వరద తగ్గినా ఆగని కాఖీల సేవలు
దిశ దశ, భూపాలపల్లి:
వరద బీభత్సం చేసిన గాయాల నుండి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు కోలుకుంటున్నా ఆ రెండు జిల్లాల్లో ఏర్పడిన గాయం ఇప్పట్లో మానేలా లేదు. అడవుల జిల్లా… ఆదివాసీల ఖిల్లాగా పేరొందిన ఆ రెండు జిల్లాల్లో వరదలు సృష్టించిన అతలాకుతలం అంతా ఇంతా కాదు. ఊర్లకు ఊర్లనే ముంచెత్తిన వరదలు జనజీవనాన్ని భయం గుప్పిట చేర్చాయి. వరదల ధాటికి గల్లంతయిన వారి ఆచూకి కోసం ఆ కుటుంబాలు కళ్లల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తుంటే అక్కడి పోలీసులు మాత్రం శవాల కోసం అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు. నిన్నటి వరకు వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో నిమగ్నం కాగా… నేడోమో గల్లంతయిన వారి ఆచూకి కోసం ఆరా తీస్తున్నారు.
వరదల సమయంలో…
మూడు రోజుల క్రితం దిగువ ప్రాంతాలైన భూపాలపల్లి, ములుగు జిల్లాలను ముంచెత్తిన వరద కారణంగా రెండు జిల్లాల జనం పడుతున్న మనోవేదన అంతా ఇంతా కాదు. భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామాన్ని నిండా ముంచిన వరదల వల్ల పాడిపంటలపై ఆధారపడి జీవిస్తున్న ఆ పల్లె జనం కట్టుబట్టలతో మాత్రమే మిగిలారు. వరదల వల్ల గ్రామంలోని వందలాది పశువులు చనిపోగా కొంతమంది గల్లంతయ్యారు. అయితే మోరంచపల్లి గ్రామస్థులు వరద నీటిలోనే చిక్కుకుని గంటల తరబడి బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీశారు. ఈ సమయంలో జిల్లా యంత్రాంగం రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించడం వల్ల చాలా మంది ప్రాణాలతో బయటపడ్డారు. వరదల్లో చిక్కుకున్న వారిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు బోట్లలో బయటకు తీసుకొచ్చినప్పటికీ భయం గుప్పిట చేరిన వారు అడుగు ముందుకేయలేకపోతున్నారు. ఈ పరిస్థితుల్లో వరద బాధితులను తమ భుజాలపై ఎత్తుకుని మరీ పునరావాస కేంద్రాలకు తరలించారు జిల్లాకు చెందిన పోలీసులు. బోట్లలో బయటకు రావడమే ఆలస్యం చకచకా బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించి తమలోని సేవా భావాన్ని చాటుకున్నారు.
తగ్గుముఖం పట్టిన తరువాత…
వరదలు తగ్గుముఖం పట్టడంతో ప్రతి ఒక్కరూ ఊపిరి పీల్చుకున్నప్పటికీ పోలీసు యంత్రాంగానికి మాత్రం ఇంకా రెస్ట్ దొరకడం లేదు. కంటిమీద కునుకు లేకుండా కాలినడకన తిరుగుతున్న పోలీసు యంత్రాంగం వరదలు తగ్గగానే బురదలో గాలింపు చర్యలు చేపట్టడం మొదలు పెట్టింది. మోరంచపల్లి గ్రామానికి చెందిన గల్లంతయిన వారి కోసం పోలీసులు వరద ప్రవహాం సాగిన ప్రాంతాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. బురదమయమైన భూముల్లో కాలి బాటన తిరుగుతూ డ్రోన్ల సాయంతో శవాల ఆచూకి కోసం వెతకడం ఆరంభించారు. శనివారం కొంతమంది మృతదేహాలు లభ్యం కాగా వాటిని తీసుకరావడానికి భూజాలపై మోయడం తప్ప మరో అవకాశం లేకుండా పోయింది. అసలే పంట చేలు.. ఆపై వరద నీటి ప్రవాహంతో బురదగా మారిపోయిన భూముల్లోకి వాహనాలు తిరిగే పరిస్థితి లేదని గమనించిన పోలీసు అధికారులు ఆ మృతదేహాలను స్థానికుల సహకారంతో మోసుకుంటూ తీసుకొచ్చారు. గల్లంతయిన వారి డెడ్ బాడీస్ ట్రేస్ అయ్యాయని అధికారులకు చెప్పి అక్కడే శవ పంచనామ జరిపించి అఖరి మజిలీ తంతును పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ శవాలను ఘటనా స్థలం నుండి తరలించేందుకు పోలీసు అధికారులు మోసుకుని మరీ బయటకు తీసుకుచ్చి బాధిత కుటుంబ సభ్యులు ఆఖరి చూపు నోచుకునేలా చేశారు. భుజాలపై శవాల బరువుతో ముందుకు సాగుతున్న పోలీసు అధికారులు భూమిలో కాలు వేస్తే జారుతున్నానిర్దేశించుకున్న లక్ష్యం వైపే అడుగులు వేశారు తప్ప వెనకడుగు మాత్రం వేయలేదు… ఇది కదా తెలంగాణ పోలీసుల సేవ అంటే.. ఇది కదా… కాఖీల ఔదార్యం అంటే..!