అక్కడ బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ
రాష్ట్రంలోని ఆ రెండు చోట్ల వైవిద్యమైన ప్రచారం సాగిస్తున్నాయి ఆ రెండు పార్టీలు. హైదరాబాద్ లోని ఉప్పల్, ఎల్ బినగర్, నిజామాబాద్ లోక సభ పరిధిలో విమర్శనాస్త్రాలు సంధించుకుటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ నగరంలో తీవ్రంగా పెరిగిన ఈ సాంప్రాదాయం తాజాగా జిల్లాలకు కూడా పాకింది.
నిన్న పసుపు బోర్డుపై…
నిజామబాద్, జగిత్యాల జిల్లాల్లోని పసుపు రైతుల కోసం ప్రత్యేకంగా పసుపు బోర్డు తెప్పిస్తానని మాట ఇచ్చిన నిజామబాద్ ఎంపీ పసుపు రంగు బోర్డు మాత్రమే ఇచ్చారని వ్యంగ్యాస్త్రాలు సంధిస్తూ శుక్రవారం నిజామాబాద్ పట్టణంలో పలు చోట్ల ఫ్లెక్సీలు వెలిశాయి. గెల్చిన ఐదు రోజుల్లోనే పసుపు బోర్డు అంటివి ఎంపీగారు, కేంద్ర మాత్రం నో అని చెప్తున్నారంటూ విమర్శలు చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం కలకలం సృష్టించింది. ఎంపీ ధర్మపురి అరవింద్ లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఈ ప్లెక్సీల గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
నేడు ప్రా‘మిస్స’యిన చిట్టా…
శనివారం నిజామాబాద్ లోక సభ పరిధిలో బీఆర్ఎస్ పార్టీయే లక్ష్యంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు సంచలనంగా మారాయి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం అయిందంటూ తయారు చేసిన ఫ్లెక్సీలను ప్రధాన రహదారులు, జనవాసాల్లో ఏర్పాటు చేశారు. మరోవైపున ఈ రోజు ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటన కూడా ఉండడంతో ప్రత్యర్థులు విస్త్రృతంగానే ఏర్పాటు చేసినట్టు స్పష్టం అవుతోంది. ఆయా ఫెక్ల్సీల్లో గల్ఫ్ కార్మికుల సంక్షేమం ఏమైంది… ఎనఆర్ఐ సెల్ జాడేది, మాట ఇస్తే తల నరక్కుంటానన్న సీఎం కేసీఆర్ మాట తప్పడంటూ సెటైర్లు వేశారు. జగిత్యాల జిల్లా ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ వంద రోజుల్లో తెరిపిస్తానన్న మాట ఏమైందని, డబుల్ ఇండ్ల జాడేదని, నిరుద్యోగ భృతి ఎక్కడపోయిందని, ఏక కాలంలో రూ. లక్ష రుణమాఫీ అమలు ఏమైందని, దళితులకు మూడెకరాల భూమి సంగతేందని ఇలా రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల చిట్టాను ఎకరవు పెడ్తూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటన నేపథ్యంలో ఆమె పర్యటించే అవకాశం ఉన్న రహదారుల్లో కూడా ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం గమనార్హం.
ఒక్కటికి… పది…
శుక్రవారం పసుపు బోర్డు విషయంలో ఎంపీ అరవింద్ ను కార్నర్ చేస్తూ వెలిసిన ఫ్లెక్సీలకు కౌంటర్ గా శనివారం బీఆర్ఎస్ ప్రభుత్వం ఫెయిల్యూర్ హామీలను వేలెత్తి చూపుతూ కౌంటర్ అటాక్ చేయడం గమనార్హం. మీరొక్కటి పెడితే నేను పది చూపిస్తానన్న రీతిలో వెలిసిన ఈ ఫ్లెక్సీల గురించి అంతటా హాట్ టాపిక్ అవుతోంది.