కన్నీటి పర్యంతం అయిన ‘సహచర’
దిశ దశ, దండకారణ్యం:
ఐదు దశాబ్దాల పాటు విప్లవోద్యమ ప్రస్తానంలో కొనసాగిన కటకం సుదర్శన్ అలియాస్ ఆనంద్ ఎర్రజెండా ఉద్యమంలో కలికితురాయని… ఆయనో విజ్ఞాన గని, అనుభవశాలి అని ప్రముఖ విప్లవకారుడు, మావోయిస్టు పార్టీ ముఖ్యనేత ‘సహచర’ అన్నారు. మీడియాకు విడుదల చేసిన ఓ ప్రకటనలో దులాదాదా గురించి తన అభిప్రాయలను షేర్ చేసుకున్నారు. జూన్ 5న మీడియాలో ఆనంద్ అందనంత దూరాలకు చేరుకున్నాడన్న వార్తలు చదివి నిర్ఘాంతపోయాన్నారు. ఇటీవల ఆయన రాసిన లేఖ గురించి ప్రస్తావించిన సహచర దులాదా అభిప్రాయాలు నేటికీ తన కళ్ల ముందు కదలాడుతున్నాయన్నారు. ఆనంద్ రాసిన లేఖలో…
“మన దేశంలో చైనా అనుభవాలు మక్కికిమక్కి లేదా కొన్ని సవరణలతో అన్వయిస్తే సరియైన ఫలితాలు రావని, మన దేశ నిర్దిష్ట పరిస్థితులపై ఆధారపడి పిపిడబ్ల్యును అన్వయించాలని, మూడు రంగాలలో కూడా ఎత్తుగడలు నూతనంగానే ఉండాలని, మనం ఈ నిర్బంధంలో నిర్మించే సంఘాలు ఒక కొత్త తరహాలో ఉండాలని, గతంలో మనకు లేని ప్రయోగాలు కావాలని”, విప్లవానుబంధాన్ని ఎత్తిపడుతూ రాసిన ఆ ఉత్తరం తాను ఎన్నిసార్లు చదువుకున్నానోనంటూ వ్యాఖ్యానించారు. తాత్కాలిక వెనుకంజలో ఉన్న భారత విప్లవోద్యమాన్ని పురోగమింపచేయడానికి ఆ ఉత్తరంలోని ప్రతి అక్షరం అంకితమై, ఆయనలోని తపన, ఆరాటం, ప్రతిభ, ఐదు దశాబ్దాల గొప్ప విప్లవ అనుభవాన్ని రంగరించి అందించిన చివరి సందేశం అవుతుందని నేనూహించలేకపోయానంటూ సహచర భావోద్వేగానికి గురయ్యారు. ఆనంద్ ఐదు దశాబ్దాల విప్లవోద్యమ అనుభవంలోని ప్రతి అధ్యాయం విశిష్టమైనదేనని, ఆయన జీవితం తెరిచిన పుస్తకమేనన్నారు. అందులోని ప్రతి అధ్యాయం భారత విప్లవోద్యమ ఎగుడు, దిగుళ్లను, ఆటు పోట్లను, సాఫల్య – వైఫల్యాలను, బలహీనతలను, బలమైన అంశాలను రక్తసిక్త చరిత్రను బలంగా ముందుకు తెస్తాయన్నారు. ఆ విజ్ఞాన గని, అపార అనుభవాల నిధి, సిద్ధాంత రాజకీయ అధ్యయనశీలి, అన్వయకర్తకి ముందు వినమ్రంగా తలవంచి విప్లవ జోహర్లర్పిస్తున్నానన్నారు. 1978 నుండి 2023 మధ్య ఒక విప్లవ పార్టీ ఆర్గనైజర్ నుండి కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో మెంబర్ వరకు అన్ని స్థాయిలలో పని చేశాడని, 1980లో జిల్లా కమిటీ సభ్యుడిగా, 1987లో రాష్ట్ర కమిటీ సభ్యుడిగా (దండకారణ్య ఫారెస్ట్ కమిటీ) 1992లో కేంద్ర కమిటీ సభ్యుడిగా 2001లో పొలిట్ బ్యూరో మెంబరుగా పనిచేశారన్నారు. 1995లో ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించి 2001 నుండి 2017 వరకు మధ్య రీజియన్ బ్యూరో బాధ్యతలు నిర్వహించాడన్నారు. 2017లో సీఆర్బీ బాధ్యుడిగా స్వచ్ఛందంగా రిలీవై మరో కామ్రేడ్ కు బాద్యతలు ఇవ్వడం ఆయన నూతన శక్తులకు బాద్యతలు అప్పగించి కొత్త వారిని ప్రోత్సహించడానికి ఒక ఉదాహరణగా నిలిచాడన్నారు. తన విప్లవ ప్రజ్ఞా పాటవాలతో తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పిన ఘనుడు, మావోయిస్టులు ఏజండానే మా ఎజెండా అని పాలకవర్గాలతో సైతం అనిపించిన రాజకీయ దురంధరుడు మన కటకం సుదర్శనేనని సహచర గుర్తు చేశారు. తెలంగాణలో ఎన్నికల రాజకీయాలు నడుపుతున్న వారిని కాదని విప్లవ రాజకీయాలే ప్రత్యామ్నాయం అని ధైర్యంగా చెప్పి ప్రజలను తమ వైపు తిప్పుకోవడం ఊహకైనా అందని విధంగా చేసిన వారిలో ఆనంద్ చతురత సదా అనుసరణీయమైనదన్నారు.
బెల్లంపల్లి బొగ్గు బాయి దొర కొడుకు కార్మిక సోదరి రాజేశ్వరిపై అత్యాచారానికి పాల్పడినపుడు కామ్రేడ్ ఆనంద్, ఆయనతో పాటు అనేక మంది యువకులు కన్నాల బస్తీ, బూడిద గడ్డను విప్లవ రాజకీయాలతో మండింపచేసి తెలంగాణ వ్యాప్తంగా జ్వాలలను విస్తరింపచేసి మాకు “అన్నలు” ఉన్నారన్నా అపార విశ్వాసాన్నిపీడిత మహళలల్లో ఆనాడే కల్పించిన నవయువకుడన్నారు. తెలంగాణ పట్టణాలలో, నగరాలలో గుండాలను గడగడలాడించిన రాడికల్స్ ను ఏ సోదరి మరిచిపోతుంది? దొరల గడీలలో భూస్వాముల ఆగడాలకు బలైన జీవితాలలో విశ్వాసాన్ని నింపిన రాడికల్స్ ను, రైతు కూలీ సంఘాలను, ‘అన్న’లను ఏ పల్లె మరిచిపోతుంది..? ఈనాటి యువతులు, వారి తల్లి తండ్రులు ‘నీ బాంచెన్ దొర, కాల్మొక్తా’ అనే భయంకర రోజుల నుండి విముకై గుండెలపై చేయి వేసుకొని నిశ్చింతగా వుండగలుగుతున్నారంటే, తెలంగాణ గడ్డన చిమ్మిన విప్లవకారుల నెత్తురు, వారి త్యాగాలే కారణమన్నారు. గోదావరి నదిని దాటిన మరుసటి రోజే తమ దళంపై మహారాష్ట్ర పోలీసులు కాల్పులు జరిపి కామ్రేడ్ పెద్ది శంకర్ ను ఎన్ కౌంటర్ లో హతం చేసినప్పటికీ చలించకుండా, మడిమ తిప్పకుండా పార్టీ ఇచ్చిన కర్తవ్యాన్ని పురోగమింపచేయడంలో అహర్నిషలు కృషి చేసి పార్టీ అత్యున్నత నాయకునిగా ఎదిగిన పోరాట యోధుడని సహచర అన్నారు. చివరకు ఆ దండకారణ్య గడ్డలోనే, ఆ మూలవాసీ పీడిత ప్రజల ప్రియమైన నాయకుడిగా, దూలా దాదాగా గుర్తింపు పొంది తుదిశ్వాస విడిచాడన్నారు.
బస్తర్ లోని అమూల్యమైన ప్రాకృతిక వనరులను కొల్లగొట్టుకపోవడానికి దళారీ కార్పొరేట్ వర్గాలు సృష్టించిన ఫాసిస్టు సల్వాజుడూం తెల్ల బీభత్సాన్ని అసమాన ధైర్య సాహాసాలతో ప్రతిఘటించిన మూలవాసీ ప్రజలకు గుండెల్లో నిలిచి, సుక్మా జిల్లాలోని ఉర్సల్ మెట్టలో తన తుపాకీలోని తూటాలు అయిపోవడంతో గొడ్డలితో శతృవును దునుమాడి అసువులు బాసిన గెరిల్లా వీరుని పోరాట స్మృతిలో ఆనంద్ 2010 నుండి దూలాగా మారాడని వివరించారు. కన్నాల బస్తీ కటికం సుదర్శన్, ఆనంద్ గా దాదాపు నాలుగు దశాబ్దాల విప్లవోద్యమ నాయకుడిగా నిలిచి ఉర్పల్ మెట్ట దూలా పేరుతో మన నుండి భౌతికంగా దూరమైనప్పటికీ ఆయన పోరాట చరిత్ర ప్రేరణాదాయకంగానే ఉంటుందన్నారు.
ఇంద్రవెల్లి రైతాంగ పోరాటాన్ని నిర్మించిన నాయకులలో కామ్రేడ్ ఆనంద్ ఒకరని, ఆనాడు ఒక ఆర్గనైజర్ గా, జిల్లా స్థాయి నాయకుడిగా, అమరుడు శ్యాం నాయకత్వంలో ప్రజా రచయిత, ఆనాటి గెరిల్లా దళ కమాండర్ సాహు లాంటి వాళ్లతో కలిసి కొమరం భీం పోరాట కలలను సాకారం చేయడానికి నడుం బిగించిన విప్లవకారుడన్నారు. తట్టా చెమ్మస్ పట్టుకుని కార్మికుడు అయిన మల్లయ్య, ఆయన జీవిత సహచరి వెంకటమ్మలకు తొలి సంతానంగా సుదర్శన్ జన్మించాడని, తండ్రి బాటలో కార్మిక జీవితాన్ని కొనసాగించాలని కలలు కని మైనింగ్ డిప్లొమా చదివి కొద్ది కాలం ఉద్యోగం చేసి ప్రజల మనిషిగా ఐదు దశాబ్దాలు విప్లవోద్యమంలో కొనసాగాడపి సహచర వివరించారు. సుదర్శన్ ఆనంద్ గా విద్యార్థి, యువజన, గిరజన రైతాంగంతోనే తన జీవతాన్ని ఎక్కువగా పంచుకున్నాడని, 1980లలో సింగరేణి కార్మికులు వేజ్ బోర్డు కోసం జరిపిన చారిత్రాత్మక సమ్మె పోరాటం ఎమర్జెన్సీ (1975- 77) తరువాతి కాలంలో విప్లవ కార్మికోద్యమంలో ఒక మైలు రాయన్నారు. సంఘాల నిర్మాణమే రివిజనిజం అనుకున్న గతాన్ని పార్టీ పొరపాటుగా గుర్తించి సింగరేణి కార్మిక సమాఖ్య నిర్మాణానికి పునాదులు వేసిన కార్మికులలో, వారి నాయకులలో కామ్రేడ్ ఆనంద్ కృషి చిరస్మరణీయమైనదని,
కార్మిక బస్తీలలో సారా వ్యతిరేక ఉద్యమం నుండి ప్రతి పోరాటాన్ని లోతుగా అధ్యయనం చేసి వాటికి పరిష్కారాలు చూపడంలో ఒక కార్మికుడిగా, కార్మిక వర్గ నాయకుడిగా ఆనంద్ సమర్థవంతమైన పాత్ర పోషించాడన్నారు. అంతేకాదు, కార్మికులతో రైతాంగాన్ని, కార్మిక పోరాటాలతో రైతాంగ పోరాటలను మమేకం చేసి, కార్మికవర్గ నాయకత్వంలో జమిలిగా నడుపకుండా భారత జనతా ప్రజాస్వామిక విప్లవం జయప్రదం కాదన్న విషయాన్ని గుర్తించాడన్నారు. బెల్లంపల్లి, మందమర్రి, రామకృష్ణపుూర్, గోదావరిఖని, రామగుండం, ఎఫ్.సీ.ఐ తదితర అన్ని రంగాలలోని కార్మికుల పోరాటాలతో ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాల రైతాంగ పోరాటాన్ని ముఖ్యంగా సాయుధ పోరాటంతో అనుసంధానిస్తూ కొత్త తరహ కార్మిక ఉద్యమాలకు బాట చూపిన వారిలో ఆనంద్ ముందువరసలో నిలుస్తాడన్నారు. ఈ సమయంలో ఆయన చూపిన చొరవ, పట్టుదల, కృషి మరువలేనిదన్నారు.
తెలంగాణ విప్లవోద్యమం తాత్కాలిక వెనుకంజలో వున్నప్పటికీ దాని పునర్వికాసానికి అహర్నిషలు కృషి సలుపుతున్న తెలంగాణ రాష్ట్ర కమిటీకి మణుగురు, కొత్తగూడెం, మందమర్రి, బెల్లంపెల్లి, గోదావరిఖని సింగరేణి కార్మిక పోరాటాలతో తెలంగాణ రైతాంగ ఉద్యమానికే కాదు, దండకారణ్యానికి అండగా నిలపాలని నిత్యం మార్గదర్శకత్వం అందించేవాడన్నారు. ఆనంద్ గెరిల్లా జీవితంలో అపార అనుభవాన్ని గడించాడని, తెలంగాణ విప్లవోద్యమంలో సాయుధ పోలీసులపై తొలి మాటుదాడి జరిగిన 1987 నాటి అల్లంపెల్లి నుండి దండకారణ్యంలో పి.ఎల్.జీ.ఏ గెరిల్లాలు జరిపిన 2021 నాటి జీరంగూడ మాటుదాడి వరకు డజన్ల కొద్ది సైనిక చర్యలకు ఒక విప్లవోద్యమ పార్టీ అత్యున్నత కమిటీ నాయకుడిగా ఆయన మార్గదర్శకత్వం వహించాడని సహచర అన్నారు. సైనిక చర్యలకు పథక రూపకల్పన నుండి చర్య ముగిసే వరకు దగ్గరుండి బలగాలను మోటివేట్ చేయడం, గైడ్ చేయడం వరకు అత్యంత శ్రద్ధగా చేసేవాడని, సూక్ష్మస్థాయిలో ఆయన పరిశీలన చేసి ప్రతి చర్యను నిశితంగా సమీక్షించి భవిష్యత్ చర్యలకు మార్గం సుగమం చేసేవాడన్నారు. 1987, 1989లలో సోదర విప్లవకారుల నుండి సైనిక శిక్షణను పొంది పార్టీలో ఏర్పడిన తొలి సైనిక ఇన్ స్ట్రక్టర్ల బృంద నాయకులలో ఒకరిగా బాధ్యతలు నిర్వహించాడని తెలిపారు. ఉత్తర తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, దండకారణ్య కేడర్లను సైనిక రంగంలో తీర్చి దిద్దడానికి ఎనలేని కృషి చేశాడని, తెలంగాణలో ఆదిలాబాదు జిల్లాను ముఖ్యమంత్రి రామారావు ఆదర్శజిల్లాగా ప్రకటించి పోలీసు శిబిరంగా మార్చిన పరిస్థితులలో అడవులలో తీవ్రతరమైన పోలీసు దాడులను ఎదుర్కొంటూ ఆయన ఎంతో సమయస్ఫూర్తితో పార్టీని ముందుకు నడిపించాడన్నారు. ఆ దాడులలో ఆయన నాయకత్వంలో ఎదిగి వచ్చిన మెరికల్లాంటి పార్టీ కేడర్, గెరిల్లాలు ఎందరో రక్త తర్పణం చేసి తెలంగాణ ఉద్యమానికి వన్నె తెచ్చారని వివరించారు. ఆయన చైనా, రష్యా విప్లవోద్యమ అనుభవాలను యధాతథంగా మన దేశ విప్లవోద్యమానికి అన్వయించకూడదని అర్థం చేయించేవాడన్నారు. స్థల కాల పరిస్థితులను బట్టి సిద్ధాంత అన్వయం ఉండాలని, అలా కానపుడు మనం తూర్పుకు వెళ్లాలనుకొని పశ్చిమానికి బండి కట్టిన చందంగా ఉంటుందన్న అభిప్రాయాలు వ్యక్తం చేసేవాడన్నారు. ఉత్తర తెలంగాణ సహ యావత్తు ఆంధ్రప్రదేశ్ ఉద్యమం 1998 నుండి ప్రపంచ బ్యాంకుకు ఒక ప్రయోగశాలగా మారి విప్లవోద్యమాన్ని అణచడానికి పాలకవర్గాలు చేపట్టిన లో-ఇంటెన్సిటీ కాంప్లెక్ట్ (ఎల్.ఐ.సి) విధానాలను లోతుగా అధ్యయనం చేసి విప్లవోద్యమాన్ని నిలబెట్టడానికి ఆయన జరిపిన కృషి ఫలితంగా ఉద్యమం ఎన్ని ఆటు పోట్లను ఎదుర్కొంటున్నప్పటికీ అనేక రకాల అనుభవాలను గడిస్తూ భారత విప్లవోద్యమ శస్త్రాగారానికి నూతన అమ్ములను సమకూర్చుకుంటోందన్నారు. ఆనంద్ మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా పార్టీ సిద్ధాంత రాజకీయాలను వెంట కేడర్ కు, ప్రజలకు అందించడానికి పత్రిక ఒక ఆర్గనైజర్ అన్న లెనిన్ బోధనను గుర్తుచేయడంతో పాటు పలు పార్టీ పత్రికలకు సంపాదక బాధ్యతలు నిర్వహించాడని తెలిపారు. తెలంగాణ ఉద్యమం నుండి వెలువడిన ప్రజా విముక్తి, గెరిల్లా సందేశం పత్రికలకు ఆయన అనేక వ్యాసాలు రాసి అందించాడని, ఆంధ్రప్రదేశ్ ఉద్యమం నుండి వెలువడిన క్రాంతి పత్రికను 2000 తరువాత దాదాపు దశాబ్దన్నర కాలం అనేక ఇబ్బందుల మధ్య ప్రధాన సంపాదకుడిగా కొనసాగించాడన్నారు. కేంద్ర కమిటీ వెలువరించే. పీపుల్స్ వార్ పత్రికకు ఆయన తరచుగా వ్యాసాలు రాసేవాడని, గత నాలుగేళ్లకు పైగా పీపుల్స్ మార్చ్ పత్రిక కామ్రేడ్ దూలాదాదా సంపాదకత్వంలోనే వెలువడుతోందని వివరించారు. రెండేళ్లుగా పార్టీ అధికార ప్రతినిధి అభయ్ బాధ్యతలను నెరవేరుస్తూ దేశ, ప్రపంచ పరిణామాలపై పార్టీ వైఖరులను వెంట వెంట ప్రజల ముందుంచడంలో ప్రశంసనీయమైన పాత్రను పోషించాడని సహచర కొనియాడారు. మారిన పరిస్థితులు, విప్లవోద్యమం అవలంభించాల్సిన ఎత్తుగడలు, పని పద్ధతులను సర్క్యులర్లు, లేఖల రూపంలో తయారు చేసి అందించడంలో బాధ్యతాయుతంగా నిర్వహించాడన్నారు. వ్యవసాయ రంగంలో చోటుచేసుకుంటున్న మార్పులను లోతుగా అధ్యయనం చేసి ఉత్పత్తి సంబంధాలలో వచ్చిన మార్పులను విశ్లేషించి దస్తావేజులను రూపొందించడంలో 2008-12 మధ్య విశేష కృషి చేశాడన్నారు. 1991లోనే “దున్నేవారికే భూమి దొరలు దురాక్రమించిన పట్టా భూములను స్వాధీనం చేసుకోండి” అని పిలుపు ఇచ్చిన సమయంలో ఆయన భూపంపకాలపై ప్రత్యేక అధ్యయనం చేసి పరమేశ్వర్ పేరుతో మీడియాకు ఫ్యామిలీ హోల్డింగ్ లపై వ్యాసాలు రాశాడని తెలిపారు. 2001లో కేంద్ర కమిటీ నిర్ధేశించిన కర్తవ్యం ప్రకారం ఆయన దక్షిణ బస్తర్ గ్రామాలలో వర్గ పరిశీలన జరిపాడని, 2007-12 మధ్య దేశ వ్యవసాయ రంగంలో చోటుచేసుకున్న పెట్టుబడిదారీ విధానాలను నిర్థిష్టంగా అధ్యయనం చేసి ప్రత్యేక డాక్యూమెంటును రూపొందించాడని, 2021లో విడుదల చేసిన భారత దేశంలో ఉత్పత్తి సంబంధాలు దస్తావేజుకు తయారు చేయడంలో ఆయన ఒక ముఖ్యమైన పాత్ర పోషించాడన్నారు.
2004లో నూతన పార్టీ ఆవిర్భావించిన వెంటనే 2005లో భారత పాలక వర్గాలు బస్తర్ లో చేపట్టిన సల్వాజుడుం, ఝార్ఖండ్ లో చేపట్టిన సేంద్రలు, 2009-17ల మధ్య కొనసాగించిన దేశ వ్యాప్త ఆపరేషన్ గ్రీన్ హంట్ కాలంలో పార్టీ, గెరిల్లా సైన్యంలో బోల్షివిక్ తత్వాన్ని ఇనుమడింపచేయడానికి మధ్య రీజినల్ బ్యూరో సర్క్యులర్ లు రూపొందించడంలో, వాటిని అమలు చేయించడంలో బాధ్యుడిగా ఆయన పాత్ర అత్యంత కీలకమైనదని సహచర వివరించారు.