆశిస్తున్నారు. ఈ క్రమంలో అధిష్టానం ఎవరికి ప్రయారిటీ ఇస్తుందన్నదే పజిల్ గా మారింది.
తెలుగు రాష్ట్రాలే…
ఏపీ ఎంపీలకు చంద్రబాబు నాయుడు నాలుగు నుండి ఐదు మంత్రిత్వ శాఖలు కావాలని అడుగుతున్నట్టుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో బీజేపీ అధిష్టానం ఆయనను ఎలా బుజ్జగిస్తుందన్న విషయమే కీలకంగా మారింది. ఏపీ హక్కుల విషయంలో రాజీ పడకుండా ఉండాలని చంద్రబాబు నాయుడు బావిస్తున్న తరుణంలో ఆయన విషయంలో ప్రధాని మోడీ సహా ఇతర నేతలు ఎలా క్యాబినెట్ లో ఇచ్చే ప్రాధాన్యత విషయంలో మెప్పించి ఒప్పించడమే కీలకంగా మారింది. చంద్రబాబు నాయడు తక్కువ మందికి మంత్రిత్వ శాఖలు ఇచ్చేందుకు ఒప్పుకుంటేనే తెలంగాణ బీజేపీ ఎంపీల్లో ఎక్కువ మందికి ఛాన్స్ ఉంటుంది. లేనట్టయితే ఇక్కడి వారికి గతంలో మాదిరిగానే సర్దుబాటు చేసే అవకాశం ఉంటుంది. మరోవైపున దక్షిణాది రాష్ట్రమైన కర్ణాటక ప్రాధాన్యతను కూడా పెంచాల్సిన ఆవశ్యకత బీజేపీ జాతీయ నాయకత్వంపై ఉంది. మరో వైపున ఉత్తారాదికి చెందిన ఏంపీలకు కూడా మంత్రిత్వ శాఖల్లో అవకాశం కల్పించేందుకు సమీకరణాలు చేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ నేషనల్ లీడర్స్ ఎలాంటి వ్యూహంతో ముందుకు సాగుతారన్నదే అంతుచిక్కకుండా పోయింది. మ్యాజిక్ మార్క్ దాటకపోవడంతో ఈ సారి ఖచ్చితంగా ఏన్డీఏ భాగస్వామ్య పక్షాలను సంతృప్తి పర్చాల్సిన అవసరం బీజేపీ ముందు ఉన్న పెద్ద సవాలు. దీనిని అధిగమించి తెలంగాణ బీజేపీ ఎంపీల్లో ఎవరెవరికి అవకాశం కల్పిస్తుందన్నదే హాట్ టాపిక్ గా మారింది.