అంకుల్… అరవింద్ మధ్య పోటీ అనివార్యమేనా..? నిజామాబాద్ లోకసభలో ఇదే జరగనుందా..?

దిశ దశ, నిజామాబాద్:

నిజామాబాద్ లోకసభ స్థానానికి ఈ సారి రసవత్తర పోరు సాగనుందా..? దశాబ్దాలుగా అనుభందం పెనవేసుకున్న ఆ రెండు కుటుంబాలకు చెందిన వారే ప్రధాన పార్టీల అభ్యర్థులుగా తలపడనున్నారా..? అంటే అవుననే అనిపిస్తున్నాయి ప్రస్తు పరిస్థితులను గమనిస్తుంటే…

ఇందూరు కేంద్రంగా…

నిజామాబాద్ (ఇందూరు) లోకసభ స్థానం నుండి బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ పోటీ చేయడం ఖాయం కాగా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్ధులు ఎవరన్నదే పజిల్ గా మారింది. అయితే ఈ సారి ఎంపీగా పోటీ చేయాలని ఎమ్మెల్సీ టీ జీవన్ రెడ్డి ఉత్సుకత ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే పలు మార్లు ఆయన ఎంపీగా పోటీ చేస్తానని వ్యాఖ్యానించారు కూడా. దీంతో జీవన్ రెడ్డి ఎక్కడి నుండి పోటీ చేస్తారన్న చర్చ ఇంతకాలం జరిగినప్పటికీ ఆయనకు నిజామాబాద్ ఇంఛార్జీ బాధ్యతలు అప్పగించడంతో కరీంనగర్ నుండి బరిలో నిలిచే అవకాశాలు లేవని స్ఫష్టం అయింది. నిజామాబాద్ నుండి ఆయన పోటీ చేస్తే మాత్రం ఈ సారి ఎన్నికలు రవసత్తరంగా సాగే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో సుదీర్ఘకాలం కొనసాగిన ధర్మపురి శ్రీనివాస్, జీవన్ రెడ్డిలకు సాన్నిహిత్యం ఉంది. వీరిద్దరి స్నేహం కారణంగా అరవింద్ జీవన్ రెడ్డిని అంకుల్ అని సంబోధిస్తారు. అయితే ఈ సారి నిజామాబాద్ నుండి జీవన్ రెడ్డి నిలబడినట్టయితే అంకుల్ తో అరవింద్ పోటీ అనిివార్యం కానుంది. సన్నిహితంగా ఉండే రెండు కుటుంబాలకు చెందిన వారే ఇక్కడ అభ్యర్థులుగా బరిలో నిలిచే అవకాశాలు మెండుగా ఉన్నందున ప్రచార పర్వంలో ఎలాంటి విమర్శలు చేసుకుంటారోనన్న చర్చ కూడా సాగుతోంది. సాధారణంగా విమర్శలు చేయడంలో అరవింద్ దూకుడు ఎక్కువగా ప్రదర్శిస్తుంటారు. తనదైన స్టైల్లో ప్రత్యర్థులపై ఆరోపణలు చేయడంలో ఏ మాత్రం కూడా వెనకడారని ఆయన ఉపన్యాస సరళిని చూస్తే స్పష్టం అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో జీవన్ రెడ్డి పోటీలో ఉన్నట్టయితే అరవింద్ విమర్శలు, ఆరోపణాస్త్రాలు ఎలా ఉండబోతాయన్న విషయంపై కూడా చర్చ సాగుతోంది. మరో వైపున జీవన్ రెడ్డి కూడా విమర్శలు చేయడంలో వైవిద్యతను ప్రదర్శిస్తుంటారు. తనకున్న అపార అనుభవాన్ని తన ప్రకటనల్లో చూపించే ఆయన నిజామాబాద్ అభ్యర్థిగా బరిలో నిలిచినట్టయితే ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారోనన్నది కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. అంతేకాకుండా గత లోకసభ ఎన్నికల్లో కవిత ఓటమే లక్ష్యంగా జీవన్ రెడ్డి అనుచరులు పనిచేశారన్నది బహిరంగ రహస్యం. ప్రత్యక్షంగానో, పరోక్షంగానే జీవన్ రెడ్డి చేసిన సమీకరణాలు కూడా అరవింద్ గెలుపునకు దోహదపడ్డాయి. అయితే వచ్చే లోకసభ ఎన్నికల్లో వీరిద్దరు ప్రత్యర్థులు అయితే ఎలాంటి సమీకరణాలు జరుగుతాయన్నదే హాట్ టాపిక్ గా మారింది.

You cannot copy content of this page