దిశ దశ, హైదరాబాద్:
1990వ దశాబ్దంలో తెలంగాణ ప్రాంతంలోని ఓ నియోజకవర్గ అభ్యర్థి పల్లె పల్లెన తిరుగుతూ ప్రచారం చేసుకుంటూ వెల్తున్నారు. ఈ క్రమంలో ఓ గ్రామంలో తనకు ఓటేయాలని అభ్యర్థించగా అక్కడి ఓటరు ఈ పార్టీ నుండి వేరే ఆయన నిలబడ్డడు కదా మరి నువ్వొచ్చి అడుగుతున్నవేంది అని అడిగాడు. దీంతో ఖంగుతిన్న ఆ అభ్యర్థి వెంటనే తమాయించుకుని ఆ ఓటరుకు సర్ది చెప్పి గ్రామం నుండి తుర్రుమని వెళ్లిపోయాడు. అప్పట్లో సోషల్ మీడియా అంతగా లేకపోయినప్పటికీ ఆ నోటా ఈ నోట బయటకు పొక్కిన ఈ విషయం పల్లెలంతటికీ పాకిపోయింది. దీంతో తాను పోటీ చేస్తున్న నియోజకవర్గ పరిధి ఎక్కడి వరకు ఉందో కూడా తెలియని వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేశాడా అంటూ చర్చించుకున్నారు జనం. సమాచార వ్యవస్థ అంతగా లేని ఆ కాలంలోనే అప్పటి సమాజమే అభ్యర్థి తీరు గురించి చర్చించుకున్నారంటే… ఇప్పుడు అలాంటి సంఘటనే జరిగినట్టయితే ఎలాంటి స్పందన ప్రజల నుండి నెటిజన్ల నుండి ఉండేదో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కూడా ఇలాంటి సంఘటనలు ఎదురవుతున్నాయి కానీ అభ్యర్థుల రూపంలో కాకుండా వారి వాయిస్ రూపంలో ఎదురవుతోంది. అప్ డేటెడ్ వర్షన్ లో ఓట్లు అభ్యర్థిస్తున్న నాయకులు బల్క్ కాల్స్ సిస్టం ద్వారా ఓట్లు అభ్యర్థించే సాంప్రాదాయానికి శ్రీకారం చుట్టారు. అయితే బల్క్ కాల్స్ కాంట్రాక్టు తీసుకునే ఏజెన్సీలు నియోజకవర్గాల వారిగా ఓటర్ల మొబైల్ నంబర్లు తెలుసుకోలేకపోయారో లేక నెంబర్లను సీక్రెట్ గా సేకరించడంతో వారికి సపోర్ట్ చేసిన ప్రబుద్దులు ఫోన్ నంబర్ల లిస్ట్ ఇచ్చారో తెలియదు కానీ… కొంతమంది ఓటర్లు మాత్రం తలలు పట్టుకుంటున్న పరిస్థితి అయితే తయారైంది. కంటోన్మెంట్ అభ్యర్థికి ఓటు వేయాలని కరీంనగర్ లో ఉన్న ఓ ఓటరుకు ఫోన్ రాగా, అలంపూర్ అభ్యర్థికి ఓటు వేయాలని మెదక్ జిల్లా వాసికి కాల్స్ వస్తున్నాయి. పోలింగ్ తేది సమీపిస్తున్నా కొద్ది బల్క్ కాల్స్ తీవ్రంగా పెరిగిపోతుండడంతో ఒకే ఓటరు వేర్వేరు నియోజకవర్గాల అభ్యర్థులకు ఓట్లు వేయాలని కోరుతున్న తీరు విస్మయం కల్గిస్తోంది. అభ్యర్థులు బల్క్ కాల్స్ సిస్టం ద్వారా నేరుగా తమ నియోజకవర్గం పరిధిలోని ఓటర్లను అభ్యర్థించినట్టవుతుందని, తమ వాయిస్ వారికి వెల్తుందన్న నమ్మకంలో ప్యాకేజీలు మాట్లాడి మరీ ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఆయా నియోజకవర్గాలతో సంబంధం లేని వ్యక్తులకు కూడా ఫోన్లు వస్తుండడంతో సామాన్య ఓటర్లు విసిగెత్తిపోతున్నారు. కొంతమంది అయితే తాము ఫలానా నియోజకవర్గానికి చెందిన వాళ్లం కాదు బాబో అంటే సోషల్ మీడియా వేదికగా పోస్టులు కూడా షేర్ చేస్తున్న పరిస్థితి తయారైందంటే సగటు ఓటరు ఏ స్థాయిలో అసహనానికి గురవుతున్నారో అర్థం చేసుకోవచ్చు.