చిట్ ఫండ్ సంస్థల ఆగడాలకు బ్రేకులు పడేనా..?

తాజాగా మరో కేసు నమోదు

దిశ దశ, కరీంనగర్:

సగటు పౌరుడు డబ్బు కూడబెట్టుకునేందుకు ఉన్న మార్గాల్లో చిట్ ఫండ్ విధానం ఒకటి. నెల నెల తమ కష్టార్జితం ద్వారా వచ్చే సంపాదనలో కొంత డబ్బును ఆదా చేసుకుని చీటీల ద్వారా పొదుపు చేసుకున్నట్టయితే తమ అవసరాలు తీరుర్చుకోవచ్చని ఆశిస్తారు చాలా మంది సామాన్యులు. స్థానికంగా నమ్మకం ఉన్న వారు చిట్స్ ప్రారంభించినా అవి చట్ట వ్యతిరేకంగా ఏర్పాటు కావడంతో పాటు అనుమతి లేకుండా చిట్ ప్రారంభించిన వ్యాపారులు ఉడాయించిన సందర్భాలూ లేకపోలేదు. దీంతో ప్రభుత్వ అనుమతి తీసుకున్న చిట్స్ అయితే తమ డబ్బుకు ఢోకా ఉండదన్న నమ్మకంతో సామాన్యులు రిజిస్టర్ చిట్స్ లో పొదుపు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. ఇదే క్రమంలో ప్రజల ఆశలు, వారి అవసరాలనే ఆలంబనగా చేసుకుంటున్న కొన్ని సంస్థలు సగటు పౌరుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. రిజిస్ట్రేషన్ శాఖను సుప్తాచేతనావస్తకు చేర్చి ఇష్టారాజ్యంగా చెలాయిస్తున్న చిట్ ఫండ్ కంపెనీల వ్యవహారంపై కొరడా ఝులిపిస్తామని కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు ప్రకటించారు. ఆయన ప్రకటించిన వారం రోజుల్లోనే ఓ చిట్ సంస్థ కొత్త తరహా అక్రమాలకు తెరలేపడం విచిత్రం.

నిభందనల ప్రకారమేనా..?

వాస్తవంగా నిభందనల ప్రకారం చిట్స్ నిర్వహిస్తున్నారా, బినామీ మెంబర్స్ ఉన్నారా, ఒక్కో చిట్ లో ఎంత మంది సభ్యులు చేరిన తరువాత రిజిస్ట్రేషన్ శాఖ ఆ చిట్ కు అనుమతించాల్సి ఉంటుంది, ఇందుకు ష్యూరిటీగా చిట్ సంస్థలు ఆస్థులైతే మార్ట్ గేజ్, నగదు అయితే ఫిక్స్ డిపాజిట్ బాండ్లను తీసుకోవల్సిన విషయాలపై రిజిస్ట్రేషన్ శాఖ దృష్టి సారించాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఒక సభ్యుడిని తొలగించాలంటే ఇందుకు సంబంధించిన ప్రాసెస్ పూర్తయిన తరువాత అతని స్థానంలో మరో కొత్త సభ్యుడి పేరును చేర్చాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి నెల నెలా చీటి డబ్బులు చెల్లించని వినియోగదారుడు అప్పటికే చెల్లించిన డబ్బుల్లో కంపెనీ ఖర్చులు పోను మిగతావి తిరిగి సదరు సభ్యునికి ఇవ్వాల్సి ఉంటుంది. చిట్ ఎత్తుకున్న తరువాత డబ్బులు చెల్లించనట్టయితే సంస్థపై వరుస ఫిర్యాదులు వస్తే నిబంధనల ప్రకారం సంస్థలపై రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు చర్యలు తీసుకోవల్సి ఉంటుంది. అవసరమైతే సదరు సంస్థ డిపాజిట్ చేసిన డబ్బు తాలూకు ఫిక్స్ డిపాజిట్ లేదా మార్ట్ గేజ్ చేసిన ఆస్థిని వేలం వేసి ఆ డబ్బులు చీటి సభ్యులకు పంచాల్సి ఉంటుంది. కానీ చాలా మంది చిట్ సభ్యులు రిజిస్ట్రేషన్ శాఖకు ఫిర్యాదు చేసినా అవి రికార్డుల్లోకి ఎక్కడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సభ్యులు, చిట్ సంస్థల ప్రతినిధులను పిలిపించి సెటిల్ మెంట్లు చేస్తున్నారన్న విమర్శలు కూడా లేకపోలేదు. చాలా వరకు ఇలాంటి సెటిల్ మెంట్లలో సంస్థలకే ప్రాధాన్యత ఇస్తూ సభ్యులకు అన్యాయం జరిగేలా నిర్ణయాలు తీసుకుంటున్నా సగటు పౌరుడు మింగలేక కక్కలేక ఆగమ్య గోచరంలో కొట్టుమిట్టాడిన సందర్భాలు ఎన్నెన్నో ఉన్నాయి. చాలా చిట్ సంస్థలు పెద్ద ఎత్తున బ్రాంచ్ లు ఓపెన్ చేసి ఇష్టా రీతిన చీటీల పేరిట వసూళ్లకు పాల్పడుతూ సభ్యులకు ప్రలోభాలు ఎర వేస్తూ ప్రచారం చేసుకుంటూ పోతున్నాయి. ఇలాంటి విధానాలు సరికాకపోయినా సామాన్యులను కలల ప్రపంచంలోకి తీసుకెళ్లి మరీ చిట్స్ లో చేర్పించుకుని వారి డబ్బులు తిరిగి చెల్లించేప్పుడు చుక్కలు చూపిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కోర్టులను ఆశ్రయించుకోండి…

అయితే కొన్ని జిల్లాల్లో చిటీలు వేసి నష్టపోయామని రిజిస్ట్రేషన్ శాఖను సభ్యులు ఆశ్రయించినప్పుడు పోస్డ్ డేటెడ్ చెక్కులు ఇప్పించడం, సంస్థ ప్రతినిధులు ఇస్తానన్న డబ్బు మాత్రమే మీ చేతికి వస్తాయని చెప్తుండడం వంటి ఘటనలూ చాలానే ఉన్నాయి. చీటి వేసి మోసపోయిన సభ్యుడు పదే పదే రిజిస్ట్రేషన్ కార్యాలయాల చుట్టు తిరిగితే కోర్టును ఆశ్రయించాలని తామేమి చేయలేమని ఉచిత సలహా పడేసి తప్పించుకుంటున్నారన్న విమర్శలూ ఉన్నాయి. రిజిస్ట్రేషన్ చిట్స్ నిబంధనల ప్రకారం చిట్ సంస్థ వ్యవహరించినట్టయితే సంస్థపై సదరు శాఖ అధికారులే చర్యలు తీసుకునే అవకాశం ఉన్నా కోర్టులకు వెళ్లాలని సూచిస్తుండడం విచిత్రంగా ఉందని అంటున్నారు సభ్యులు. పకడ్భందీగా వ్యవహరించాల్సిన సదరు విభాగానికి చెందిన వారే ఇలాంటి సలహాలు ఇస్తుండడం వల్ల సామాన్యులు నిరాశకు గురువుతున్నారు.

కరీంనగర్ సీపీ సుబ్బారాయుడు

కరీంనగర్ సీపీ వార్నింగ్…

రిజిస్ట్రేషన్ శాఖ అధికార యంత్రాంగం చిట్ సంస్థల నిర్వహాణ తీరు తెన్నులపై దృష్టి సారించి నిబంధనలు అమలవుతున్నాయా లేవా అన్న విషయాలను గమనించి తప్పులు జరిగినట్టయితే ఆదిలోనే చెక్ పెట్టేందుకు కఠిన చర్యలకు పూనుకోవల్సి ఉంటుంది. కానీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఈ పరిస్థితికి మంగళం పాడేశారన్న ఆవేదన వ్యక్తమవుతోంది. ఇటీవల కాలంలో ఇలాంటి ఫిర్యాదుల పరంపర కొనసాగుతుండడంతో కరీంనగర్ సీపీ సుబ్బరాయుడు చొరవ తీసుకుని చిట్స్ సంస్థల ప్రతినిధులతో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేశారు. డబ్బులు తిరిగి చెల్లించకుండా తక్కువ ధరలో ఉన్న భూములను అంటగడ్తున్న విషయం కూడా సీపీ దృష్టికి రావడంతో ఈ విషయాన్ని కూడా సంస్థ ప్రతినిధులతో ఊటంకించారు. ఈ నెల 20న ఏర్పాటు సమావేశంలో పలు కోణాల్లో చిట్స్ సంస్థల ప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేశారు సీపీ సుబ్బారాయుడు. గతంలో వరంగల్ పోలీసు కమిషనర్ గా పని చేసిన తరుణ్ జోషీ కూడా చిట్ సంస్థల ఆగడాలపై సీరియస్ అయ్యారు. కొన్ని సంస్థల భరతం పట్టే పనిలో నిమగ్నమైన క్రమంలో అర్థాంతరగా ఈ విచారణ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో సామాన్యుని ఆశలు మరింత సన్నగిల్లిపోయాయనే చెప్పాలి. తాము శ్రమించి దాచుకున్న సొమ్ము చేతికి రాబోతుందని, తమను మోసం చేసిన చిట్ సంస్థల ఆగడాలకు బ్రేకులు పడబోతున్నాయని సంబరపడ్డారు సభ్యులు. కానీ అర్థాంతరంగా ఈ వ్యవహారం తెరమరుగు కావడంతో సామాన్యుడి వేదన అలాగే ఉండిపోగా, చిట్స్ సంస్థల అక్రమాలకు అడ్డు అదుపూ లేకుండా పోయిందన్న ఆందోళన మొదలైంది. తాజాగా కరీంనగర్ త్రిటౌన్ పోలీసులు నమోదు చేసిన ఈ కేసు మరో కొత్త కోణాన్ని ఆవిష్కరించింది. ఆర్టీసీ వర్క్ షాపు ముందు ఉన్న కనకదుర్గ చిట్ ఫండ్ బ్రాంచ్ లో చిట్ యాక్షన్ జరుగుతుండగా ఆ చిట్ తో సంబంధం లేని వ్యక్తులు వచ్చి వేలంలో పాల్గొన్నారు. ఇదేంటని నిలదీసిన చిట్ ఉద్యోగి, ఏజెంటు కూడా అయిన రావుల రామ్మెహన్ పై ఎదురు దాడికి పూనుకున్నారు సంస్థ ప్రతినిధులు. దీంతో బాధితుడు కరీంనగర్ త్రిటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితులపై క్రైం నెంబర్ 104/2023 లో ఐపీసీ సెక్షన్ 341, 427, 506 రెడ్ విత్ 34ల కింద కేసు నమోదు చేసినట్టు సీఐ దామోదర్ రెడ్డి తెలిపారు. కరీంనగర్ సీపీ హెచ్చరించిన వారం రోజుల తరువాత కూడా చిట్ సంస్థల తీరులో మార్పు రాలేదని ఈ ఘటన స్పష్టం చేస్తోంది.

You cannot copy content of this page