దిశ దశ, కరీంనగర్:
హలో మీరు మా చిట్ ఫండ్ లో చీటి వేశారు కదా… మీ డబ్బులకు బదులు మా వెంచర్ లో ప్లాట్ అలాట్ చేస్తున్నాం… మీకు మళ్లీ కాల్ చేయగానే రిజిస్ట్రేషన్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకోండి… ఆ వెంచర్ కూడా నేషనల్ హైవేకు సమీపంలోనే ఉంటుంది… గేటెడ్ కమ్యూనిటీ అన్ని వసతులు అందులోనే ఉంటాయి… అవసరమైతే మేమే లోన్ ఇప్పిస్తాం విల్లా కట్టిస్తే రెంట్ ఇప్పిస్తాం… మీకు నెలసరి ఆదాయం కూడా వస్తుంది… క్లబ్ ఏర్పాటు చేస్తున్నాం… స్విమ్మింగ్ ఫుల్ ఉంటుంది ఇలాంటి మాయమాటలు చెప్పిన తరువాత ఠక్కున ఫోన్ కట్ చేసేస్తారు. అవతలి వ్యక్తి ఎదో అడగాలని అనుకున్నా కాల్ చేసిన వారు మాత్రం స్పందించేందుకు కానీ వారి మాటలు వినేందుకు కానీ చాన్స్ ఇవ్వరు. ఫోన్ అందుకున్న ఖాతాదారుడు కుటుంబ సభ్యులకు ఈ విషయం తెలియజేయగానే చీటి పీరియడ్ కంప్లీట్ అయిపోయి ఏండ్లు గడుస్తున్నాయి… చెక్కులు ఇస్తున్నారు కానీ అవి చెల్లడం లేదు… ఏం చేస్తాం ఆ ప్లాట్ అయినా రిజిస్ట్రేషన్ చేసుకుందాం మనం ఇచ్చిన డబ్బులు మనం తీసుకోవాలంటే తప్పదు కదా అని ఆ కుటుంబ సభ్యుల నిర్ణయం తీసుకుంటున్నారు. ఈ పరిస్థితి తెలంగాణాలోని అన్ని జిల్లాల్లోని సగటు చిట్ సభ్యుడు ఎదుర్కొంటున్నదే. చీటీ సంస్థలు మాయమాటలు చెప్పి మచ్చిక చేసుకుని ఖాతాదారులుగా చేర్చుకున్న తరువాత చేతులెత్తేస్తున్న సంఘటనలు కోకొల్లలు. అయితే కొన్ని చిట్ ఫండ్ సంస్థలు రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగి ఖాతాదారులకు సకాలంలో డబ్బులు ఇవ్కకుండా ఎక్కడో మూలన ఉన్న భూములు కొని అడ్డగోలుగా ధరలు పెంచేసి వారిని నిట్ట నిలువునా ముంచుతున్నారు. కొకొల్లలుగా బ్రాంచీలను ఏర్పాటు చేసిన ప్రైవేట్ చిట్ సంస్థలపై అజమాయిషీ చేయాల్సిన రిజిస్ట్రేషన్ విభాగం చేష్లలుడిగి చూస్తుండడంతోనే ఈ పరిస్థితి తయారైందన్న విమర్శలు వస్తున్నాయి. నిబంధనలకు విరుద్దగా చీటీలను నిర్వహిస్తూ సామాన్యులను నిండా ముంచుతున్న తీరుపై కఠినంగా వ్యవహరించే వారు లేకుండా పోయారు. దీంతో చిట్ సంస్థల ఇష్టారాజ్యంగా మారిపోయింది తెలంగాణలో. కొన్ని సంస్థలయితే లేఔట్ పర్మిషన్లు కూడా తీసుకోకుండానే ఖాతాదారులకు భూములు రిజిస్ట్రేషన్ చేస్తున్నారంటే వారి జీవితాలో ఎలా ఆడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇలాంటి దందాలకు తెరలేపిన చిట్ సంస్థల తీరుతో ప్రతి ఒక్కరూ విసుగు చెందుతున్నారు. సంబంధం లేని ప్రాంతంలో రియల్ భూం విపరీతంగా పెరిగిపోయిందని చెప్తూ చిట్ ఖాతాదారుల కట్టిన డబ్బులకు తగినంత భూమి ఇస్తాం ఇష్టం ఉంటే తీసుకోండి లేకుంటే లేదని తెగేసి చెప్తున్నాయి చిట్ సంస్థలు.
ఇష్టారాజ్యంగా…
నిభందనలకు విరుద్దంగా ఖాతాదారులకు తిరిగి డబ్బులు చెల్లించకుండా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వారి డబ్బులు పెట్టుబడి పెట్టి తమకు నచ్చిన ధరలు పెట్టి ప్లాట్లు అంటగడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వాస్తవంగా రిజిస్ట్రేషన్ నిభందనల ప్రకారం చిట్ లో సభ్యునిగా చేరిన వారికి తిరిగి వారికి నగదు రూపంలోనే ఇవ్వాలి కానీ ప్రత్యామ్నాయంగా ప్లాట్లు ఇస్తామని చెప్పడం సరికాదని తెలుస్తోంది. ఫిక్స్ డ్ డిపాజిట్లు చేసుకుంటామని చెప్పినా, ప్లాట్లు ముట్టచెప్తామని చెప్పినా రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఫిర్యాదులు చేసే అవకాశం సభ్యులకు ఉంటుంది. కానీ ఈ ఫిర్యాదులు ఇచ్చినా రిజిస్ట్రేషన్ విభాగం నుండి కఠినమైన చర్యలు తీసుకునేందుకు చొరవ తీసుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. చిట్ సంస్థపై ఫిర్యాదు వస్తే బాధితుని పక్షాన నిలబడి సంస్థలపై చర్యలు తీసుకోకుండా మ్యుచువల్ అండర్ స్టాండింగ్ కు రావాలంటూ సలహాలు ఇస్తున్న సందర్భాలు కోకొల్లలు. కరీంనగర్ సమీపంలోని నగునూరు శివార్లలో ఏర్పాటు చేసిన వెంచర్ విషయంలోనే చూసుకుంటే ఇదే పరిస్థితి నెలకొందన్న వాదనలు వినిపిస్తున్నాయి. లే ఔట్ పర్మిషన్ తీసుకున్న తరువాత స్థానికంగా వచ్చిన ఫిర్యాదులతో ‘సుడా’ షోకాజ్ నోటీసులు ఇచ్చింది. నిజానికి చిట్ సంస్థల నిర్వాహకులు ఖాతాదారులు చెల్లించిన సొమ్ముతో ఇతర వ్యాపారాలు చేయకూడదని నిభందనలు చెప్తున్నాయి. ఫిక్స్ డ్ డిపాజిట్ తీసుకున్నట్టయితే రిజర్వూ బ్యాంకు నుండి ప్రత్యేకంగా అనుమతులు తీసుకోవల్సి ఉంటుంది. రక్త సంబంధీకుల నుండి ఫిక్స్డ్ డిపాజిట్లు తీసుకోవాలనుకుంటే కూడా ఆర్బీఐ నుండి హెచ్ యూ ఎఫ్ లైసెన్స్ తీసుకోవల్సి ఉంటుంది. అలాగే చిట్ సంస్థలు ఇతరాత్రా వ్యాపారాలు చేయాలంటే రిజర్వు బ్యాంకులోని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ (ఎన్బీఎఫ్సీ) ద్వారా అనుమతులు తీసుకోవాలి. ఇందులో 60 శాతం డిపాజిట్ చేయడంతో పాటు 49 శాతం షేర్స్, డిబెంచర్స్ ద్వారా చూపించాల్సి ఉండగా ఇందులో షేర్స్ తాలుకు డబ్బుతో మాత్రమే వ్యాపారాలు చేయాల్సి ఉంటుంది. కానీ ఈ నిభందనలు అన్ని తుంగలో తొక్కేసిన చిట్ సంస్థలు ఇష్టా రీతిన వ్యవహరిస్తున్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు. ఇలాంటి వ్యవహరాలకు పాల్పడినట్టయితే క్రిమినల్ చర్యలు తీసుకునేందుకు కూడా రిజిస్ట్రేషన్ విభాగం చొరవ చూపించాల్సి ఉన్నప్పటికీ స్పందన లేకుండా పోయిందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.