తెలుగు రాష్ట్రాల్లో కొత్త చర్చ
దిశ దశ, హైదరాబాద్:
లోకసభలో ప్రవేశ పెట్టనున్న మహిళా బిల్లుపై దేశమంతా ఒక విధమైన చర్చ సాగుతుంటే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం మరోరకమైన చర్చ కూడా మొదలైంది. మహిళా రిజర్వేషన్ కు సంబందించిన బిల్లును కేంద్ర న్యాయ శాఖ మంత్రి మంగళవారం లోకసభలో ప్రవేశపెట్టనున్నారు. బుధవారం వరకు ఈ అంశంపై సుదీర్ఘ చర్చ జరిగిన అనంతరం రాజ్యసభకు చేరనుంది. ఎగువ సభలో కూడా ఈ బిల్లుపై కులంకశంగా చర్చించిన తరువాత గురువారం బిల్లు ఆమోదం పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ బిల్లుతో పాటు తెలుగు రాష్ట్రాలలో నియోజకవర్గాల పునర్విభజన చేస్తారా లేదా అన్న చర్చ సాగుతోంది. ఇప్పుడున్న నియోజకవర్గాలను ప్రామాణికంగా తీసుకుని మహిళా బిల్లును అమలు చేసినా విభజన బిల్లును అనుసరించి నూతన నియోజకవర్గాలకు సంబంధించిన డిలిమిటేషన్ ప్రక్రియ పెండింగ్ లో పెడితే రానున్న కాలంలో ఇబ్బందులు తప్పేలా లేవన్న వాదనలు వినిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం మహిళా బిల్లుకు ముందే ఈ రెండు రాష్ట్రాలలో డిలిమిటేషన్ ప్రక్రియకు ఓకే చెప్తే మహిళలకు కెటాయించే స్థానాలపై క్లారిటీ వస్తుందని లేనట్టయితే, పునర్విభజన చేసిన తరువాత మహిళా రిజర్వేషన్లు తారు మారు అయ్యే అవకాశాలు ఉంటాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ ఏక కాలంలో జరిపినట్టయితే బావుంటందన్న అభిప్రాయాలు ఎక్కువగా వ్యక్తం అవుతున్నాయి. దీనివల్ల మరి కొన్నేళ్ల పాటు కూడా రిజర్వేషన్లు, నూతన నియోజకవర్గాలు యథావిధిగా కొనసాగే అవకాశం ఉంటుందని, డిలిమిటేషన్ అంశాన్ని పెండింగ్ లో పెట్టినట్టయితే మళ్లీ మహిళా రిజర్వేషన్లను కూడా మార్చాల్సిన అవశ్యకత ఏర్పుడుతుందని అంటున్నారు. ఏక కాలంలో డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ ను అమలు చేస్తే ఉభయ తెలుగు రాష్ట్రాల వాసులకు క్లారిటీగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. 2026 వరకు డీలిమిటేషన్ విషయాన్ని పెండింగ్ లో ఉంచాలన్న యోచనలో కేంద్రం ఉన్నదన్న ప్రచారం కూడా వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు కేవలం మహిళా బిల్లుతోనే సరిపెడ్తారని అంటున్న వారు లేకపోలేదు. ఏది ఏమైనా పునర్విభజన విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయంతో ముందుకు సాగుతుందోనన్నది తేలాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.