యంగ్ లేడీ డాక్టర్… సూపర్బ్ సర్వీస్

అంతర్జాతీయ టీబీ డే సందర్భంగా పల్మనాలజిస్ట్ డాక్టర్ చందనపై స్పెషల్ స్టోరీ

ఇటీవలే ప్రాక్టీసు మొదలు పెట్టిన ఆ యంగ్ లేడీ డాక్టర్ కమర్షియల్ ఆలోచనలను దరి చేరనివ్వ లేదు. వైద్యం అంటే సేవ చేయడమేనన్న లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నారు. నేటి తరం స్పెషలిస్ట్ డాక్టర్ ఏంటీ ఇలా సర్వీస్ చేయాలన్న సంకల్పంతో ముందుకు సాగడం ఏంటని అనుకుంటున్నారా..? ఆ డాక్టర్ ప్రైవేట్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసి పట్టుమని 18 నెలలు మాత్రమే అవుతున్నా తన లక్ష్యం మాత్రం సేవేనని అంటున్నారు. చిన్ననాటి నుండి డాక్టర్ కావాలని కలలు కన్న ఆమె ప్రాక్టీసు మొదలు పెట్టిన తరువాత… తన చిన్నప్పటి నుండే తన గుండెల్లో దాచుకున్న సేవా భావాన్ని చేతల్లో చూపిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ టీబీ డే సందర్భంగా పల్మనాలజిస్ట్ డాక్టర్ చందనపై స్పెషల్ స్టోరీ.

కరీంనగర్ సంతోష్ నగర్ కు చెందిన డాక్టర్ చందన రెండేళ్ల క్రితం పల్మనాలజిస్ట్ లో పీజీ పూర్తి చేసి రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ప్రాక్టీస్ ప్రారంభించారు. భర్త సతీష్ రెడ్డి రేడియాలజిస్ట్ కావడంతో ఇద్దరు సిరిసిల్లలో స్థిరపడ్డారు. పేదరికంతో అల్లాడుతూ ఉండే వారికే ఎక్కువగా క్షయ(టీబీ) వ్యాధి సోకుతున్న విషయాన్ని గమనించిన డాక్టర్ చందన వారిలో చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. చేసేది ప్రైవేట్ ప్రాక్టీసే అయినా కమర్షియల్ గా ఆలోచించి పేషెంట్ల ముక్కుపిండి డబ్బులు వసూలు చేయాలన్న దృక్ఫథానికి భిన్నంగా ముందుకు సాగుతున్నారు. ప్రాక్టీస్ మొదలు కాగానే ఇంతకాలం వేచి చూసిందంతా డబ్బు కోసమే అన్నట్టుగా రోగులను నిట్టనిలువునా దోపిడీ చేసే కొంతమంది డాక్టర్లలా కాకుండా నిజాయితీగా టీబీ వ్యాధి గ్రస్తులకు బాసటనిస్తున్నారు. సిరిసిల్ల ప్రాంతంలో ప్రాక్టీస్ మొదలు పెట్టిన చందన ఇప్పటికి 50 మందికి టీబీ సోకినట్టుగా గుర్తించారు. వారి వివరాలను గవర్నమెంట్ టీబీ యూనిట్ కు అందించి చేతులు దులుపుకోకుండా పేషంట్లలో అవగాహన కల్పిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం టీబీ పేషెంట్లకు అందిస్తున్న ఆర్థిక సాయం, అలాగే వారికి ప్రతినెలా సరఫరా చేసే మెడిసిన్స్ గురించి వివరించి వాటినే వాడాలని, పోషకాహారం రెగ్యూలర్ గా తీసుకోవాలని సూచిస్తున్నారు. వాస్తవంగా డాక్టర్ చందన తన వద్దకు వచ్చిన పేషెంట్లకు ప్రిస్కిప్షన్ రాసి ప్రతి నెల రూ. 3 నుండి 4 వేల వరకు మెడిసిన్స్ తాను చెప్పిన మెడికల్ స్టోర్ లోనే కొనాలన్న కండిషన్ కూడా పెట్టవచ్చు. అంతేకాకుండా తాను చెప్పిన చోట మెడిసిన్స్ కొనుగోలు చేయకున్నా, పరీక్షలు చేయించుకోకున్నా మీకే నష్టం అన్న రీతిలో పేషెంట్లకు పరోక్షంగా వార్నింగ్ ఇవ్వవచ్చు. కానీ అసలే పేదరికంలో మగ్గుతున్న వారిని నిలువు దోపిడీ చేయడం సరికాదని సర్కారు మందులే వాడాలని సూచిస్తున్నారు. అవి క్వాలిటీ లేకుండా ఉంటాయన్న ప్రచారం కూడా తప్పని వ్యాధి సోకిన విధానాన్ని బట్టి కోర్సు ప్రకారం మెడిసిన్స్ కంటిన్యూ చేయాలని చెప్తున్నారు. దీనివల్ల ప్రైవేటులో కొనుగోలు చేసుకునే మందుల ఖర్చు డబ్బులను సప్లిమెంట్స్ కోసం వెచ్చించుకోవడమో లేక కుటుంబ అవసరాల కోసమో వినియోగించుకుంటారని ఈ చొరవ తీసుకుంటున్నారు డాక్టర్ చందన.

సప్లిమెంట్స్ ఇస్తూ…

మరో అడుగు ముందుకేసిన డాక్టర్ చందన శుక్రవారం అంతర్జాతీయ టీబీ డే సందర్భంగా సుమారు 20 మంది టీబీ పేషెంట్లకు సప్లిమెంట్స్ కూడా ఇచ్చేందుకు నిర్ణయించుకున్నారు. దీనివల్లో పోషకాహారం గురించి వారిలో అవగాహన పెరగడంతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం దొరకకపోవడంతో వ్యాధి మరింత తీవ్ర రూపం దాలుస్తుందని గమనించి ఈ చొరవ తీసుకుంటున్నారు. ఏది ఏమైనా ఆర్థిక పరిపుష్టి తరువాతే మిగతావన్ని అనుకుంటున్న నేటి సమాజంలో వైద్యం అంటే ఎంతో కొంత సేవ కూడా చేయాలనుకున్న డాక్టర్ చందనను అభినందించాల్సిందే.

డాక్టర్స్ కపుల్స్ చందన సతీష్ రెడ్డి

You cannot copy content of this page