నామకరణం లేక నగుబాటు…
దిశ దశ, ఎల్ఎండి:
కరీంనగర్ కార్పోరేషన్ కు ముఖ ద్వారంగా ఉన్న కాలనీ అది… భాగ్యనగరం నుండి వచ్చే వారంతా ఆ కాలనీ మీదుగానే బల్దియాలోకి అడుగు పెట్టాల్సి ఉంటుంది… దశాబ్దాలుగా ఆ కాలనీకి పెట్టిన పేర్లు అన్నీ ఇన్నీ కావు. ఏ ఒక్క పేరు కూడా రిజిస్టర్ కాకపోవడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు. ఇంటి నంబర్ ఆధారంగానే తమ ఆచూకి చెప్పాల్సిన పరిస్థితి ఓ వైపు… ల్యాండ్ మార్కులు వివరిస్తూ తమ అడ్రస్ వివరించాల్సిన దుస్థితి మరోవైపు కొనసాగుతోంది. దీంతో ఇంతకీ నా పేరేంటో చెప్పాలని ఆ కాలనీయే అభ్యర్థిస్తున్న పరిస్థితి తయారైంది. వినడానికి విచిత్రంగా ఉన్నా వాస్తవ పరిస్థితులు మాత్రం ఇవేనని కాలనీ వాసులు వాపోతున్నారు. నాలుగు దశాబ్దాలుగా ఎన్నెన్నో ముద్దు పేర్లతో పిలుస్తున్న తమ కాలనీకి స్థిరమైన పేరు ఎంపిక చేసి నామకరణం చేయాలని కోరుతున్నారు.
అలుగునూరు పరిధిలో…
కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం అలుగునూరు గ్రామ పంచాయితీ పరిధిలో ఉన్న ఈ కాలనీ వాసులు పడుతున్న బాధలు వర్ణనాతీతమనే చెప్పాలి. ప్రస్తుతం కరీంనగర్ కార్పోరేషన్ పరిధిలో విలీనం అయిన ఈ ప్రాంతం 8వ డివిజన్ పరిధిలో చేర్చారు అధికారులు. మానేరు నది పరివాహక ప్రాంతంగా ఉన్న ఈ నివాసాల మీదుగా అలుగు పుట్టింది కాబట్టి అలుగునూరుగా నామకరణం చేశారు గతంలో. అయితే ఈ పంచాయితీ కేంద్రానికి దాదాపు 3 కిలో మీటర్ల దూరంలో ఉన్న నివాస ప్రాంతం మాత్రం నేటికీ నామకరణానికి నోచుకోకపోవడం స్థానికులను విస్మయపరుస్తోంది. స్మార్ట్ సిటీగా అభివృద్ది చెందిన కరీంనగర్ వివిధ కాలనీల్లోని రోడ్లకు నెంబర్లు వేసి కాలనీ పేర్లు రాస్తున్నప్పటికీ తాము నివసిస్తున్న ప్రాంతం మాత్రం ఆ భాగ్యానికి నోచుకోవడం లేదని అంటున్నారు.
ల్యాండ్ మార్కులే దిక్కా..?
ఈ కాలనీ చుట్టూ ఏర్పాటయిన SRSP ఆఫీసులు, టీచర్ ట్రైనింగ్ సెంటర్ (డైట్), మహిళా ప్రాంగణం, PAO ఆఫీసు, విద్యుత్ సబ్ స్టేషన్, మానకొండూరు ఎమ్మెల్యే క్యాంపు ఆఫీసు, ఎల్ఎండీ కాలనీ, డ్యాంకు దిగువన చేపలు విక్రయించే ప్రాంతం, శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయ కమాన్ అంటూ ఇలా ఎన్నో ల్యాండ్ మార్కులను వివరిస్తే తప్ప తమ కాలనీ గురించి బయటి వరకు తెలిసే పరిస్థితి లేకుండా పోయింది. హైదరాబాద్, కరీంనగర్ హైవే పక్కన ఉన్నప్పటికీ తమ నివాస ప్రాంతాన్ని వివరించేందుకు ప్రయాసపడాల్సి వస్తోందని అంటున్నారు స్థానికులు.
ముద్దు పేర్ల సమాహారం…
ఇకపోతే దశాబ్దాల క్రితం వెలిసిన ఈ ప్రాంతానికి ఎవరికి నచ్చిన విధంగా వార్లు పేర్లు పెట్టుకోవడం ఆ తరువాత విస్మరించడం పరిపాటిగా మారిందన్న ఆవేదన కూడా స్థానికంగా వ్యక్తం అవుతోంది. ఎల్ఎండీలో చేపలను వేటాడి జీవనం సాగిస్తున్న వారి కోసం అప్పటి ఎమ్మెల్యే వెలిచాల జగపతి రావు నివేశనా స్థలాలు ఇచ్చారు. అప్పుడు ఈ ప్రాంతానికి కేశవ నగర్ అని పేరు పెట్టగా ఆ శిలాఫలకం ధ్వసం అయిపోవడంతో ఆ పేరు కూడా కాలగర్భంలో కలిసిపోయింది. ఆ తరువాత ఇక్కడ నివాసం ఉంటున్న తమిళులకు నివేశన స్థలాలు ఇవ్వడంతో తమిళ కాలనీ అని పేరు పెట్టినప్పటికీ అది కూడా వాడుకలో లేకుండా పోయింది. అప్పుడు స్థానికులు మాత్రమే నివాసం ఉన్న ఈ ప్రాంతంలో ఇటీవల కాలంలో జన సాంద్రత కూడా పెరిగిపోయింది. హైవే సమీపంలో ఉండడం, హైదరాబాద్ నగరానికి వెల్లే మార్గం కూడా కావడంతో చాలా మంది ఈ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపారు. దీంతో పెద్ద ఎత్తున వెంచర్లు ఏర్పాటు కావడంతో ఇక్కడ జీవనం సాగించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. స్థానికులంతా కలిసి వినాయక నగర్, లేబర్, కాలనీ, కాకతీయ కాలనీ, కేకే నగర్, ఆదర్శనగర్, హుస్సేన్ నగర్, క్రిస్టియన్ కాలనీ, శ్రీ వెంకటేశ్వర కాలనీ, అలుగునూరు-2 అన్న పేర్లు కూడా వాడుకలో ఉన్నాయి. అయితే విచిత్రం ఏంటంటే ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న వారు పెట్టిన పేర్లు కానీ, గతంలో అధికారులు అధికారికంగా నామకరణం చేసిన పేర్లు కానీ అధికారికంగా గుర్తింపు పొందకపోవడం విచిత్రం. ఇప్పటికే అల్గునూరుగానే పిలవబడుతున్న ఈ కాలనీ వాసులకు పోస్టు ద్వార కానీ, కొరియర్ ద్వారా యానీ పార్శిల్స్ వచ్చినట్టయితే డెలివరీ చేసే వారికి వస్తున్న అనుమానాలు నివృత్తి చేయలేక స్థానికుల తల ప్రాణం తోకలోకి వచ్చినంత పనవుతోంది. నూతన పంచాయితీలను ఏర్పాటు చేసేప్పుడు కూడా ఈ కాలనీని హ్యాబిటేషన్ ప్రాంతంగా చూపించినా కొత్త పంచాయితీ ఏర్పడేందుకు మార్గం సుగమం అయ్యేది కానీ అలాంటి ప్రయత్నాలు చేయకపోవడమే ఇప్పటికీ శాపంగా మారిపోయింది. గతంలో మానేరు నగర్ కాలనీగా పిలవబడ్డ ఈ ప్రాంతాన్ని ప్రత్యేక పంచాయితీగా గుర్తించాలని తీర్మాణం చేసినప్పటికీ అధికారులు మాత్రం కనికరించలేదు. ఇదే క్రమంలో మానేరు కాలనీతో పాటు అలుగునూరు పంచాయితీని కరీంనగర్ బల్దియాలో విలీనం చేయడంతో పంచాయితీగా గుర్తింపు పొందుతామనుకున్న స్థానికుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. అప్ గ్రేడ్ అయిన తమ కాలనీకి సరికొత్త గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నప్పటికీ నేటికీ కార్యాచరణకు మాత్రం నోచుకోకపోగా గతంలో స్థానికులు ఏర్పాటు చేసుకున్న మానేరు కాలనీ బోర్డులు కూడా అదృశ్యం అయిపోయాయి. దీంతో కొండనాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్నట్టుగా మారిపోయింది తమ కాలనీ పరిస్థితి అని స్థానికులు వాపోతున్నారు.
చొరవ తీసుకోండి…
ఇకనైనా అధికార యంత్రాంగం అధికారికంగా తమ ప్రాంతానికి నామకరణం చేయాలని స్థానికులు కోరుతున్నారు. పేరు ఏదైనా సరే కానీ తమ కాలనీకి గుర్తింపు వచ్చేందుకు చొరవ తీసుకోవాలని వేడుకుంటున్నారు. పుట్టిన బిడ్డకు పురుడు పోసిన నాడే పేరు పెడితే నాలుగు దశాబ్దాలు దాటినా తమ కాలనీకి అధికారికంగా నామకరణం చేయకపోవడం విచిత్రంగా ఉందని వాపోతున్నారు. బల్దియా అధికారులు తమ కాలనీపై దృష్టి సారించి తమ బాధను అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామని అంటున్నారు.