దిశ దశ, హుజురాబాద్:
రయ్ మంటూ దూసుకెల్తున్న కాన్వాయిని సడన్ గా ఆపేయాలని ఆదేశించారా మంత్రి… వెంటనే కారు దిగి లారీ వద్దకు చేరుకుని సహాయక చర్యల్లో మునిగిపోయారు. లారీ కింద చిక్కుకున్న ఓ మహిళ ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న విషయాన్ని గమనించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఆమెను కాపాడేందుకు చొరవ తీసుకున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ సమీపంలోని సింగాపురం మీదుగా సోమవారం ఉదయం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ములుగు జిల్లా పర్యటనకు వెల్తున్నారు. ఇదే సమయంలో అటుగా వెల్తున్న లారీ టైర్ సమీపంలోని ఓ రాడ్డుకు మహిళ జుట్టు చిక్కుకపోయింది. ఈ విషయం గమనించని లారీ డ్రైవర్ లారీని నడిపిస్తూనే ఉన్న విషయాన్ని గమనించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ వెంటనే తన కాన్వాయిని ఆపించి లారీని నిలిపివేసి ఆమెను రక్షించారు. గాయాల పాలైన బాధితురాలి మానకొండూరు మండలం ఖెల్లడ గ్రామానికి చెందిన దివ్యశ్రీని కాపాడేందుకు జుట్టు కత్తిరించి కాపాడి కరీంనగర్ ప్రైవేటు ఆసుపత్రికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడిన బండి సంజయ్ కుమార్ ఆమెకు అవసరమైన వైద్యం అందించాలని ఆసుపత్రి బిల్లు తానే చెల్లిస్తానని చెప్పారు. ప్రాణాపాయ స్థితికి చేరుకున్న తల్లిని చూసిన బిడ్డలు కన్నీరు మున్నీరుగా విలపించగా వారిని ఓదార్చిన కేంద్ర మంత్రి అక్కడి నుండి ములుగు జిల్లాకు బయలుదేరారు.