మాజీ మంత్రుల ఇలాకా… చూపిస్తారా తడాకా…

దిశ దశ, హుజురాబాద్:

ఇద్దరు మాజీ మంత్రులు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆ లోకసభ స్థానంలో వారి ప్రభావం ఎంత మేర ఉండనుంది..? అధికారం కోల్పోయిన తరువాత ఎదుర్కొంటున్న తొలి ఎన్నికల్లో తమ పార్టీ అభ్యర్థి గెలుపునకు ఎలాంటి వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు..? నిన్న మొన్నటి వరకు రూలింగ్ లో ఉన్న ఆ ప్రతినిధులు ఇద్దరూ కూడా తమకంటూ ఓ ప్రత్యేకతను సంతరించుకున్న వారే కావడంతో ఈ ఎన్నికల్లో వీరు ఎంత మేర సక్సెస్ అవుతారన్న చర్చ సాగుతోంది.

కరీంనగర్ లోకసభ…

కరీంనగర్ లోకసభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో్ మూడు చోట్ల కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్నారు. సిరిసిల్ల, కరీంనగర్ ఎమ్మెల్యేలుగా గెలిచిన కేటీఆర్, గంగుల కమలాకర్ ఇద్దరు కూడా బలమైన నాయకులు కావడంతో పార్టీకి లాభించే అవకాశం ఉందన్న అంచన్నాలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ కూడా అయిన కెటి రామారావు రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అయితే తన సొంత ఇలాకాలో పార్టీకి మెజార్టీ తీసుకరావల్సిన బాధ్యత కూడా కేటీఆర్ పైనే ఉంది. సిరిసిల్ల నియోజకవర్గం కలియతిరుగుతున్న కేటీఆర్ క్యాంపెయిన్ ట్రెండ్ మార్చేశారు. ప్రజల్లోకి చొచ్చుకపోతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్న ఆయన ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్ కుమార్ కు గెలుపు కోసం కృషి చేస్తున్నారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎంపీ అభ్యర్థితో కలిసి విస్తృతంగా ప్రచారం చేస్తు కరీంనగర్ ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు.

సెగ్మెంట్లకే పరిమితం…

అయితే బీఆర్ఎస్ పార్టీలో అత్యంత ముఖ్యమైన నాయకుడిగా ఉన్న వినోద్ కుమార్ ఇక్కడి నుండి పోటీ చేస్తున్న క్రమంలో పార్టీ అధిష్టానం అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. అధినేత కేసీఆర్ కు కూడా అత్యంత సన్నిహితుడు కావడంతో పార్టీ క్యాడర్ కూడా ఇక్కడ గులాభి జెండా ఎగురేసే విధంగా ప్రచారం చేయాల్సి ఉంది. అయితే ఇద్దరు బలమైన నాయకులు ఎమ్మెల్యేలుగా గెలిచినప్పటికీ వీరు మాత్రం సొంత నియోజకవర్గాలకే పరిమితం అవుతుండడం కొంత మైనస్ గా మారింది. రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో మాజీ మంత్రులు ఏడు సెగ్మెంట్లలో కలియ తిరుగుతున్నప్పటికీ ఇక్కడ మాత్ర తమ ఇలాకాలకే పరిమితం అవుతున్నారు. ఇతర నియోజకవర్గాలపై కూడా మాజీ మంత్రులు ఇద్దరు కూడా దృష్టి సారించినట్టయితే కొంతలో కొంతైనా సానుకూల వాతావరణం వస్తుందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అధికారం కోల్పోయిన నేపథ్యంలో వీరిద్దరు కూడా ఏడు సెగ్మెంట్లలో తిరిగినట్టయితే పార్టీ క్యాడర్ లో కూడా ఆత్మస్థైర్యం వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఇప్పటి వరకు కూడా ఈ ఇద్దరు ముఖ్య నేతలు ప్రాతినిథ్యం వహిస్తున్న ప్రాంతాన్ని దాటి ప్రచారం చేయడం లేదు.

సాగుతున్న వలసలు…

అయితే కీలకంగా ఉన్న ఈ రెండు నియోజకవర్గాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు పార్టీని వీడుతుండడం కూడా ఆందోళన కల్గిస్తున్నది. కరీంనగర్ నుండి ఇటీవల కార్పోరేటర్లు, వారి భర్తలు, ఇతర నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. సిరిసిల్లలో నూ ఐదుగురు కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీని వీడడంతో పాటు వస్త్ర వ్యాపారుల సంఘాలు కూడా కాంగ్రెస్ పార్టీకి అనూకులమని ప్రకటించాయి. దీంతో కీలకమైన సెగ్మెంట్ల నుండి వలసలు సాగుతుండడం పార్టీ వర్గాలను ఆందోళన కల్గిస్తున్నది. లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ క్యాడర్ దూరమవుతుండడం సవాల్ గా మారిందని చెప్పకతప్పదు. కేటీఆర్, గంగులల ప్రభావంతో ఇతర నియోజకవర్గాల్లో పార్టీని బలోపేతం చేయాల్సిన పరిస్థితులు ఉన్నప్పటికీ వారి ఇలాకాల నుండే ఫిరాయింపుల పర్వానికి తెరలేవడం ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలో సొంత ప్రాంతాల్లో పార్టీ శ్రేణులను కట్టడి చేయడంతో పాటు ఇతర సెగ్మెంట్లలో పట్టు నిలుపుకునేందుకు స్పెషల్ ఆపరేషన్ చేపట్టవలసి ఉంది.

You cannot copy content of this page