ప్రమోషన్లు అందుకోని జీవితాలు వీరివి…
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, అంబటి జోజిరెడ్డి ధ్వజం
దిశ దశ, కరీంనగర్:
శాంతి భద్రతల పరిరక్షణలో అత్యంత కీలక భూమిక పోషిస్తున్న పోలీసులు కాఖీ యూనిఫాం ధరించి విధులు నిర్వర్తిస్తున్నా వారి వెనక ఉన్న బాధలను పట్టించుకునే వారే లేకుండా పోయారని ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజిరెడ్డి అన్నారు. శుక్రవారం కరీంనగర్ లో ఆయన ఒక ప్రకటనలో హోంగార్డు రవిందర్ ఆత్మహత్య చేసుకున్న ఘటనపై స్పందించారు. నక్సల్స్ ఏరివేతే అయినా అసాంఘీక కార్యకలపాలను కట్టడి చేయడంలో అయినా పోలీసులు అందిస్తున్న సేవలు అసాధారణమైనవని అన్నారు. స్వచ్ఛంద సేవకులుగా పోలీసు విభాగంలో చేరిన హోంగార్డ్స్ నేడు అన్ని తామై విధులు నిర్వర్తిస్తున్నారని, ఉన్నతాధికారి నుండి క్షేత్ర స్థాయి అధికారి వరకూ ప్రతి ఒక్కరి వద్ద డ్యూటీలు చేస్తూ కాలం వెల్లదీస్తున్నారన్నారు. వారిని పర్మినెంట్ చేయాలన్న డిమాండ్ విషయంలో మాత్రం పోలీసు ఉన్నతాధికారులు కానీ… ప్రభుత్వం కానీ పట్టించుకోకపోవడం విస్మయం కల్గిస్తోందని అంబటి జోజిరెడ్డి అన్నారు. లాఠీకి ఎక్కువ తుపాకికి
తక్కువ అన్నట్టుగా హోంగార్డ్స్ విధుల గురించి తెలుసుకుంటే కడుపు తరుక్కపోకమానదని, ఇలాంటి వారికి ఇచ్చే బోటాబోటి జీతంతో పోలీసు అధికారులు పరోక్షంగా వెట్టి చేయించుకుంటున్నారన్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, సంఘ విద్రోహ శక్తుల కట్టడి, నేర సమాచార సేకరణ, అధికారుల ఇండ్లలో ఊడిగం చేయడం వంటి పనులకు ఉపయోగపడుతున్న హోంగార్డ్స్ వ్యవస్థపై సర్కారు ప్రత్యేక దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
ప్రమోషన్ల మాటేమిటో…
ఇకపోతే రాష్ట్రంలోని ప్రముఖుల నుండి మొదలు సాధారణ పౌరులంతా ప్రశాంత జీవనం సాగించాలంటే పోలీసు వ్యవస్థ అత్యంత కఠినంగా వ్యవహరించే సేవలే ముఖ్యమని, ఇలాంటి వారికి సకాలంలో పదోన్నతులు కల్పించడంలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవడం లేదని ఏఐఎఫ్ బి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అంబటి జోజి రెడ్డి మండిపడ్డారు. చట్టం ముందు అందరూ సమానులేనని ప్రజల ముందు ఉపన్యాసాలు ఇస్తున్నా… పోలీసుల పదోన్నతుల విషయంలో మాత్రం సమానత్వం లేకుండా పోయిందన్న ఆవేదన వ్యక్తమవుతోందన్నారు. జోన్ల వ్యవస్థను ఏర్పాటు చేసి పోలీసు విభాగానికి చెందిన ఒకే బ్యాచ్ పోలీసు అధికారులు పదోన్నతులతో ముందుకు వెల్తుంటే మరో జోన్ లో పనిచేస్తున్న పోలీసులు అపాయింట్ అయిన పోస్టుల్లోనే ఏండ్లుగా మగ్గిపోతున్నారన్నారు. మహారాష్ట్ర తరహాలో రాష్ట్రం అంతా ఒకే విధానం అమలు చేసినట్టయితే పదోన్నతుల్లో జరుగుతున్న వివక్షను సరిచేసినట్టు అవుతుందని, తెలంగాణాకంటే బౌగోళికంగా ఎంతో విశాలంగా ఉన్న మహారాష్ట్రలోని ముంబాయిలో పనిచేస్తున్న ఓ కానిస్టేబుల్ మారుమూల ప్రాంతానికి బదిలీ అయ్యే అవకాశం ఉండగా, మారుమూల ప్రాంతంలో పనిచేస్తున్న వారు ముంబాయి నడిబొడ్డున పనిచేసే అవకాశం ఉంటుందన్నారు. రాష్ట్రం అంతా ఒకే జోన్ గా పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఇలాంటి అసమానత్వాన్ని సరి చేసే అవకాశం ఉంటుందని, జోన్ల వ్యవస్థ వల్ల పోలీసులకు పదోన్నతులు కల్పించే విషయంలో మాత్రం వివక్ష ఖచ్చితంగా ఉంటుందని జోజిరెడ్డి అన్నారు. 1998 నుండి ఇప్పటి వరకు కిందిస్థాయి ఉద్యోగుల్లో
పదోన్నతుల ఊసే లేకుండా పోగా, మరో జోన్లో మాత్రం ఇదే బ్యాచ్ కు చెందిన పోలీసులు పదోన్నతి పొంది మరో పదోన్నతి కోసం సీనియారిటీ జాబితాలో చేరిపోయారన్నారు. అంతేకాకుండా డిపార్ట్ మెంటల్ టెస్టులు పూర్తయి ఏండ్లు గడుస్తున్నా పదోన్నతులు మాత్రం కల్పించడం లేదని, దీంతో పోలీసు యంత్రాంగంలో నైరాశ్యం నెలకొందన్న విషయాన్ని ప్రభుత్వం గమనించాల్సిన అవసరం ఉందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన అసమానత్వంతోనే వరంగల్ జోన్ పోలీసులు పడ్డ బాధలు అన్నీ ఇన్నీ కావని, అప్పుడు
హైదరబాద్ సిటీతో పాటు ఇతర ప్రాంతాల పోలీసులు పదోన్నతులు పొందుతూ ముందుకు సాగితే వరంగల్ జోన్ పోలీసులు మాత్రం సీఐగా పదోన్నతి పొందడానికి 15 ఏళ్లకు పైగా వేచి చూడాల్సి వచ్చిందన్నారు. పోలీసు విభాగంలో పనిచేస్తున్న వారి దయనీయమైన పరిస్థితి ఎలా ఉన్నాయో వరంగల్ జోన్ అధికారుల పదోన్నతుల ప్రక్రియను గమనిస్తే అర్థమవుతుందన్నారు.
డిసిప్లేనరీ డిపార్ట్ మెంట్…
ప్రధానంగా పోలీసు విభాగంలో క్రమశిక్షణ చర్యలు తీవ్రంగా ఉంటాయని, వీరు సమ్మెలు, నిరసనలు తెలిపే అవకాశం ఉండదని అంబటి జోజిరెడ్డి అన్నారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం 24 గంటలూ పని
చేయాల్సి ఉన్నందున డిసిప్లేనరీ డిపార్ట్ మెంట్ గా ఈ విభాగాన్ని పరిగణిస్తారని, దీంతో ఇందులో పనిచేసే వారంతా కూడా విధులకు దగ్గరగా నిరసనలకు దూరంగా ఉండాల్సి ఉంటుందని వివరించారు. దీనివల్ల తమ సమస్యల పరిష్కారం కోసం మాత్రం వీరు ఎలాంటి ఆందోళనలు చేసే అవకాశం లేకుండా పోయిందని, ఉన్నతాధికారులు, ప్రభుత్వం చెప్పిన పనులు చేస్తూ కాలం వెల్లదీయాల్సి వస్తోంది తప్ప డిమాండ్ల సాధన కోసం పోరుబాట పట్టే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత 8 గంటల డ్యూటీకే పరిమితం చేయాలని, వీక్లీ ఆఫ్ లు ఇవ్వాలని ఆర్భాటపు ప్రకటను చేసినప్పటికీ ఆచరణలో పెట్టకపోవడంతో పోలీసులపై పనిభారం కూడా తీవ్రం అవుతోందని అంబటి జోజిరెడ్డి అన్నారు. ఇలాంటి పోలీసు విభాగానికి నిబంధనల ప్రకారం రావల్సిన పదోన్నతులు, ఇతరాత్రా బెనిఫిట్స్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.