దిశ దశ, జగిత్యాల:
వివాహం జరిగి పట్టుమని నెల రోజులు కూడా కాలేదు. ఏ జరిగిందో ఏమో కానీ బలవన్మరణానికి పాల్పడిందో నవ వధువు. తన చావుకు ఎవరూ బాధ్యులు కాదని తన చేతిపైనే సూసైడ్ నోట్ రాసుకుని ఆమె చనిపోయిన తీరు స్థానికంగా విషాదం నింపింది. జిల్లాలోని మల్యాల మండలం తక్కళ్లపల్లి గ్రామానికి చెందిన భాగ్యలక్ష్మీకి, మ్యాడంపల్లికి చెందిన ఉదయ్ కిరణ్ లకు ఆగస్టు 18న వివాహం జరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ లో స్థిరపడిన కిరణ్ కుటుంబ సభ్యులతో కలిసి జీవనం సాగించి, మంగళవారం సాయంత్రం పుట్టింటికి వచ్చింది. బుధవారం వాష్ రూమ్ లో ఊరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే భాగ్యలక్ష్మి తన చేతిపై సూసైడ్ రాసుకుని మరణించడం గమనార్హం. ‘‘నేను ఎవరి కారణం వల్ల చనిపోలేదు… నన్ను ఎవరూ ఏమీ అనలేదు… నాకీ లోకంలో ఉండడం ఇష్టం లేదు… అందుకే వెళ్లిపోతున్నా’’ అంటూ తన చేతిపై రాసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.