దిశ దశ, ఏపీ బ్యూరో:
కాంగ్రెస్ పార్టీ నాయకుడు, సిని నటుడు చిరంజీవి రాజకీయాలకంటే రక్త సంబంధానికే ప్రాధాన్యత ఇచ్చేశారు. ఈ ఎన్నికల ప్రచారానికి దూరంగా ఉంటున్న ఆయన సోషల్ మీడియా వేదికగా మాత్రం తన తమ్మడిని గెలిపించాలని అభ్యర్థించడం సంచలనంగా మారింది. ఇంతకాలం కాంగ్రెస్ నాయకులు చిరంజీవి తమ పార్టీలోనే ఉన్నాడని చెప్పుకొచ్చినా ఆయన మాత్రం తన తమ్మడికి మద్దతునిచ్చి ఏన్డీఏ కూటమికి అనుకూలమని చెప్పకనే చెప్పారు. ఏపీలో జరుగుతున్న ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిరంజీవి ‘‘ఎక్స్’’ వేదికగా ఇచ్చిన పిలుపు సంచలనంగా మారింది. తన తమ్ముడు పవణ్ కళ్యాణ్ ను గెలిపించాలని చిరంజీవి పిఠాపురం ఓటర్లను అభ్యర్థించారు. సినిమాల్లోకి బలవంతంగా వచ్చిన పవణ్ కళ్యాణ్ రాజకీయాల్లోకి మాత్రం స్వచ్ఛందంగా వచ్చాడని, ప్రజలకు సేవ చేయాలన్న తపనతో ఉన్నాడన్నారు. పవన్ ను విమర్శిస్తున్న తీరు తన తల్లిని బాధిస్తోందని వ్యాఖ్యానించిన చిరంజీవి తమ్ముడిని గెలిపించాలని కోరుతున్నారు. స్వచ్ఛంద సేవలు అందించిన పవన్ కళ్యాణ్ ను ఆదరించాలని వేడుకున్నారు. అయితే నెటిజన్లు మాత్రం చిరంజీవి ఇచ్చిన ఈ పిలుపుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే మరికొంతమంది సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. పీఆర్పి పార్టీని టోకును అప్పగించారని, జనసేనను రిటేట్ గా అప్పగిస్తున్నారంటు నెటిజన్లు వ్యాఖ్యానించారు. అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న చిరంజీవి ఇచ్చిన ఈ పిలుపుపై పిఠాపురం వాసులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి.
https://x.com/KChiruTweets/status/1787716656497831997?t=bnbEFbCpah76Q3cFILbjbw&s=08