వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పిస్తూ నిర్ణయం
దిశ దశ, హైదరాబాద్:
బీజేపీ నేత, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు వై ప్లస్ సెక్యూరిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వెలువడంతో శనివారం నుండి రక్షణ వలయం నడుమ ఈటల రాజేందర్ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఇందు కోసం 11 మంది గార్డులను ప్రత్యేకంగా అలాట్ చేయనున్నట్టు సమాచారం. ఇందులో ఇద్దరి నుండి నలుగురు కమెండోలు కూడా ఉండే అవకాశం ఉంది. రెండు రోజుల క్రితం ఈటల రాజేందర్ ను చంపేందుకు కుట్ర పన్నారంటూ ఆయన సతీమణి జమున మీడియా ముందు వెల్లడించారు. ఆడియో రికార్డులు ఉన్నాయని చెప్పిన ఆమె తన కుటుంబ సభ్యుల్లో ఏ ఒక్కరి రక్తపు బొట్టు చిందినా ఇందుకు ముఖ్యమంత్రి కేసీఆరే బాధ్యత వహించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. అయితే శామీర్ పేట నివాసంలో జమున ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలోనే ఇంటలీజెన్స్ బ్యూర్ (ఐబీ) బృందాలు హుజురాబాద్ లో పర్యటించడం విశేషం. గంటల వ్యవధిలోనే ఈటల రాజేందర్ కు కేంద్ర ప్రభుత్వం వై కేటగిరి సెక్యూరిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయన్న ప్రచారం జరిగింది. ఈ విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర మంత్రి కేటీఆర్ ఈటలకు రాష్ట్ర ప్రభుత్వమే సెక్యూరిటీ కల్పిస్తుందని ఇందుకు సంబంధించిన వివరాలు సేకరించాలని డీజీపీని ఆదేశించారు. దీంతో మేడ్చల్ డీసీపీ సందీప్ రావు నేతృత్వంలో పోలీసు టీమ్స్ శామీర్ పేటలోని ఈటల రాజేందర్ ఇంటి వద్ద అన్ని వివరాలను సేకరించాయి. ఈటల రాజేందర్ తో కూడా మాట్లాడిన డీసీపీ నివేదికను డీజీపీకి గురువారం పంపించారు. శుక్రవారం సాయంత్రానికల్లా ఈటల రాజేందర్ కు సెక్యూరిటీ ఇవ్వాలాని ప్రభుత్వం నిర్ణయించింది. మూడు, నాలుగు రోజుల్లోనే ఈటల రాజేందర్ మర్డర్ స్కెచ్ అంశం తెరపైకి రావడం రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరీటి చర్యలు తీసుకోవడం గమనార్హం.
Disha Dasha
1884 posts
Prev Post
Next Post