నిన్నటి వరకు జనాల నడుమ… నేడోమో భద్రత నడుమ

ఎమ్మెల్సీ కవిత వ్యవహారంలో ఊహించని ట్విస్ట్

నిన్నటి వరకు అంతర్జాతీయ మహిళా దినోత్పవాలు పురస్కరించుకుని రాష్ట్రమంతా కలియ తిరిగిన ఆ ఎమ్మెల్సీ ఒక్క సారిగా భద్రత వలయంలోకి వెల్లిపోయారు. మహిళా దినోత్సవమైన మార్చి 8నే ఆమె కీలక కార్యక్రమాలకు దూరంగా ఉండాల్సి వచ్చింది. కరీంనగర్ నుండి మొదలు మల్లరెడ్డి కాలేజీలో నిర్వహించిన కార్యక్రమం వరకు ప్రతి చోట ఆమె అంతర్జాతీయ మహిళా దినోత్సవాల్లో పాల్గొన్నారు. కొంతకాలంగా అంటీముట్టనట్టుగా వ్యవహరించిన కవిత ఇటీవల ప్రజల నడుమ ఉండేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. లిక్కర్ స్కాంలో ఆమె పేరు వెలుగులోకి వచ్చిన తరువాత అయితే జనాల మధ్య ఎక్కువ సేపు ఉండడం, వివిధ కార్యక్రమలతో ప్రజలతో కలిసి పోయేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఆమెకు కేంద్ర దర్యాప్తు సంస్థల నుండి నోటీసులు వచ్చినప్పుడల్లా కూడా భద్రత వలయం మధ్యకు వెల్లిపోతుండడం చర్చనీయాంశంగా మారింది.

నాడలా… నేడిలా…

గతంలో సీబీఐ నోటీసులు అందుకున్న కవిత ఇంటి వద్ద రాష్ట్ర ప్రభుత్వం భారీ భద్రతా చర్యలు తీసుకుంది. సీబీఐ విచారణ నేపథ్యంలో ఆమె ఇంటికి చేరుకున్న పార్టీ క్యాడర్, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు బాసటగా నిలిచారు. అప్పుడు ఆమె మీడియా ముందుకు వచ్చి మాట్లాడారు. ఆ తరువాత ప్రగతి భవన్ లో తండ్రి సమక్షంలో న్యాయ నిపుణలతో ప్రత్యేకంగా తర్ఫీదు పొందారు. సీబీఐ వేసే ప్రశ్నలు ఎలా ఉంటాయి..? ఎలా స్పందించాలి అన్న విషయాలపై క్షుణ్ణంగా అవగాహన పొందిన తరువాత సీబీఐ అధికారులు వచ్చి తన ఇంట్లో చేపట్టిన విచారణకు హాజరయ్యారు. అప్పటి నుండి ఎక్కువగా ప్రజల మధ్య ఉండేందుకు ప్రయత్నిస్తున్న కవిత మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని పలు కార్యక్రమాలకు హాజరయ్యారు. అనూహ్యంగా ఈడీ ఢీల్లీలో జరిపే విచారణకు ఈ నెల 9న రావాలని నోటీసులు ఇవ్వడంతో కవిత ఇంటి వద్ద మరో సారి భద్రతను పెంచేశారు. మంగళవారం మల్లారెడ్డి కాలేజీలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో స్టూడెంట్స్ తో కలిసి డ్యాన్స్ కూడా చేశారు కవిత. బుధవారం సీన్ అంతా మారిపోయి ఆమె ఇంటికే పరిమితం కాగా బంజరాహిల్స్ లో కవిత నివాసం ఉంటున్న రహదారులను పోలీసులు ఎక్కడికక్కడ మూసి వేస్తున్నారు. కవిత నిన్నటి వరకు జనాల మధ్య తిరిగి, నేడు భద్రతా వలయంలోకి వెల్లిపోవడం గమనార్హం.

You cannot copy content of this page