చైనా కంపెనీ… ముంబాయి ఏజెంట్… సైబర్ ముఠా…

కంబోడియాలో ఉద్యోగాల ఎర…

దిశ దశ, హైదరాబాద్:

చైనా కంపెనీ… ఇండియా నిరుద్యోగులు… సైబర్ నేరాలు చేయించడం… కంబోడియా కేంద్రంగా సాగుతున్న అంతర్జాతీయ దందా. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాల ఎరవేసి వారి వద్ద డబ్బులు వసూలు చేసి, దేశం కాని దేశానికి తీసుకెళ్లి కాల్ సెంటర్లలో పనికి పురమాయించి సైబర్ నేరాలు చేయిస్తున్నారు. కంబోడియా కేంద్రంగా సాగుతున్న ఈ వ్యవహారం గత ఆరు నెలలకు పైగా తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. సిరిసిల్ల ఎస్పీ అఖిల్ మహాజన్ చొరవతో వెలుగులోకి వచ్చిన ఈ వ్యహారంపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు కూడా స్పెషల్ ఆపరేషన్ కు శ్రీకారం చుట్టారు. తాజాగా అంతర్జాతీయ సైబర్ నేరంతో సంబంధం ఉన్న ముంబాయికి చెందిన ఓ మహిళను అరెస్ట్ చేశారు.

ఆమె స్వార్థం కోసం…

ముంబాయిలో ఓవర్సిస్ జాబ్ ప్రాసెసింగ్ చేసే మ్యాక్స్ వెల్ అనే ఏజెన్సీలో ప్రియాంక పని చేసింది. సదరు కంపెనీ మేనేజింగ్ డైరక్టర్ అనారోగ్యంతో ఈ ఏజెన్సీని మూసివేయడంతో తానే స్వయంగా ఓవర్సిస్ జాబ్స్ ఇప్పించే పనిలో నిమగ్నం అయింది. చట్టపరంగా ఎలాంటి అనుమతులు లేకుండానే మ్యాక్సో వెల్ ఏజెన్సీలో పనిచేసిన అనుభవంతో విజిటింగ్ వీసాలు ఇప్పించి తరువాత వాటిని వర్క్ వీసాలుగా మారుస్తానని మాయమాటలు చెప్పి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడింది. కంబోడియా కేంద్రంగా సాగుతున్న సైబర్ క్రైమ్ నెట్ వర్క్ తో సంబంధాలు పెట్టుకున్న ప్రియాంక దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన నిరుద్యోగులను మెసం చేయడమే పనిగా పెట్టుకుంది.

రూ. $500 కమిషన్…

గతంలో ఓవర్సిస్ జాబ్ ప్రాసెసింగ్ ఏజెన్సీలో పనిచేసినప్పటి పరిచయాల ఆధారంగా తన ఉపాధి మార్గం కోసం అన్వేషిస్తోంది ప్రియాంక. ఈ క్రమంలో ముంబైలో ఓవర్సిస్ జాబ్ ప్రాసెసింగ్ ఏజెన్సీ నిర్వహిస్తున్న నారాయణతో పరిచయం చేసుకున్న ఆమె తన అక్రమ కార్యకలాపాలకు శ్రీకారం చుట్టారు. కంబోడియాలో డాటా ఎంట్రీ ఉద్యోగావకాశాల గురించి ప్రియాంకకు వివరించారు. ఝాన్ జీ అనే చైనీయుల యాజమాన్యంలో నడుస్తున్న కంపెనీ డైరక్టర్ జితేందర్ షా అలియాస్ అమీర్ ఖాన్ ను ప్రియాంకకు నారాయణ పరిచయం చేశారు. కంబోడియాకు వెల్లి ఈ మేరకు ఝాన్ జీ కంపెనీ ప్రతినిధులతో ఒప్పందం కుదుర్చుకున్న ప్రియాంకకు ప్రతి అభ్యర్థికి $500 డాలర్ల కమిషన్ ఇస్తామని చెప్పారు. తిరిగి భారతదేశానికి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలను ఎరవేయడమే పనిగా పెట్టుకుంది.

సొంతింటి వారినే…

కంబోడియాలో ఉద్యోగావకాశాల కోసం మొదట తన సొంత ఇంటి వారినే పంపించింది ప్రియాంక. మొదట తన సోదరి కుమారుడు అక్షయ్ వైద్య అతని స్నేహితుడు డానిష్ ఖాన్ లను కంబోడియా పంపించింది. అక్కడ సైబర్ నేరాల్లో పాలు పంచుకోవాలని కంపెనీ ప్రతినిధులు వారి మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురి చేశారు. అయినప్పటికీ ప్రియాంక మాత్రం నిరుద్యోగులను మోసం చేయడం మాత్రం మానుకోలేదు. తన ఏజెన్సీ ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కంబోడియాలో అధిక వేతనం ఇస్తున్న కంపెనీలు ఉన్నాయంటూ వివిధ మాధ్యమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేసింది. ఈ ప్రకటనలను చూసిన హైదరాబాద్ కు చెందిన వంశీ కృష్ణ, సాయి ప్రసాద్ లు గమనించి ప్రియాంకను కాంటక్ట్ చేశారు. ఒక్కొక్కరి వద్ద రూ. 30 వేల కమిషన్ వసూలు చేసిన ప్రియాంక వీరిద్దరిని కంబోడియాకు పంపించింది. అక్కడకు చేరుకున్న వీరిని సైబర్ నేరాలకు పాల్పడాలని కంపెనీ ప్రతినిధులు ఒత్తిడి చేయడంతో వంశీ కృష్ణ, సాయి ప్రసాద్ లు ఇందుకు ఒప్పుకోకపోవడంతో కంపెనీ ప్రతినిధులు వీరిని తీవ్రంగా హింసించారు. సైబర్ నేరాలు చేయిస్తున్న ఆ కంపెనీ ప్రతినిధుల బారి నుండి తప్పించుకుని స్వస్థలానికి చేరుకున్న ఈ బాధితులు ఇద్దరు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులకు ఫిర్యాదు చేశారు. రంగలోకి దిగిన TGCSB టీమ్ ప్రియాంక శివకుమార్ సిద్దూను అరెస్ట్ చేశారు. నిందితురాలు ముంబై నగరంలోని చెంబూరులో నివాసం ఉంటున్నదని ఆరా తీసిన అధికారులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

You cannot copy content of this page