ఆరుగురు కార్మికుల సేఫ్…
మంచిర్యాల జిల్లాలో ఘటన
దిశ దశ, చెన్నూరు:
ఐకమత్యం మహాబలం అన్న నినాదాన్ని ఆచరణలో పెట్టి ఆరుగురు కార్మికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఏ మాత్రం అజాగ్రత్తగా వహించినా ఒకరిద్దరైనా వరద ఉధృతిలో కొట్టుకపోయి మృత్యువు పంచన చేరేవారు. కలిసి ఒకే చోట పనిచేస్తున్న ఆ కార్మికులు కలిసే ఇంటికి చేరాలని భావించి వాగు దాటుతున్న క్రమంలో వరద నీటిలో కొద్దిదూరం కొట్టుకపోయినప్పటికీ ధైర్యంగా ఎదురీది సేఫ్ గా దరి చేరారు. మంచిర్యాల జిల్లాలో జరిగిన ఈ సంఘటన పూర్వాపరాలిలా ఉన్నాయి. జిల్లాలోని జైపూర్ ఎన్టీపీసీ ప్లాంటులో పెగడపల్లికి చెందిన ఆరుగురు కార్మికులు రోజులాగానే బుధవారం డ్యూటీకి వెళ్లారు. ఇంటి నుండి వచ్చేప్పుడు నామ మాత్రంగా నీటి పారకంతో ఉన్న పెగడపల్లి వాగు నుండి క్షేమంగానే ఇంటికి చేరుకోవచ్చని భావించిన కార్మికులు డ్యూటీ ముగిసిపోగానే తిరుగు ప్రయాణం అయ్యారు. పెగడపల్లి వాగు వద్దకు చేరుకునే సరికి వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తుండడం చూసి కార్మికులు షాకయ్యారు. సాయంకాలం కావడంతో ఇంటికి చేరాలన్న తపన వారిని వెంటాడుతున్న క్రమంలో వాగు దాటడం ఎలా అని తర్జనభర్జనలు పడ్డారు. చివరకు కలిసికట్టుగా వాగు దాటాలని నిర్ణయించుకుని ఒకరినొకరు పట్టుకుని వాగు దాటే ప్రయత్నం చేశారు. పట్టుమని పది అడుగుల దూరం కూడా వెళ్లలేదు ఎగువ ప్రాంతం నుండి వచ్చిన వరద వారిని దిగువ ప్రాంతానికి నెట్టుకుంటూ వెల్లడం ఆరంభించింది. దీంతో్ వారు బలవంతగా వరద నీటిలో ఎదురీదుతున్నప్పటికి కొంతదూరం వరద నీరు లాక్కెల్లింది. అయినప్పటికీ వారు మాత్రం పట్టు వీడకుండా కలిసికట్టుగా ఉండి వరద ఉధృతిగా ఉన్న ప్రాంతం నుండి కొంత వెనక్కి వెళ్లారు. దీంతో ఆరుగురు కార్మికులు కూడా ప్రాణాలతో బయటపడ్డారు. లేనట్టయితే వీరిలో ఒకరిద్దరి ప్రాణాలైనా గాలిలో కలిసిపోయేవి. తిరిగి జైపూర్ వైపు వెల్లిన ఈ కార్మికులంతా కూడా బ్రతుకు జీవుడా అనుకుంటూ వెనుదిరిగారు. పెగడపల్లికి వెల్లేందుకు అప్పటికే చాలా మంది అక్కడకు చేరుకున్నప్పటికీ వారు వదర ఉధృతిని అంచనా వేస్తూ ఒడ్డుపైనే నిలబడి ఉండగా కార్మికులు వాగును దాటే ప్రయత్నం చేసి ప్రాణాలతో బ్రతికి బయటపడ్డారు.