మెడికల్ సీట్ల దందాకు బ్రేక్ పడేనా..?
దిశ దశ, కరీంనగర్:
అతి ఎక్కువ డిమాండ్ ఉన్న ప్రొఫెషనల్ కోర్సుల్లో వైద్య వృత్తి ఒకటి. డిగ్రీ, పీజీ సీట్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. ఇటీవల కాలంలో అల్లోపతి మెడిసిన్ చేయాలన్న ఉత్సాహం యువతలో తీవ్రంగా పెరిగిపోయింది. ఇదే యాజమాన్యాల పాలిట వరంగా మారింది. ఇష్టారీతిన డబ్బులు వసూలు చేయడానికి ఎలాంటి అడ్డదారులు తొక్కేందుకైనా వెనకాడడం లేదు ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యలు. ఏటేటా పెంచుకుంటూ పోతున్న ఫీజులను నియంత్రించేందుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కానీ, యూనివర్శిటీలు కానీ చొరవ చూపలేక పోతున్నాయి. దీంతో మెడికల్ కాలేజీల యాజమాన్యల ఆధిపత్యంలో చట్టాలు చతకిలపడిపోగా… విద్యార్థుల తల్లిదండ్రులు వారు అడిగిన సొమ్ము చెల్లించలేక నరకయాతన పడుతున్నారు. తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ ఎంట్రీ ఇచ్చి రెండు మెడికల్ కాలేజీల యాజమాన్యాలపై కొరడా ఝులిపించడంతో స్కాం వెలుగులోకి వచ్చింది.
సీట్ల అమ్మకాలు…
మేనేజ్ మెంట్ కోటా అయినా, ఎన్ ఆర్ఐ కోటా అయినా మెరిట్ కోటా అయినా ఇలా ఏ కోటా అయినా సరే నిబంధనలను తమకు అనుకూలంగా మల్చుకుని రూ. కోట్లలో ఫీజులు వసూలు చేసే పనిలో ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమన్యాలు నిమగ్నం అయ్యాయని తేటతెల్లం అయింది. కరీంనగర్ చల్మెడ, ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజీలకు చెందిన రూ. 5.34 కోట్ల డిపాజిట్లను అటాచ్ మెంట్ చేసినట్టుగా ఈడీ వెల్లడించింది. మెడికల్ పీజీ సీట్లను బ్లాక్ చేసి రూ. కోట్లలో ఫీజులు వసూలు చేస్తున్నారన్న విషయాన్ని కూడా ఈడీ వివరించింది. దీంతో మెడికల్ కాలేజీల యాజమాన్యాలు తమకు అనుకూల అంశాలను అందిపుచ్చుకుని ఎలా వ్యవహరిస్తున్నారో తేటతెల్లం అయింది. సాధారణ ఫీజుకు మూడు రెట్ల వరకు రెట్టింపు చేసి విద్యార్థుల నుండి వసూలు చేస్తున్నారని, ఈ నగదును నేరుగానే తీసుకుంటున్నారని కూడా వెల్లడించింది. బ్యాంకు అకౌంట్ల ద్వారా లావాదేవీలు జరిపినట్టయితే లెక్కలు చూపించాల్సి వస్తుందన్న
కారణంతో పాటు అదనంగా వసూలు చేస్తున్న ఫీజుల గుట్టు రట్టు కాకుండా ఉండేందుకు ఈ వ్యూహం పన్నారు. కానీ కాళోజీ మెడికల్ యూనివర్శిటీ రిజిస్ట్రార్ ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాల వ్యవహారంపై ఫిర్యాదు చేయడంతో గుట్టు రట్టయింది.
టెక్నికల్ ఎవిడెన్స్…
ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు ఆర్థిక లావాదేవీలను మాత్రం అనధికారకంగా జరిపినప్పటికీ అడ్మిషన్ల ప్రాసెస్ విషయంలో మాత్రం ఇరుక్కున్నారు. మెరిట్ స్టూడెంట్ల పేరిట పీజీ సీట్లను బ్లాక్ చేసి ఆ తరువాత అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకుని వెల్లిపోయారని చూపిస్తున్నట్టుగా ఈడీ విచారణలో తేలింది. కౌన్సిలింగ్ ప్రక్రియ అంతా పూర్తయిన తరువాత మెడికల్ యూనివర్శిటీకి అడ్మిషన్ తీసుకున్న విద్యార్థి పేరిట పెనాల్టీ కట్టి ఆ సీటును వేరే వారికి విక్రయించే దందాకు శ్రీకారం చుట్టినట్టుగా ఈడీ విచారణలో బయటపడింది. యూనివర్శిటీ నిబంధనల ప్రకారం అడ్మిషన్ క్యాన్సిల్ చేసుకున్న స్టూడెంట్ పేరిట జరిమానా చెల్లిస్తే సరిపోతుందన్న ఒక్క అనుకూలతను ఆధారం చేసుకుని మెరిట్ స్టూడెంట్లకు సీట్లు కెటాయించకుండా వాటిని అమ్ముకునేందుకు కాలేజీ యాజమాన్యాలు వ్యవహరించిన తీరు విస్మయం కల్గిస్తోంది. కౌన్సిలింగ్ విధానంలో మెరిట్ విద్యార్థులకు సీట్లు కెటాయించడం వల్ల నామమాత్రపు ఫీజు
మాత్రమే వస్తుందని, వాటిని బ్లాక్ చేసినట్టయితే పెద్ద మొత్తంలో ఫీజులు వసూలు చేసుకోవచ్చని స్కెచ్ వేసుకున్నాయి. దీంతో టెక్నికల్ గా కూడా యాజమాన్యాలు సీట్లను బ్లాక్ చేసినట్టుగా ఈడీ గుర్తించినట్టయింది. మెడికల్ కాలేజీ యాజమాన్యాలు కావాలనే బ్లాక్ చేసి వాటిని ఎక్కువ ధరకు అమ్ముకునేందుకు వ్యూహం రచించాయని ఈడీ విచారణలో తేలడంలో టెక్నికల్ ఎవిడన్స్ అత్యంత కీలకంగా మారింది. కావాలనే మెరిట్ కోటా సీట్లను బ్లాక్ చేసి కౌన్సిలింగ్ ప్రక్రియ అంతా పూర్తయిన తరువాత వాటిని విక్రయించుకునేందుకు భారీ స్కెచ్ వేశారని స్పష్టం అయింది. స్టూడెంట్ అడ్మిషన్ కోసం సీటు బ్లాకు చేసుకుని వెల్లినట్టయితే యూనివర్శిటీకి సదరు స్టూడెంట్ లేదా వారి పేరెంట్స్ చెల్లించాల్సి ఉంటుంది కానీ… కాలేజీ యాజమాన్యాలు, మిడియేటర్లు చెల్లిస్తున్నట్టుగా ఈడీ గుర్తించడం గమనార్హం. తరుచూ మెరిట్ స్టూడెంట్స్ పేరిట సీట్లు బ్లాక్ చేయడం ఆ తరువాత వాటిని ఇతరులకు కెటాయించడం
జరుగుతుండడంతో యూనివర్శిటీ రిజిస్ట్రారర్ కు అనుమానం ఆరా తీసి మట్వాడ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
దళారీ వ్యవస్థ…
వాస్తవంగా వైద్య విద్య సంవత్సరం ఆరంభంలో మెడికల్ కాలేజీలను దళారీల మాఫియా వలయం ఏర్పాటవుతోంది. కన్సల్టెన్సీలు, స్థానిక బ్రోకర్లు, మెడికల్ కాలేజీలో పని చేస్తున్న వారు అంతా కలసి ఓ మాఫియాలా తయారై అడ్మిషన్ల కోసం వచ్చే విద్యార్థుల తల్లిదండ్రలతో బేరసారాలు ఆడుతున్నారన్నది బహిరంగ రహస్యం. మెడికల్ సీట్ కావాలన్న ప్రతిపాదన చేయగానే కాలేజీల ప్రతినిధులు ముందుగానే విద్యార్థులకు సంబంధించిన ఇంటర్మీడియెట్ మార్కుల జాబితా, ఎంట్రన్స్ టెస్టుల ర్యాంకు కార్డులతో పాటు విద్యార్థులకు సంబంధించిన కలు దృవీకరణ పత్రాలు తదితర అన్ని డాక్యూమెంట్ల నఖల్లను అడిగే సాంప్రాదాయాన్ని కూడా ప్రారంభించారు. మేనేజ్ మెంట్ కోటా ద్వారా సీటు కావాలంటే ప్రభుత్వ నిబంధనల ప్రకారం తమ ఫీజు ఇంత
చెల్లించాలని చెప్తే సరిపోతుంది. కానీ వీరు విద్యార్థుల సంపూర్ణ వివరాలు తెలుసుకుని వారికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించిన తరువాతే బేరసారాలు చేస్తుండడానికి కారణం ఏమిటన్నదే మిస్టరీగా మారింది. అయితే సదరు విద్యార్థి ఇతర కాలేజీల్లో అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకున్నట్టయితే అక్కడ ఎంత ఫీజు ఆఫర్ ఇచ్చారు, తమ కాలేజీలో ఎంత ధర చెప్పాలి అన్న అంశాలను కూడా తెలుసుకుని సిండికేట్ దందా కొనసాగించారన్న ప్రచారం కూడా ఉంది. సీట్ల అమ్మకాల్లో మేనేజ్ మెంట్ చేతికి 90 నుండి 95 శాతం వరకు ఫీజు వెలుతుందని, మిగతా అమౌంట్ ను దళారీలు పంచుకోవల్సి ఉంటుందన్న ఒప్పందాలు కూడా జరుగుతున్నాయంటే మెడికల్ సీట్ల దందాలో బ్రోకర్ల రాజ్యం ఎంతమేర తిష్ట వేసిందో అర్థం చేసుకోవచ్చు.
ఈడీ ఎంట్రీతో అయినా…
అయితే ఈడీ అధికారులు వరంగల్ మట్వాడ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదుతో రంగంలోకి దిగి రెండు కాలేజీలకు సంబంధించిన అటాచ్ మెంట్ చేశారు. కానీ రాష్ట్రంలోని ఇతర మెడికల్ కాలేజీల్లో కూడా ఇతరాత్ర దారుల్లో సాగుతున్న సీట్ల అమ్మకాల దందాపై కూడా దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. మెడికల్ కౌన్సిల్
నిబంధనలకు విరుద్దంగా మేనేజ్ మెంట్ కోటా సీట్లలో వసూలు చేస్తున్న ఫీజులతో పాటు లైబ్రరీ, మెస్ తదితరాల పేరిట అదనంగా వసూలు చేస్తున్న విధానాలు నిబంధనలకు అనుకూలమేనా కాదా అన్న విషయాలపై కూడా విచారణ చేయాలన్న అభ్యర్థన వినిపిస్తోంది.
KNRUHS నిర్ణయమేంటో..?
తాజాగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ అధికారులు మెడికల్ కాలేజీ యాజమాన్యాలది తప్పని తేల్చి జప్తు కూడా చేయడంతో కాళోజీ నారాయణ రావు హెల్త్ యూనివర్శిటీ అధికారులు సదరు కాలేజీలపై ఎలాంటి చర్యలు తీసుకుంటారోనన్న చర్చ మొదలైంది. సీట్ల బ్లాక్ వ్యవహారంలో మనీ ల్యాండరింగ్ దందా కొనసాగినట్టు ఈడీ నిర్దారిండచంతో సదరు మెడికల్ కాలేజీలపై యూనివర్శిటీ కఠినంగా వ్యవహరిస్తుందా లేదా అన్న విషయమే ఇప్పుడు ప్రధానంగా మారింది. తప్పు చేసిన యాజమాన్యాలపై కఠినంగా వ్యవహరించినట్టయితే మెడిసిన్
చేయాలనుకున్న విద్యార్థులకు ఊరట లభించే అవకాశం ఉంటుంది.