కాంగ్రెస్ సర్కార్ ఏర్పాటుతో సరికొత్త ఆశలు…
దిశ దశ, హైదరాబాద్:
రికమండేషన్ లెటర్ లేకుంటే పోస్టింగ్ ఇచ్చే పరిస్థితి లేదన్న పరిస్థితికి చేరిపోయిన పోలీసు విభాగంలో ప్రక్షాళన జరుగుతుందా..? కాంగ్రెస్ హయాంలోనూ లాబియిండ్ చేసిన పోలీసు అధికారులకే పోస్టింగ్ ఇచ్చే విధానం కొనసాగుతుందా..? శాంతి భధ్రతల పరిరక్షణ కన్నా తమ ప్రయారిటే ముఖ్యం అన్న రీతిలోనే ఉంటుందా అన్న చర్చే సాగుతోంది రాష్ట్ర పోలీసు విభాగంలో. సాధారణ కానిస్టేబుల్ నుండి ఉన్నతాధికారి వరకు ప్రతి ఒక్క స్థాయిలోనూ రికమండేషన్లకే ప్రాధాన్యత ఇవ్వడంతో చాలా మంది పోలీసు అధికారులు లూప్ లైన్ విభాగాలకే పరిమితం అయ్యారు. గుత్తాధిపత్యం నడిచేవారే పోస్టింగుల్లో ఉన్నారు తప్ప సాధారణ పోలీసు మాత్రం తెరపైకి రాకుండానే మిగిలిపోయారు. 9 ఏళ్లుగా సాగిన ఈ తంతుతో పోలీసు వ్యవస్థ నిర్వీర్యంగా మారిపోయిన పరిస్థితి చేరిందంటే ఏ స్థాయిలో రాజకీయ ప్రమేయం పెరిగిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఒకప్పుడు రౌడీ షీటర్లను కట్టడి చేయడంలో అయినా శాంతి భద్రతల పరిరక్షణలో అయినా… నక్సల్స్ ఏరివేతలో అయినా కూడా దూకుడుగా వ్యవహరించిన పోలీసు అధికారుల్లో చాలామంది కూడా యునిఫారం వేసుకుని మురిసిపోవడం తప్ప లా అండ్ ఆర్డర్ పోస్టింగుల్లో మాత్రం కనిపించకుండా పోయారు. కుటుంబ పోషణ కోసం తప్పని పరిస్థితుల్లో అధికారులు చెప్పిన చోట ఉధ్యోగాలు చేయడం తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి తయారైంది కొంతమంది పోలీసు అధికారులకు.
పొలిటికల్… పోలీస్…
ఒకప్పుడు క్షేత్ర స్థాయి పోలీసు అధికారి నుండి జిల్లా ఎస్సీ వరకు కూడా సామాన్య నాయకులు మాట్లాడాలంటేనే జంకిన పరిస్థితి. అప్పుడు తాను మంచి వాడినని చెప్పించి ఆఫీసర్ వద్ద తన క్యారెక్టర్ బాగుందన్న నమ్మకం కుదిరిన తరువాతే లీడర్లు సదరు పోలీసు అధికారి ముందుకు వెల్లిన పరిస్థితులు ఉండేవి. క్రిమినల్స్ విషయంలో కూడా చాలా కఠినంగా వ్యవహరించడం వల్ల కూడా పోలీస్ అనే భయంతోనే నేరాల కట్టడి సాగిపోయేది. కానీ స్వరాష్ట్రం సిద్దించిన తరువాత ఫ్రెండ్లీ పోలిసింగ్ అంటూ కొత్త విధానానికి శ్రీకారం చుట్టారు. ప్రజలతో గౌరవంగా ఉండాలన్న సదుద్దేశ్యంతో పెట్టిన ఈ విధానం వల్ల లాభ నష్టాలను మాత్రం బేరీజు వేసుకోలేదు. దీనికి తోడు ఖచ్చితంగా రికమండేషన్ లెటర్లు ఇస్తేనే పోస్టింగులు ఇవ్వాలన్న పద్దతి కూడా పోలీసు శాఖను అబాసుపాలు చేసిందన్న ఆవేదన వ్యక్తం అవుతోంది. తమ పోస్టింగుల కోసం సెకండ్ క్యాడర్ లీడర్ నో లేకుంటే ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండే వారినో మచ్చిక చేసుకుని ప్రాపకం పొంది మరీ లెటర్లు తీసుకోవల్సి వచ్చింది. దీంతో చేతిలో లాఠీ, భుజాన తుపాకీ ఉన్నా పోలీసు యంత్రాంగం మాత్రం అచేతనవస్థకు చేరిందన్న వాదనలు బలంగా వినిపించాయి. ఎమ్మెల్యేలు, మంత్రుల వద్ద కింగులుగా ఉన్న వారి చెప్పు చేతల్లోనే పోలీసు వ్యవస్థ కీలుబొమ్మగా మారిపోయిన విషయం బహిరంగ రహస్యం. పోలీసు అధికారుల పరిస్థితి ఏస్థాయికి చేరిందంటే లీడర్ల వద్ద ఉన్న దళారీగాళ్ల ఇంట్లో ఎవరి బర్త్ డే అయినా బొకెలు, నజరానాలు తీసుకెళ్లి శుభాకాంక్షలు చెప్పాల్సి వచ్చింది. ఒకప్పుడు పోలీసు పేరు చెప్తేనే కంటిమీద కునుకు లేకుండా తప్పించుకతిరిగిన వారు కూడా ఈ రోజు పోలీసు వ్యవస్థను శాసించే స్థాయికి చేరిపోయారు. సాధారణ వ్యక్తి వెల్లి ఫిర్యాదు చేసినా సదరు దళారుల క్లియరెన్స్ రాకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేసే పరిస్థితి కూడా లేకుండా పోయిందన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి. దీంతో పోలీసింగ్ అంతా పొలిటికల్ లీడర్ల చెప్పు చేతల్లోకి చేరిపోయిందన్న ఆవేదన ప్రతి పోలీసు అధికారిలోనూ వ్యక్తం అయింది. ఒక రకంగా చెప్పాలంటే ఒకప్పుడు పోలీసు లాఠీని చూసి గజగజలాడిన వారే స్వరాష్ట్రం సిద్దించిన తరువాత లాఠీని విరిచి మరీ తమ గుప్పిట పెట్టుకున్నారన్న అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఓ నాయకుడి అండదండలతో పోలీసు అధికారికి రికమండేషన్ చేసిన వ్యక్తి అవినీతి సొమ్ము అడిగిన ఆడియోలు లీక్ అయినా కూడా క్రిమినల్ కేసులు పెట్టలేని పరిస్థితికి తెలంగాణ పోలీసు వ్యవస్థ చేరిపోయిందంటే ఇక్కడి కాఖీల పరిస్థితి ఎంతటి దయనీయమైన పరిస్థితి చేరింతో అర్థం చేసుకోవచ్చు.
ఫైనాన్సర్ల రాజ్యం…
ఇకపోతే అక్రమ ఫైనాన్స్ వ్యవహారాలపై కొరడా ఝులిపించాల్సిన పోలీసు వ్యవస్థే అప్పులిచ్చే వారి చుట్టూ తిరిగిందన్న ప్రచారం కూడా లేకపోలేదు. తాము లా అండర్ ఆర్డర్ పోస్టింగ్ చేయాలంటే డబ్బు అవసరం అన్న విషయాన్ని గమనించిన కొంతమంది పోలీసు అధికారులు ఫైనాన్సర్ల చెప్పుచేతల్లో చిక్కుకపోయిన సందర్భాలు కూడా లేకపోలేదు. ఇలాంటి వారిని అక్కున చేర్చుకుని ఆర్థిక వనరులను సమకూర్చేందుకు కొంతమంది పోలీసు అధికారులు కూడా అప్పులిప్పించే పనితో సరికొత్త వ్యాపారానికి తెరలేపారాన్న విమర్శలు కూడా లేకపోలేదు. ఇలాంటి పైనాన్సియర్లు, దళారులు చెప్పినట్టుగా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని సెటిల్ మెంట్లు చేయాల్సిన పరిస్థితికి పోలీసు యంత్రాంగం చేరిపోవల్సి వచ్చింది. కొన్ని చోట్ల అయితే సంబంధిత కార్యాలయానికి హెడ్ ఆఫ్ ద బాస్ తో సంబంధం లేకుండానే వారి కార్యాలయాల్లోనే దళారులు, ఫైనాన్సియర్లు చెప్పినట్టుగా నడుచుకోవల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థతి ఎలా తయారైందంటే… పోలీసు బాసు కూడా తమ సబార్డినేట్ చెప్పిన విషయాన్ని తలలు ఊపిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్నదే పోలీసు విభాగంలో జరుగుతున్న చర్చ.