ఈటలకు వై కేటగిరి భద్రత..?

కేంద్ర హోం శాఖ ప్రతిపాదనలు

దిశ దశ, హైదరాబాద్:

బీజేపీ నేత ఈటల రాజేందర్ ఇక నుండి భధ్రతా వలయంలో ఉండ బోతున్నారా..? కేంద్ర భధ్రతా బలగాలు ఆయనను కంటికి రెప్పలా కాపాడేందుకు రంగంలోకి దిగనున్నాయా..? తెలంగాణాలో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. రాజేందర్ ను హత్య చేసేందుకు కుట్ర పన్నారని రూ. 20 కోట్లు సుపారి ఇచ్చేందుకు కూడా నిర్ణయించుకున్నారన్న ఆడియోలు ఉన్నాయంటూ జరిగిన ప్రచారం నేపథ్యంలో ఆయనకు కేంద్ర బధ్రతా బలగాలు వెన్నంటి ఉండే విధంగా రక్షణ కవచం ఏర్పర్చేందుకు రంగం సిద్దమయినట్టుగా తెలుస్తోంది. రాష్ట్రంలో అధికార పార్టీ అధినేతతో వైరం ఉండడంతో పాటు బీజేపీలో చేరిన తరువాత రాష్ట్ర వ్యాప్త పర్యటనలు చేస్తూ బీఆర్ఎస్ పార్టీని బలహీన పర్చేందుకు ఎత్తులు వేస్తున్న క్రమంలో ఆయన హత్యకు కుట్ర చేశారన్న ప్రచారం వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో మంగళవారం మద్యాహ్నం ఆయన సతీమణి జమున కూడా తన కుటుంబ సభ్యులకు ఏమైనా అయితే అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో రాజేందర్ సెక్యూరిటీ విషయంలో కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్టుగా సమాచారం. ఆయనకు వై కేటగిరి భధ్రత కల్పించే విషయంపై కేంద్ర హోంశాఖ ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది.

వై కేటగిరి భద్రత..?

అయితే రాజేందర్ కు వై కేటగిరిలో భద్రత ఇవ్వాలని కేంద్ర హోం శాఖ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఇద్దరు ఎస్పీజీ కమెండోలు మరో 8 మంది సాధారణ కమెండోల వలయం నడుమ ఈటల రాజేందర్ కు రక్షణ కవచం ఏర్పాటు చేయడంతో పాటు రెండు వాహనాలు కూడా సమకూర్చే అవకాశాలు ఉంటాయి. నెలకు రూ. 10 లక్షల వరకు కేంద్ర హోంశాఖ రక్షణ కోసం వెచ్చించాల్సి ఉంటుంది.

గ్రౌండ్ లెవల్లో ఐబీ ఆరా…

మరో వైపున ఈటల రాజేందర్ ఎపిసోడ్ కు సంబంధించిన విషయంపై ఇంటలీజెన్స్ బ్యూరో బృందాలు కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా మంగళవారం సంచరించాయి. ప్రధానంగా హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రత్యేకంగా ఐబీ టీమ్స్ ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ఇక్కడి పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించిన ఐబీ టీమ్స్ మంగళవారం మద్యాహ్నానికల్లా ప్రాథమిక నివేదికలు కేంద్ర హోం శాఖకు పంపించినట్టుగా తెలుస్తోంది. అయితే రెండు రోజుల క్రితం ఈటల రాజేందర్ ఢిల్లీకి వెల్లినప్పుడు కూడా ఈ అంశం గురించి జాతీయ స్థాయి నాయకులతో చర్చించినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు ఆయనకు రక్షణ కల్పించే విషయంలో హోంశాఖ నిర్ణయం తీసుకుని ఐబీ బృందాలను రంగంలోకి దింపినట్టు సమాచారం. రాజేందర్ కు త్వరలోనే కేంద్ర భద్రతా బలగాలు హైదరాబాద్, హుజురాబాద్ లోని ఈటల రాజేందర్ నివాస ప్రాంతాల్లో మోహరించే అవకాశాలు ఉన్నాయి.

You cannot copy content of this page