సరెండర్ అయినా బ్రతికుండేవాడేమో..?

శంకర్ అలియాస్ సుధాకర్ మృతిపై చర్చ…

దిశ దశ, భూపాలపల్లి:

మావోయిస్టు పార్టీ డీవీసీ మెంబర్ సుధాకర్ అలియాస్ శంకర్ ఎన్ కౌంటర్ లో మరణించిన నేపథ్యంలో స్థానికంగా ఓ చర్చ సాగుతోంది. దశాబ్దాల కాలంగా అడవులతోనే మమేకమై విప్లవపంథాలో సాగుతున్న శంకర్ చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో కీలక భూమిక పోషిస్తున్నాడు. అభుజామడ్ అటవీ ప్రాంతంలో పార్టీ నిర్మాణంలో శంకర్ పాత్ర కూడా క్రియాశీలకంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే ఆయన గత సంవత్సరం అనారోగ్యానికి గురికావడంతో జనజీవనంలో కలవాలన్న ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. ఇందుకు సంబంధించిన రాయబారాలు కూడా నెరిపినప్పటికీ శంకర్ మాత్రం లొంగుబాటలో నడిచేందుకు ససేమిరా అన్నట్టుగా సమాచారం. ఒక దశలో శంకర్ లొంగిపోతాడన్నట్టుగానే నమ్మకం కుదిరినప్పటికీ చివరి నిమిషంలో మాత్రం ఆయన బయటకు వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేయనట్టుగా తెలుస్తోంది. దీంతో దండకారణ్యంలోనే పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం అయి ఉన్న శంకర్ మంగళవారం కంకేర్ జిల్లా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో శంకర్ మరణించడంతో ఆయన లోంగుబాటు ప్రతిపాదన విషయం వెలుగులోకి వచ్చింది. అప్పుడే శంకర్ లొంగిపోయినట్టయితే ఈ రోజు ప్రాణాలతో ఉండేవాడని కూడా అంటున్నారు.

వేసవి కాలం ఎఫెక్టా..?

దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఒకటైన దండకారణ్యంలో మావోయిస్టులపై పోలీసులు పై చేయి సాధించిన తీరే సంచలనంగా మారింది. క్రాంతికారీ జనతన్ సర్కార్ నిర్వహిస్తున్న మావోయిస్టులు శత్రుధుర్భేధ్యంగా ఉన్న అభుజామడ్ అటవీ ప్రాంతంలో కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు జరిగిన ఘటనల్లో బలగాలపై మావోయిస్టులే పైచేయిగా నిలిచారు. కానీ మంగళవారం నాటి ఎదురు కాల్పుల్లో మాత్రం ఏకంగా 29 మంది చనిపోవడం సంచలనంగా మారింది. బస్తర్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు ఈ స్థాయిలో ప్రాణనష్టాన్ని చవిచూడడం ఇదే తొలిసారి కావడంతో కారణాలపై పోస్టుమార్టం కూడా మొదలైంది. వేసవి కాలం కావడంతో నీటి వనరుల సమీపంలోనే డెన్ లు ఏర్పాటు చేసుకుంటుంటారు నక్సల్స్. అంతేకాకుండా వేసవి కాలం కావడంతో అడవుల్లో ఆకు రాలిపోతుందని దీంతో తమ ఉనికి బలగాలకు ఈజీగా తెలిసిపోతుందని పార్టీ కూడా గతంలో చాలా సార్లు చెప్పుకొచ్చింది. అయితే తాజాగా కంకేర్ జిల్లాలో జరిగిన ఎదురు కాల్పుల ఘటన స్థలానికి సమీపంలోనే నీటి ప్రవాహం ఉన్నట్టుగా తెలుస్తోంది. 2018లో గడ్చిరోలి జిల్లా భామ్రేఘాట్ తాలుకా తడేగావ్ సమీపంలోని గుట్టపై కూడా భారీ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ గుట్ట కూడా ఇంద్రావతి నది ఒడ్డునే ఉండగా దానిపై డెన్ ఏర్పాటు చేసుకున్న నక్సల్స్ పై పోలీసులు ముప్పేట దాడి చేసి భారీ నష్టాన్ని కల్గించారు. ఎండాకాలం కావడంతో నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాలకు సమీపంలోనే నక్సల్స్ షెల్టర్ తీసుకుంటారన్న విషయాన్ని పసిగట్టే బలగాలు వ్యూహాత్మకంగా దాడులకు పూనుకున్నాయని కూడా భావిస్తున్నారు.

చనిపోయిన వారి వివరాలివే…

కంకేర్ జిల్లా ఛోటే భేథియా అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురు కాల్పుల్లో మరణించిన 29 మందిలో 27 మంది పేర్లను మావోయిస్టు పార్టీ వెల్లడించింది. ఈ మేరకు ఆదివాసీ మహిళా విభాగం అధి కారప్రతినిధి రామ్ కో హిచామీ ఓ ప్రకటనలో వివరాలు వెల్లడించారు. తెలంగాణాలోని భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం చల్లగరిగె గ్రామానికి చెందిన శంకర్, కర్రిగూడెంకు చెందిన బద్రు, తూర్పు బస్తర్ ప్రాంతానికి చెందిన అనిత, మాన్ పూర్ ఏరియాకు చెందిన వినోద్, రీత, భోరంఘడ్ ఏరియాకు చెందిన రమేష్ ఓయమ్, గంగుళూరుకు చెందిన బచ్నూ, మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు చెందిన సురేఖ, నేదునూరుకు చెందిన కవిత, ఆదిలాబాద్ జిల్లా బజర్ హత్నూరు మండలం ట్రెండుకు చెందిన రజిత, దక్షిణ బస్తర్ కు చెందిన భూమే, పశ్చిమ బస్తర్ ఏరియాలోని మారూం గ్రామానికి చెందిన కార్తీక్, దర్భా డివిజన్ కు చెందిన రోషన్, గంగూళురు ఏరియాలోని పిండియాకు చెందిన దేవల్, దుర్డాకు చెందిన ధీను (గుడ్డు), దక్షిణ బస్తర్ కు చెందిన అందేష్, బస్తర్ ఏరియాకు చెందిన జనీలా అలియాస్ మోడి కోవాడి, సంజలా మడ్కం, తైలోడ్ ఇంద్రావతికి చెందిన గీత, పర్కేలికి చెందిన రాజ్ కుర్సం, ఇంద్రావతి బటేవాడకు చెందిన షర్మిల, ఇంద్రావతి రెక్ వాయి సునీల్, నార్త్ బస్తర్ లోని కామిగుండాకు చెందిన శాంతిల, పింటూ గూటం, భజనాథ్, ఇంద్రావతి ఊట్లకు చెందిన శీల, జైనీలు ఈ ఎన్ కౌంటర్ లో చనిపోయారని రామ్ కో హిచామి ఆ ప్రకటనలో వివరించారు. మరో ఇద్దరి వివరాలు తెలియరావడం లేదని కూడా వెల్లడించారు.

You cannot copy content of this page