చేరికకు సిద్దమే కానీ… అక్కున చేర్చుకునే వారేరీ..?

కరీంనగర్ కాంగ్రెస్ పార్టీపై ఇతర పార్టీల్లో చర్చ

దిశ దశ, కరీంనగర్:

అధికారంలో ఉన్న పార్టీ… రానున్న స్థానిక ఎన్నికల నాటికి తమ గెలుపునకు దోహదపడుతుంది… కండువా మార్చితే అంతా బావుంటుంది… కానీ అసలు ట్విస్ట్ అక్కడే ఉందన్న చర్చ సాగుతోంది స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల్లో. కాంగ్రెస్ పార్టీలో చేరే విషయంలో తుది నిర్ణయం తీసుకున్నప్పటికీ అందులో చేరిన తరువాత ఆగమైపోతామన్న ఆందోళనలో ఉన్నారని తెలుస్తోంది.

అంతా ఓకే కానీ…

కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఇదే సరైన సమయమన్న భావనతో ఉన్న స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, లోకల్ లీడర్లు అందులో చేరిన తరువాత తమను ఎవరిని నమ్ముకోవాలోనన్నదే అంతు చిక్కడం లేదని అంటున్నారు. కరీంనగర్ రూరల్, కొత్తపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు రహస్యంగా సమాలోచనలు జరిపి కాంగ్రెస్ పార్టీలో చేరితో తమకు భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నారు. రానున్న స్థానిక ఎన్నికల్లో అవకాశం రావడంతో పాటు తమకు అన్ని విధాలుగా లాభిస్తుందని కూడా గ్రూపులుగా ఏర్పడి చర్చించుకున్నారు. అయితే కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు గమనిస్తే తమకు భవిష్యత్తు ఉంటుందా లేదా అన్న ఆలోచనలతో కొట్టుమిట్టాడుతున్నట్టుగా సమాచారం. ప్రధానంగా కరీంనగర్ నియోజకవర్గం నుండి బలమైన నాయకుడు లేకపోవడమే ఇందుకు కారణమని కూడా వారు అనుకుంటున్నారు. ఇక్కడి నుండి ఇంతకాలం ప్రాతినిథ్యం వహించిన మంత్రి పొన్నం ప్రభాకర్ హుస్నాబాద్ నుండి ఎమ్మెల్యే కావడం ఆయన ప్రధాన దృష్టి అంతా కూడా సిద్దిపేట జిల్లాపైనే పెట్టే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని అనుకుంటున్నారు. దీనివల్ల తమను అక్కున చేర్చుకునే ముఖ్య నాయకుడు లేకపోవడంతో తమ రాజకీయ భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారుతుందన్న ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. రిజర్వేషన్లు కలిసొస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో కానీ నామినేటెడ్ పదవులు కట్టబెట్టే విషయంలో కానీ స్పష్టమైన హామీ ఇవ్వడంతో పాటు తమకు అండగా నిలిచే నాయకుడు కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో కనిపించడం లేదన్న అభిప్రాయంతో ఉన్నారు కరీంనగర్ రూరల్ ప్రాంతానికి చెందిన కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు. కాంగ్రెస్ పార్టీ నుండి పిలుపు వచ్చినప్పటికి అందులో చేరిన తరువాత తమ భవిష్యత్తు అంధకారమువుతందని అనుకుంటున్నారు. కరీంనగర్ లోకసభ స్థానం నుండి బరిలో నిలిచిన రాజేందర్ రావు ఎన్నికల తరువాత స్థానికంగా ఉండే అవకాశాలు అంతగా లేవన్న చర్చ కూడా స్థానిక నాయకుల్లో సాగుతున్నట్టుగా తెలుస్తోంది. దీంతో కీలకమైన నేతలు లేని కాంగ్రెస్ పార్టీలో చేరడం వల్ల తాము భవిష్యత్తులో ఇబ్బందులకు గురవుతామన్న భావనతో ముందుకెల్లేందుకు సాహసిండచం లేదని సమాచారం.

You cannot copy content of this page